South Africa Women Reach World Cup Final: ఫైనల్లో సఫారీలు
ABN , Publish Date - Oct 30 , 2025 | 03:14 AM
ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్‌ను సొంతం చేసుకొనేందుకు దక్షిణాఫ్రికా మహిళలు అడుగు దూరంలో నిలిచారు. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో సఫారీలు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. 125 పరుగుల తేడాతో మాజీ చాంపియన్...
సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్ లారా వోల్వార్ట్
మరిజానెకు ఐదు వికెట్లు
చిత్తుగా ఓడిన ఇంగ్లండ్
గువాహటి: ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్‌ను సొంతం చేసుకొనేందుకు దక్షిణాఫ్రికా మహిళలు అడుగు దూరంలో నిలిచారు. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో సఫారీలు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. 125 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 319 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వార్ట్ (169) సెంచరీతో కదం తొక్కింది. తజ్మిన్ బ్రిట్స్ (45), మరిజానె కాప్ (42), ట్రయన్ (33) రాణించారు. స్పిన్నర్ ఎకిల్‌స్టోన్ నాలుగు వికెట్లు పడగొట్టింది. భారీ ఛేదనలో పేసర్ కాప్ (5/20) ధాటికి ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బ్రంట్ (64), కాప్సీ (50) హాఫ్ సెంచరీలు చేశారు. డిక్లెర్క్ రెండు వికెట్లు కైవసం చేసుకుంది. వోల్వార్ట్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.
ఆ ఇద్దరూ ఆడకుంటే..: ఛేదనలో కాప్ వణికించడంతో ఇంగ్లండ్ ఒక పరుగుకే మూడు వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో బ్రంట్, కాప్సీ నాలుగో వికెట్‌కు 107 పరుగులు జత చేయడంతో ఇంగ్లండ్ పరువు దక్కించుకుంది. ఆపై దక్షిణాఫ్రికా బౌలర్లు మళ్లీ విజృంభించడంతో ఇంగ్లండ్ కనీసం 200 పరుగులు కూడా చేయలేకపోయింది.
వోల్వార్ట్ ఒంటి చేత్తో..: కెప్టెన్ ఆట ఎలా ఉండాలో నిరూపిస్తూ వోల్వార్ట్ ఒంటిచేత్తో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను నడిపించింది. మరో ఓపెనర్ బ్రిట్స్ జతగా మొదటి వికెట్‌కు వోల్వార్ట్ 116 పరుగులు జోడించింది. కానీ 23వ ఓవర్లో బ్రిట్స్, బాష్ (0) బౌల్డ్ చేసిన స్పిన్నర్ ఎకిల్‌స్టోన్ సఫారీలకు షాకిచ్చింది. కానీ కాప్ జతగా నాలుగో వికెట్‌కు 72 పరుగులు జత చేసిన లారా ఆపై, ట్రయన్ జతగా ఏడో వికెట్‌కు 89 పరుగులు జోడించి జట్టును ఆదుకుంది.
దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 319/7 (వోల్వార్ట్ 169, బ్రిట్స్ 45, కాప్ 42, ట్రయన్ 33 నాటౌట్, ఎకిల్‌స్టోన్ 4/44, లారెన్ బెల్ 2/55)
ఇంగ్లండ్: 42.3 ఓవర్లలో 194 ఆలౌట్ (బ్రంట్ 64, కాప్సీ 50, డానీ వ్యాట్ 34, లన్సీ స్మిత్ 27, కాప్ 5/20, డి క్లెర్క్ 2/24).
Also Read:
రింకూ సింగ్-ప్రియ సరోజ్ లవ్ స్టోరీ రివీల్
సూర్య బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు: అభిషేక్ నాయర్