Share News

సఫారీలు సాధించారు

ABN , Publish Date - Jun 15 , 2025 | 05:01 AM

రెండేళ్ల పాటు అద్భుత విజయాలతో సాగిన దక్షిణాఫ్రికా ప్రయాణం.. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పను కైవసం చేసుకోవడంతో ముగిసింది. శనివారం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన...

సఫారీలు  సాధించారు

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌గా దక్షిణాఫ్రికా

ఫైనల్లో ఆసీ్‌సపై ఘనవిజయం

27 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ టైటిల్‌ సొంతం

ప్రైజ్‌మనీ

దక్షిణాఫ్రికాకు - రూ. 31.05 కోట్లు

ఆస్ట్రేలియాకు - రూ. 18.63 కోట్లు

ఏళ్లు కాదు.. దశాబ్దాలపాటు ఎదురుచూసిన తరుణమిది. తమ శక్తి యుక్తులన్నీ ధారపోసి పోరాడినా ఐసీసీ టోర్నీల్లో నిరాశగా వెనుదిరగడమే చూసిన దక్షిణాఫ్రికా ఇప్పుడు సగర్వంగా ‘గద’ ఎత్తుకుంది. ఒత్తిడికి చిత్తయ్యే జట్టంటూ.. చోకర్స్‌గా ముద్ర వేసి క్రీడాలోకం పరిహసించినా.. క్రికెట్‌ పుట్టినిల్లుగా భావించే లార్డ్స్‌లోనే ‘ఇదిగో ఇదీ మా సత్తా’ అంటూ వరల్డ్‌ టెస్టు చాంపియన్స్‌ హోదాలో పోడియంపై నిలిచింది. బలమైన ప్రత్యర్థి ఆసీస్‌ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో విలవిల్లాడిన బ్యాటర్లు లక్ష్య ఛేదనలో మాత్రం తెగించి నిలబడ్డారు. శతక వీరుడు మార్‌క్రమ్‌తో పాటు చీలమండ గాయం ఇబ్బందిపెట్టినా గెలుపు కోసం కెప్టెన్‌ బవుమా క్రీజులో నిలిచిన తీరుకు వహ్వా.. అనాల్సిందే. దీంతో 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీల్లో సఫారీలు విజేతలయ్యారు

లండన్‌: రెండేళ్ల పాటు అద్భుత విజయాలతో సాగిన దక్షిణాఫ్రికా ప్రయాణం.. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పను కైవసం చేసుకోవడంతో ముగిసింది. శనివారం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన బవుమా సేన ఐసీసీ టెస్టు గదను సగర్వంగా అందుకుంది. అలాగే ఈ జట్టుకిది వరుసగా ఎనిమిదో టెస్టు విజయం కాగా.. 1998లో నాకౌట్‌ ట్రోఫీ తర్వాత రెండో ఐసీసీ టోర్నీ విజయం కావడం విశేషం. అటు ఇప్పటికే పది ఐసీసీ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న ఆసీస్‌ రెండోసారి డబ్ల్యూటీసీ టైటిల్‌పై ఆశలు పెట్టుకున్నా నిరాశే ఎదురైంది. 2010 (టీ20 వరల్డ్‌కప్‌) తర్వాత కంగారూలు ఓ ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఓడడం ఇదే తొలిసారి. నాలుగో రోజు కేవలం విజయానికి 69 పరుగుల దూరంలో నిలిచిన సఫారీలు తమ రెండో ఇన్నింగ్స్‌లో 282/5 స్కోరు సాధించారు. మార్‌క్రమ్‌ (136), బవుమా (66) గెలుపులో కీలక పాత్ర పోషించారు. స్టార్క్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 212, సౌతాఫ్రికా 138 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులు సాధించిన ఆసీస్‌ ప్రత్యర్థి ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మార్‌క్రమ్‌ నిలిచాడు.


తొలి సెషన్‌లోనే..: నాలుగో రోజు 213/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన సౌతాఫ్రికా గెలుపునకు మరో 69 పరుగులే చేయాల్సివుంది. ఆసీస్‌ బౌలర్లు సఫారీలపై ఒత్తిడి పెంచేందుకు స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బంతులు విసిరారు. వికెట్ల కోసం ఆసీస్‌ తమకున్న మూడు రివ్యూలను కూడా వాడేసుకుంది. కొత్త బంతిని సైతం తీసుకున్నా.. మొక్కవోని ఏకాగ్రతతో బ్యాటర్లు క్రీజులో నిలిచారు. తొలి సెషన్‌లో కేవలం మూడు బౌండరీలు మాత్రమే వచ్చాయి. అయితే మూడో ఓవర్‌లోనే కెప్టెన్‌ బవుమాను కమిన్స్‌ దెబ్బతీయడంతో మూడో వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ మార్‌క్రమ్‌ వారికి అడ్డుగా నిలిచాడు. స్టబ్స్‌ (8)తో కలిసి నాలుగో వికెట్‌కు 24.. బెడింగమ్‌ (21 నాటౌట్‌)తో కలిసి ఐదో వికెట్‌కు 35 పరుగులు జోడించాడు. గెలుపునకు మరో 6 పరుగుల దూరంలో అతడి 6 గంటల 23 నిమిషాల సుదీర్ఘ పోరాటానికి పేసర్‌ హాజెల్‌వుడ్‌ తెరదించాడు. మార్‌క్రమ్‌కు ఇరు జట్ల ఆటగాళ్లతో పాటులార్డ్స్‌ ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు. చివరకు 84వ ఓవర్‌లో స్టార్క్‌ వైడ్‌ ఫుల్‌టా్‌సను కవర్‌ పాయింట్‌ వైపు వెరెయిన్‌ (4 నాటౌట్‌) సింగిల్‌ తీయడంతో దక్షిణాఫ్రికా అంతులేని సంబరాల్లో మునిగింది.

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 138 ఆలౌట్‌; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 207 ఆలౌట్‌ (స్టార్క్‌ 58 నాటౌట్‌, క్యారీ 43, లబుషేన్‌ 22; ఎన్‌గిడి 3/38, రబాడ 4/59);

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: 282/5 (మార్‌క్రమ్‌ 136, బవుమా 66; బెడింగమ్‌ 21; స్టార్క్‌ 3/66).


దక్షిణాఫ్రికా ఆడిన ఐసీసీ ఫైనల్స్‌

టోర్నీ ఏడాది ప్రత్యర్థి

నాకౌట్‌ ట్రోఫీ 1998 విండీ్‌సపై గెలుపు

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ 2023 ఆసీస్‌ చేతిలో ఓటమి

పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ 2024 భారత్‌ చేతిలో ఓటమి

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ 2024 కివీస్‌ చేతిలో ఓటమి

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప 2025 ఆసీ్‌సపై విజయం

2

లార్డ్స్‌ మైదానంలో రెండో అత్యధిక ఛేదన (282)ను సాధించిన జట్టుగా సౌతాఫ్రికా. 1984లో ఇంగ్లండ్‌పై 342 పరుగుల ఛేదనతో విండీస్‌ టాప్‌లో ఉంది.

3

డబ్ల్యూటీసీలో వరుసగా మూడో సీజన్‌లోనూ కొత్త విజేత రావడం విశేషం. గతంలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా చాంపియన్స్‌గా నిలిచాయి.

4

ఐసీసీ టోర్నమెంట్‌ ఫైనల్స్‌లో ఆసీస్‌ ఓడడం ఇది నాలుగోసారి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 05:01 AM