T20 World Cup 2026: నేటి సాయంత్రం టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ రిలీజ్
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:59 PM
టీ20 ప్రపంచ కప్ 2026కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. క్రికెట్ ప్రియులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ టోర్నమెంట్ షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఇవాళ(మంగళవారం) సాయంత్రం 6.30కి టోర్నమెంట్ షెడ్యూల్ విడుదల కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: అతి త్వరలో టీ20 వరల్డ్ కప్(ICC Mens T20 World Cup-2026) జరగనున్న సంగతి తెలిసిందే. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. టీ20 వరల్డ్ కప్-2026కు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ (మంగళవారం) సాయంత్రం 6:30 గంటలకు విడుదల కానుంది. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి.
టీ20 ప్రపంచ కప్-2026 టోర్నమెంట్ లో భారత్(India), శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా(Australia), న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్టులు భాగం కానున్నాయి. ఇక ప్రపంచ కప్ మ్యాచ్‌లు భారత్‌లోని 5 స్టేడియాల్లో (అహ్మదాబాద్, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి), శ్రీలంక(Srilanka)లోని 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
బీసీసీఐ(BCCI), పీసీబీ మధ్య పరస్పర ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడుతుంది. పాకిస్తాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోని కొలంబోలో జరపనున్నారు. అలాగే సెమీఫైనల్స్ లోని ఒక మ్యాచ్‌కు ముంబయిలోని వాంఖడే వేదిక కానుంది. భారత్ జట్టు ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇక భారత్ లోని క్రికెట్ ప్రియులు టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ వెల్లడిని జియో హట్‌స్టార్(JioHotstar) యాప్ ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు.
ఇవి కూడా చదవండి:
Temba Bavuma: భారత్‌ను చిక్కుల్లో పెట్టేందుకు టెంబా బవుమా సరికొత్త వ్యూహం
Palak Muchhal: స్మృతి, పలాశ్‌ల పెళ్లిపై.. ముచ్చల్ సోదరి పలాక్ కీలక కామెంట్స్