బరిలోకి దిగకుండా ఆరుగురు భారత షట్లర్ల అడ్డగింత
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:30 AM
జర్మనీలో జరుగుతున్న వరల్డ్ యూనివర్సిటీ క్రీడలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన 12 మంది భారత ఆటగాళ్లలో సగం మందికి ఆడేందుకు...
వివాదాస్పదంగా వరల్డ్ యూనివర్సిటీ క్రీడలు
న్యూఢిల్లీ: జర్మనీలో జరుగుతున్న వరల్డ్ యూనివర్సిటీ క్రీడలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన 12 మంది భారత ఆటగాళ్లలో సగం మందికి ఆడేందుకు అనుమతి లభించలేదు. జర్మనీ వెళ్లిన ఆరుగురు షట్లర్లు అధికారుల వైఫల్యం కారణంగా బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. కాగా, ఈ నెల 16న జరిగిన మేనేజర్ల సమావేశంలో అందరి పేర్లను సరిగ్గా సమర్పించక పోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. అయితే, ఈ తప్పిదానికి కారణమేంటనేది కచ్చితంగా ఎవరూ బయటపెట్టడం లేదు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపడతామని భారత యూనివర్సిటీల సంఘం (ఏఐయూ) కార్యదర్శి పంకజ్ మిట్టల్ చెప్పాడు. ‘సమావేశంలో భారత్ తరఫున బరిలోకి దిగే 12 మంది ఆటగాళ్ల జాబితాను సమర్పించారు. ఆ లిస్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి మిస్ అయిన వారు, గాయపడిన వారి స్థానాలను మరొకరితో భర్తీ చేయాలి. అయితే, నిర్వాహకులు తేలిగ్గా తీసుకొన్నార’ని విశ్వసనీయ వర్గాల సమాచారం. కనీసం సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ కేటగిరీల్లో ఎవరెవరు బరిలోకి దిగుతారో కూడా పేర్కొనలేదట. కానీ, ట్రయల్స్‌లో విజేతలుగా నిలిచిన ప్లేయర్లు మిక్స్‌డ్ డబుల్స్ నుంచి తప్పుకోవడంతో.. అధికారులు ఆరుగురి పేర్లను మాత్రమే లేఖలో పొందుపరిచారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు సెలెక్షన్ ట్రయల్స్ నుంచి అవకతవకలు జరిగినట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ట్రయల్స్‌కే డుమ్మాకొట్టిన ఆటగాళ్లు కూడా ఈ టోర్నీకి ఎంపికైనట్టు ఆరోపణలు వినవస్తున్నాయి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి