Syed Kirmani in AndhraJyothy Interview: నేను హైదరాబాదీనే
ABN , Publish Date - Aug 12 , 2025 | 02:48 AM
తాను హైదరాబాదీనేనని, తనకు నగరంలో ఇల్లు కూడా ఉందని టీమిండియా దిగ్గజ వికెట్‌కీపర్, 1983 వరల్డ్‌కప్ హీరోల్లో ఒకరైన సయ్యద్ కిర్మాణీ తెలిపాడు. క్రికెట్‌లో తన అనుభవం, నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని...
ఇక్కడ ఇల్లు కూడా ఉంది
‘ఆంధ్రజ్యోతి’తో దిగ్గజ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ
తాను హైదరాబాదీనేనని, తనకు నగరంలో ఇల్లు కూడా ఉందని టీమిండియా దిగ్గజ వికెట్‌కీపర్, 1983 వరల్డ్‌కప్ హీరోల్లో ఒకరైన సయ్యద్ కిర్మాణీ తెలిపాడు. క్రికెట్‌లో తన అనుభవం, నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని భావిస్తే, తనకు అంతకంటే సంతోషం ఇంకేముంటుందన్న ఆయన.. తెలంగాణ రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నాడు. ‘ఆంధ్రజ్యోతి’తో కిర్మాణీ చెప్పిన మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే..
మా విజయం చిరస్మరణీయం
1983లో మేం వన్డే వరల్డ్‌కప్ గెలుస్తామని కలలో కూడా అనుకోలేదు. ఆ విశ్వకప్ భారత క్రికెట్‌కు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు గౌరవాన్ని తీసుకొచ్చింది. ఆ విజయం దేశంలో క్రికెట్ రూపురేఖలను సమూలంగా మార్చేసింది. అప్పటివరకు క్రికెట్‌ను ఒక ఆటగానే చూసిన భారతీయులు వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత క్రికెట్‌ను ఒక మతంగా ఆరాధించడం ప్రారంభించారు.
సరైన హెల్మెట్లు లేకుండానే..
సరైన హెల్మెట్లు, రక్షక కవచాలు లేకుండానే ప్రపంచంలోని మేటి పేస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. మాల్కం మార్షల్, మైకేల్ హోల్డింగ్, ఆండీ రాబర్ట్స్ బంతులు బుల్లెట్లలా దూసుకొచ్చేవి. వారి బౌలింగ్‌లో ఆడడాన్ని ఆస్వాదించేవాడిని కానీ భయపడే వాడిని కాదు. ఎందుకంటే జీవితంలో దేనికి భయపడినా మనం ఓడిపోయినట్టే. యువ క్రికెటర్లకు కూడా నేనిచ్చే సలహా ఒక్కటే. భయం లేకుండా తెగువతో స్వేచ్ఛగా ఆడితే తప్పకుండా కెరీర్‌లో విజయం సాధిస్తారు.
(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్)
నగరంతో అనుబంధం.. ప్రత్యేకం
నా ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే జరిగింది. ఆల్ సెయింట్స్ స్కూల్‌లో నాలుగో తరగతి వరకు చదివా. ఇప్పటికీ మల్లేపల్లిలో మాకు ఇల్లు ఉంది. మా నాన్నగారు అప్పటి నిజాం ప్రభుత్వ సచివాలయంలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. 1955లో నాన్న ఉద్యోగ రీత్యా మా కుటుంబం మైసూర్ వెళ్లింది. మా కిర్మాణీ వంశీయులు, బంధువులు ఇక్కడే ఉండడంతో హైదరాబాద్‌కు తరచూ వస్తుంటాం. నన్ను నేను హైదరాబాదీగానే భావిస్తా.
తెలంగాణ కోసం సిద్ధం..
గతంలో బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పనిచేశా. కర్ణాటక క్రికెట్ బోర్డులోనూ సేవలందించా. నా అనుభవం, నైపుణ్యాలు తెలంగాణ క్రికెట్‌కు పనికొస్తాయని అనుకుంటే, మెంటార్‌గా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా.
ఇవి కూడా చదవండి..
ఖరీదైన కారు కొన్న రోహిత్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ మరో షాకింగ్ డెసిషన్..?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..