IND VS SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ABN , Publish Date - Nov 14 , 2025 | 09:44 AM
శుక్రవారం ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన సఫారీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్, దక్షిణాఫ్రికా(India vs South Africa Test) మధ్య రెండు మ్యాచుల టెస్టు సిరీస్ సమరం ప్రారంభమైంది. ఈ సిరీస్ లో భాగంగా శుక్రవారం కోల్ కతాలోని ఈడెన్ గార్డె్న్(Eden Gardens ) వేదికగా తొలి టెస్టు షురూ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 2015 తర్వాత భారత్ లో జరిగిన ఎనిమిది టెస్టుల్లో దక్షిణాఫ్రికా తొలిసారి టాస్ గెలిచింది. చివరిసారిగా 2010లో ఇదే వేదికపై సఫారీ జట్టు టాస్ గెలిచింది.
ఈ మ్యాచ్‌కు సఫారీ స్టార్ ఫాస్ట్ బౌలర్ రబాడ దూరమయ్యాడు. అతడి స్ధానంలో బాష్ తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌లో గాయపడి విండీస్‌తో సిరీస్‌కు దూరమైన టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh Pant) ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేయనున్నాడు. భారత్-ఎ తరఫున విశేషంగా రాణించిన మరో వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్(Dhruv Jurel) స్పెషలిస్ట్ బ్యాటర్‌గా దిగనున్నాడు. వీళ్లిద్దరితో భారత్ మిడిల్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభాన్నివ్వాలని జట్టు కోరుకుంటోంది.
సాయి సుదర్శన్ ఈసారైనా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరుగుల వరద పారిస్తాడేమో అని టీమిండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నాు. భారత బ్యాటర్లు పరిస్థితులకు తమను తాము అన్వయించుకుని, స్పిన్నర్లను సహనంతో ఎదుర్కోవడం కీలకం. భారీ స్కోరు సాధిస్తే సౌతాఫ్రికా(South Africa) జట్టును ఒత్తిడిలోకి నెట్టొచ్చు. ఇక భారత్ స్పిన్ భారాన్ని జడేజా(Jadeja), సుందర్, కుల్‌దీప్ పంచుకుంటారు. ఈడెన్‌లో బంతి విపరీతంగా తిరిగే పిచ్‌ను తయారు చేయలేదని బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు గంగూలీ చెప్పాడు. ఇది బుమ్రాకు సంతోషాన్నిచ్చే విషయమే. ఆరంభంలో పరిస్థితులను అతడు ఉపయోగించుకుంటే ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టాలు తప్పవు.
తుది జట్లు
భారత్: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
సౌతాఫ్రికా : ఐడెన్ మార్క్‌రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్(వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్