South Africas Tailenders Shine: తోక తో కొట్టారు
ABN , Publish Date - Nov 24 , 2025 | 06:16 AM
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు తేలిపోయారు. ఆదివారం ఆటలో టెయిలెండర్లు సెనురన్ ముత్తుసామి (109), మార్కో యాన్సెన్ (93) అసాధారణ ఇన్నింగ్స్‌తో అలరించారు. వీరికి...
రెండో టెస్టు
ముత్తుసామి శతకం
యాన్సెన్ సెంచరీ మిస్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 489
చెమటోడ్చిన భారత బౌలర్లు
టాప్-5 ఆటగాళ్లంతా ఓ మాదిరి స్కోర్లకే పరిమితం కాగా.. తొలి రోజు ఆటలోనే ఆరు వికెట్లు ఫట్. ఇంకేముంది మిగిలిన వికెట్లను చకచకా పడగొట్టి భారత్ తమ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తుందనే అంతా భావించారు. కానీ ఆదివారమంతా దక్షిణాఫ్రికాదే ఆధిపత్యంగా సాగింది. టెయిలెండర్ల నుంచి అనూహ్య పోరాటం ఎదురవడంతో.. మన బౌలర్లకు చుక్కలు కనిపించాయి. బంతులు వేసీ వేసీ అలసిపోయారే తప్ప రెండు సెషన్లలో కలిపి తీసింది ఒక్క వికెట్‌నే. అటు ఏడో నెంబర్ బ్యాటర్ ముత్తుసామి శతకం అందుకోగా.. తొమ్మిదో నెంబర్ బ్యాటర్ యాన్సెన్ ఏకంగా 93 రన్స్‌తో అదుర్స్ అనిపించాడు. ఈ జోడీ ఎదురుదాడికి సఫారీలు సిరీస్‌ను శాసించే స్థితిలో నిలిచారు.
గువాహటి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు తేలిపోయారు. ఆదివారం ఆటలో టెయిలెండర్లు సెనురన్ ముత్తుసామి (109), మార్కో యాన్సెన్ (93) అసాధారణ ఇన్నింగ్స్‌తో అలరించారు. వీరికి వెరీన్ (45) కూడా సహకరించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్పిన్నర్ కుల్దీప్‌నకు నాలుగు.. పేసర్లు బుమ్రా, సిరాజ్‌లతో పాటు మరో స్పిన్నర్ జడేజాకు రెండేసి వికెట్లు దక్కాయి. చివరి సెషన్ ఆఖర్లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 9 పరుగులతో ఉంది. వెలుతురు లేమితో ఆట కాస్త ముందుగానే ముగియగా, క్రీజులో ఓపెనర్లు జైస్వాల్ (7), రాహుల్ (2) ఉన్నారు. భారత్ ఇంకా 480 పరుగులు వెనుకబడి ఉండడంతో సిరీ్‌సను సమం చేయడం కష్టమే.
అద్భుత భాగస్వామ్యం: 247/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ఆరంభించిన దక్షిణాఫ్రికా దాదాపు మూడు సెషన్ల పాటు ఆడి మరో 242 పరుగులు జోడిస్తుందని ఎవరూ ఊహించివుండరు. లెఫ్ట్ హ్యాండర్ ముత్తుసామి స్పెషలిస్ట్ బ్యాటర్‌గా భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న తీరు ఆకట్టుకుంది. పిచ్ పేస్, స్పిన్‌కు సహకారం అందించకపోవడంతో తొలి సెషన్‌లో వికెట్ తీయలేకపోయారు. ఆరంభంలో ఆచితూచి ఆడినా కుదురుకున్నాక ముత్తుస్వామి, వెరీన్ బౌండరీలతో ఆకట్టుకున్నారు. అద్భుత డిఫెన్స్ కనబర్చిన ముత్తు అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరూ వికెట్ కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆచితూచి ఆడి టీ బ్రేక్‌కు వెళ్లారు. రెండో సెషన్‌లో కాసేపటికే భారత ఎదురుచూపులు ఫలించాయి. జడేజా ఓవర్‌లో ముందుకు వచ్చి ఆడిన వెరీన్‌ను పంత్ స్టంపౌట్ చేయడంతో ఏడో వికెట్‌కు 88 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది.

