Smriti Mandhana: పెళ్లి రద్దు తరువాత తొలిసారిగా మీడియా ముందుకు స్మృతి మంధాన
ABN , Publish Date - Dec 10 , 2025 | 09:38 PM
పెళ్లి రద్దు తరువాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన భారత్ స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి టీమిండియా జెర్సీ ధరిస్తే మనసులో ఇతర ఆలోచనలన్నీ తొలగిపోయి ఆటపై చెదరని ఏకాగ్రత కుదురుతుందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి రద్దు తరువాత తొలిసారిగా భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఒక్కసారి టీమిండియా జెర్సీ ధరించాక మనసు మొత్తం ఆటపైనే లగ్నమవుతుందని చెప్పారు. శ్రీలంకతో డిసెంబర్ 21న జరగనున్న టీ20 సిరీస్‌కు స్మృతి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి కార్యక్రమం సందర్భంగా తన మనసులోని భావాలను పంచుకున్నారు (Smriti Mandhana).
‘ఇందాక హర్మన్ చెప్పినట్టు, నాకు క్రికెట్‌కు మించి ఇష్టమైనది జీవితంలో మరొకటి లేదు. బ్యాట్ పట్టి బరిలోకి దిగినప్పుడు మీరు యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఆ సమయంలో నాకు మనసులో మరే ఇతర ఆలోచనలు ఉండవు. టీమిండియా జెర్సీ ధరించినప్పుడు భారత ప్రతినిధిగా మ్యాచ్ గెలవాలన్న ఆలోచనే మనసంతా ఆవరిస్తుంది’
‘ఇండియా అని రాసున్న జెర్సీని ధరించడం ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఒక్కసారి ఆ జెర్సీ ధరించాక మనసులోని ఇతర ఆలోచనలను పక్కన పెట్టేయాలని నేను అందరికీ చెబుతుంటాను. ఎందుకంటే.. అది క్రీడాకారుల బాధ్యత. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మందిలో మీరు ఒకరు. ఈ ఒక్క ఆలోచనే ఆటపై మనసు పూర్తి స్థాయిలో లగ్నమయ్యేలా చేస్తుంది’ అని అన్నారు.
టీమిండియా సభ్యుల మధ్య భేదాభిప్రాయాలపై కూడా ఆమె స్పందించారు. ‘మొదటగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వాటిని నేను సమస్యలుగా చూడను. ఎందుకంటే జట్టులోని ప్రతి ఒక్కరూ టీమ్ గెలవాలనే అనుకుంటారు. ఈ విషయంలో ఆటను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అందరికీ వారివారి అభిప్రాయాలు ఉంటాయి. వాస్తవానికి అలాంటి చర్చలు, డిబేట్‌లు లేకపోతే మైదానంలో గెలుపు సాధ్యం కాదు. ఇలాంటి చర్చలు జరగట్లేదంటే ఆటపై అనురక్తి, గెలుపుపై కాంక్ష లేనట్టు. కాబట్టి కచ్చితంగా డిబేట్ జరగాలి’ అని అన్నారు.
నవంబర్ 23న జరగాల్సిన తమ వివాహం రద్దయినట్టు పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన ఇద్దరూ సోషల్ మీడియాలో ప్రకటించారు. పెళ్లికి కొద్ది రోజుల ముందు స్మృతి తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావడం, ఆ తరువాత పలాష్ కూడా ఆసుపత్రిలో చేరడం వరుసగా జరిగాయి. ఆ తరువాత పెళ్లి రద్దు ప్రకటన వెలువడింది.
ఇవీ చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ
నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్