Share News

అలవోకగా ఆడేశారు..

ABN , Publish Date - Feb 07 , 2025 | 01:08 AM

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను కూడా టీమిండియా అదిరే విజయంతో ఆరంభించింది. వెటరన్‌ జడేజా (3/26)తో పాటు అరంగేట్ర పేసర్‌ హర్షిత్‌ రాణా (3/53) బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ను కట్టడి చేయగా.. ఆ తర్వాత...

అలవోకగా ఆడేశారు..

భారత్‌ ఘనవిజయం

గిల్‌, శ్రేయాస్‌, అక్షర్‌ హాఫ్‌ సెంచరీలు

జడేజా, రాణాలకు మూడేసి వికెట్లు

తొలి వన్డేలో ఇంగ్లండ్‌ చిత్తు

నాగ్‌పూర్‌: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను కూడా టీమిండియా అదిరే విజయంతో ఆరంభించింది. వెటరన్‌ జడేజా (3/26)తో పాటు అరంగేట్ర పేసర్‌ హర్షిత్‌ రాణా (3/53) బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ను కట్టడి చేయగా.. ఆ తర్వాత ఛేదనలో వైస్‌ కెప్టెన్‌ గిల్‌ (87), శ్రేయాస్‌ (59), అక్షర్‌ (52) కీలక అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో గురువారం జరిగిన ఈ తొలి వన్డేలో భారత్‌ మరో 11.2 ఓవర్లుండగానే 4 వికెట్ల తేడాతో బోణీ చేసింది. అలాగే సిరీ్‌సలో 1-0 ఆధిక్యంలో నిలవగా.. రెండో వన్డే ఆదివారం కటక్‌లో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. బట్లర్‌ (52), బెథెల్‌ (51) అర్ధసెంచరీలు సాధించగా, ఓపెనర్లు సాల్ట్‌ (43), డకెట్‌ (32) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గిల్‌ నిలిచాడు. ఈ వన్డేలో పేసర్‌ హర్షిత్‌, ఓపెనర్‌ జైస్వాల్‌ అరంగేట్రం చేశారు.


భారీ భాగస్వామ్యాలతో..: ఛేదనలో భారత్‌ 19 పరుగులకే ఓపెనర్లు రోహిత్‌ (2), జైస్వాల్‌ (15) వికెట్లను కోల్పోయింది. కానీ బరిలోకి దిగిన గిల్‌, శ్రేయా్‌సలతో పాటు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన అక్షర్‌ పటేల్‌ ఇంగ్లండ్‌ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొన్నారు. అలాగే వీరి మధ్య భారీ భాగస్వామ్యాలు నెలకొనడం విశేషం. ఆరంభంలో గిల్‌ నిదానం కనబర్చినా.. శ్రేయాస్‌ మాత్రం టీ20 ఆటతీరును రుచి చూపించాడు. బౌలర్‌ ఎవరైనా అలవోకగా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ఆర్చర్‌ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లు బాదిన తను కేవలం 30 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అందులో 44 పరుగులు బౌండరీల రూపంలోనే రావడం విశేషం. కానీ 16వ ఓవర్‌లో బెథెల్‌ అతడిని ఎల్బీ చేయడంతో మూడో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే అతడి వికెట్‌ తీసిన సంబరంలో ఉన్న ఇంగ్లండ్‌కు ఆ తర్వాత చుక్కలు కనిపించాయి. శ్రేయాస్‌ అవుటయ్యాక గిల్‌ జోరు పెంచాడు. అటు కుడి-ఎడమ చేతి కాంబినేషన్‌ కోసం రాహుల్‌కన్నా ముందే ఐదో స్థానంలో అక్షర్‌ను బరిలోకి దించారు. తను వచ్చీ రాగానే బాదుడు ఆరంభించడంతో ఇంగ్లండ్‌ బౌలర్లకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. 60 బంతుల్లో గిల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేయగా.. అక్షర్‌ మాత్రం 46 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఈ దశలో రషీద్‌ వరుస ఓవర్లలో అక్షర్‌, రాహుల్‌ (2)ల వికెట్లను తీశాడు. దీంతో నాలుగో వికెట్‌కు గిల్‌-అక్షర్‌ మధ్య నెలకొన్న 108 పరుగుల శతక భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు శతకం పూర్తి చేస్తాడనుకున్న గిల్‌ను 37వ ఓవర్‌లో సకీబ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. అప్పటికి జట్టు ఇంకా 14 పరుగుల దూరంలోనే ఉంది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా జడేజా (12 నాటౌట్‌), హార్దిక్‌ (9 నాటౌట్‌) 68 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించారు.


ఆరంభం బాగున్నా..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు మెరుపు ఆరంభం దక్కింది. ఓపెనర్‌ సాల్ట్‌ మాత్రం దూకుడైన ఆటతో భారత్‌ను భయపెట్టాడు. రాణా వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లోనైతే అతడు 6,4,6,4,0,6తో 26 పరుగులను రాబట్టాడు. మరో ఎండ్‌లో డకెట్‌ అడపాదడపా ఫోర్లతో సహకారం అందించాడు. అయితే అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ జోడీకి తొమ్మిదో ఓవర్‌లో బ్రేక్‌ పడింది. మూడో రన్‌ కోసం ప్రయత్నించిన సాల్ట్‌.. శ్రేయాస్‌ త్రోతో రనౌట్‌గా వెనుదిరగ్గా తొలి వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక తర్వాతి ఓవర్‌లోనే డకెట్‌, బ్రూక్‌ (0)లను రాణా అవుట్‌ చేయడంతో ఒక్కసారిగా స్కోరు మందగించింది. రూట్‌ (19) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాక బట్లర్‌, బెథెల్‌ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈక్రమంలో బట్లర్‌ 31వ ఓవర్‌లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కానీ కాసేపటికే అక్షర్‌కు చిక్కడంతో ఐదో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత బెథెల్‌ కూడా అర్ధసెంచరీ పూర్తి చేసినా.. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం కరువైంది. జడేజా పొదుపైన బౌలింగ్‌తో పాటు బెథెల్‌ వికెట్‌ తీశాడు. 44వ ఓవర్‌లో ఆర్చర్‌ 4,6,4తో 16 రన్స్‌తో అదరగొట్టాడు. కానీ మరో నాలుగు ఓవర్లలోనే జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది.