యాన్సెన్ ధనాధన్: వెరీన్ నిష్క్రమణతో వచ్చిన యాన్సెన్ ఆట స్వరూపాన్నే మార్చేశాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుంటూ అలవోకగా సిక్సర్లు బాదేయడంతో స్కోరు వేగంగా పెరిగింది. అతడిని చూసి ముత్తుసామి కూడా కుల్దీప్ ఓవర్‌లో 6,4తో గేరు మార్చాడు. ఈ ధాటికి తన తొలి శతకం కూడా పూర్తయ్యింది. అటు 53 బంతుల్లోనే యాన్సెన్ ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే చివరి సెషన్ రెండో ఓవర్‌లోనే ముత్తుసామి మారథాన్ ఇన్నింగ్స్‌కు సిరాజ్ ముగింపు పలికాడు. ఫైన్ లెగ్‌లో జైస్వాల్ క్యాచ్ అందుకోవడంతో ఎనిమిదో వికెట్‌కు 107 బంతుల్లో 97 పరుగుల మెరుపు భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు యాన్సెన్ మాత్రం దూకుడును ఆపలేదు. వరుసగా జడేజా ఓవర్‌లో రెండు సిక్సర్లు, సిరాజ్ ఓవర్‌లో 4,6తో బెంబేలెత్తించాడు. అటు హార్మర్ (5)ను బుమ్రా బౌల్డ్ చేయడంతో జట్టు తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అయితే ఆఖరి వికెట్‌కు కేశవ్ (12 నాటౌట్) అండగా నిలవడంతో యాన్సెన్ సెంచరీ ఖాయమనిపించింది. కానీ శతకం సాధించే క్రమంలో గేమ్‌ప్లాన్‌ను మార్చుకుని డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. దీంతో ఒత్తిడికి గురై 7 పరుగుల దూరంలో కుల్దీప్ గూగ్లీకి బౌల్డ్ కావడంతో నిరాశ తప్పలేదు. మరోవైపు సఫారీల అద్భుత పోరాటం కూడా ముగిసింది.
స్కోరుబోర్డు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్‌క్రమ్ (బి) బుమ్రా 38, రికెల్టన్ (సి) పంత్ (బి) కుల్దీప్ 35, స్టబ్స్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 49, బవుమా (సి) జైస్వాల్ (బి) జడేజా 41, డి జోర్జి (సి) పంత్ (బి) సిరాజ్ 28, ముల్డర్ (సి) జైస్వాల్ (బి) కుల్దీప్ 13, ముత్తుస్వామి (సి) జైస్వాల్ (బి) సిరాజ్ 109, వెరీన్ (స్టంప్) పంత్ (బి) జడేజా 45, యాన్సెన్ (బి) కుల్దీప్ 93, హార్మర్ (బి) బుమ్రా 5, కేశవ్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు: 21, మొత్తం: 151.1 ఓవర్లలో 489 ఆలౌట్. వికెట్ల పతనం: 1-82, 2-82, 3-166, 4-187, 5-201, 6-246, 7-334, 8-431, 9-462, 10-489. బౌలింగ్: బుమ్రా 32-10-75-2, సిరాజ్ 30-5-106-2, నితీశ్ 6-0-25-0, సుందర్ 26-5-58-0, కుల్దీప్ 29.1-4-115-4, జడేజా 28-2-94-2.
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వీ జైస్వాల్ (బ్యాటింగ్) 7, రాహుల్ (బ్యాటింగ్) 2; ఎక్స్‌ట్రాలు:0, మొత్తం: 6.1 ఓవర్లలో 9/0. బౌలింగ్: యాన్సెన్ 3.1-1-9-0, ముల్డర్ 3-3-0-0.
1
సౌతాఫ్రికా తరఫున ఓ ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు (7) బాదిన బ్యాటర్‌గా డివిల్లీర్స్, డికాక్‌లతో సమంగా నిలిచిన యాన్సెన్. భారత్‌పై టెస్టుల్లో షాహిద్ అఫ్రీదితో సమంగా నిలిచాడు.
2
తొమ్మిది అంతకన్నా దిగువ బ్యాటర్లలో ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు (7) బాదిన రెండో బ్యాటర్‌గా యాన్సెన్. టిమ్ సౌథీ 9 సిక్సర్లతో టాప్‌లో ఉన్నాడు.
ఇవీ చదవండి:
అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..
ఊహించని పరిణామం.. స్మృతి మంధాన పెళ్లి వాయిదా..