స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌: సాల్ట్‌ (రనౌట్‌) 43; డకెట్‌ (సి) జైస్వాల్‌ (బి) రాణా 32; రూట్‌ (ఎల్బీ) జడేజా 19; బ్రూక్‌ (సి) రాహుల్‌ (బి) రాణా 0; బట్లర్‌ (సి) పాండ్యా (బి) అక్షర్‌ 52; బెథెల్‌ (ఎల్బీ) జడేజా 51; లివింగ్‌స్టోన్‌ (సి) రాహుల్‌ (బి) రాణా 5; కార్స్‌ (బి) షమి 10; రషీద్‌ (బి) జడేజా 8; ఆర్చర్‌ (నాటౌట్‌) 21; సకీబ్‌ (స్టంప్‌) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 2; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 47.4 ఓవర్లలో 248 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-75, 2-77, 3-77, 4-111, 5-170, 6-183, 7-206, 8-220, 9-241, 10-248; బౌలింగ్‌: షమి 8-1-38-1; హర్షిత్‌ రాణా 7-1-53-3; అక్షర్‌ పటేల్‌ 7-0-38-1; హార్దిక్‌ పాండ్యా 7-1-37-0; కుల్దీప్‌ 9.4-0- 53-1; రవీంద్ర జడేజా 9-1-26-3.

భారత్‌: జైస్వాల్‌ (సి) సాల్ట్‌ (బి) ఆర్చర్‌ 15; రోహిత్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) సకీబ్‌ 2; గిల్‌ (సి) బట్లర్‌ (బి) సకీబ్‌ 87; శ్రేయాస్‌ (ఎల్బీ) బెథెల్‌ 59; అక్షర్‌ (బి) రషీద్‌ 52; రాహుల్‌ (సి అండ్‌ బి) రషీద్‌ 2; హార్దిక్‌ (నాటౌట్‌) 9; జడేజా (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 38.4 ఓవర్లలో 251/6; వికెట్ల పతనం: 1-19, 2-19, 3-113, 4-221, 5-225, 6-235; బౌలింగ్‌: ఆర్చర్‌ 7-1-39-1; సకీబ్‌ 6.4-0-47-2; కార్స్‌ 5-0-52-0; రషీద్‌ 10-1-49-2; బెథెల్‌ 3-0-18-1; లివింగ్‌స్టోన్‌ 5-0-28-0; రూట్‌ 2-0-10-0.

విరాట్‌కు గాయం

స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. బుధవారం రాత్రి తను మోకాలి నొప్పికి గురైనట్టు కెప్టెన్‌ రోహిత్‌ టాస్‌ సమయంలో తెలిపాడు. అయితే అతడి గాయం తీవ్రతపై బోర్డు ఇంకా స్పందించలేదు. చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు భారత్‌ మూడు మ్యాచ్‌లే ఆడనుండడంతో విరాట్‌ తదుపరి మ్యాచ్‌లో ఉంటాడా? లేడా? అనే సందేహం వ్యక్తమవుతోంది.


యశస్వి

సూపర్‌ క్యాచ్‌

అరంగేట్ర మ్యాచ్‌లోనే యశస్వీ జైస్వాల్‌ అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. జోరు మీదున్న ఓపెనర్‌ డకెట్‌ పదో ఓవర్‌లో పుల్‌ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే గాల్లోకి లేచిన బంతిని మిడ్‌ వికెట్‌ నుంచి జైస్వాల్‌ ముందుకు పరిగెత్తుతూ డైవ్‌ ద్వారా రెండు చేతుల్తో ఒడిసిపట్టుకున్నాడు. అసాధ్యం అనుకున్న ఈ క్యాచ్‌ను అందుకోవడంతో ఆ తర్వాత ఇంగ్లండ్‌ పరుగుల వేగం తగ్గి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.

1

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన వన్డేల్లో ఎక్కువ వికెట్లు (42) తీసిన బౌలర్‌గా జడేజా. అండర్సన్‌ (40)ను అధిగమించాడు.

1

హర్షిత్‌ రాణా (3/53) మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్ర మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా హర్షిత్‌ రాణా. అలాగే అరంగేట్ర వన్డేలో భారత్‌ తరఫున ఒకే ఓవర్‌లో ఎక్కువ పరుగులిచ్చుకున్న (26) బౌలర్‌గానూ రాణా నిలిచాడు.

5

అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు పూర్తి చేసిన ఐదో భారత బౌలర్‌గా జడేజా. కుంబ్లే (953), అశ్విన్‌ (765), హర్భజన్‌ (707), కపిల్‌ (687) ముందున్నారు.


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 07 , 2025 | 01:08 AM