Serena Williams: ఆసుపత్రికి సెరెనా యావదాస్తి.. ఈ వార్త నిజమేనా
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:24 AM
నిరాశ్రయులకు ఉచిత వైద్యం అందేలా ఓ ఆసుపత్రి నిర్మాణం కోసం టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ తన యావదాస్తిని ధారపోసిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్‌చల్...
లాస్‌ఏంజెల్స్: నిరాశ్రయులకు ఉచిత వైద్యం అందేలా ఓ ఆసుపత్రి నిర్మాణం కోసం టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ తన యావదాస్తిని ధారపోసిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్‌చల్ చేస్తోంది. ఎవరి అండా లేని, ఎలాంటి బీమా సౌకర్యం లేని వారి కోసం అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో 1200 పడకలతో ఓ ఆసుపత్రి నిర్మాణం చేపడుతోందనీ, ఇందుకోసం సెరెనా 500 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 4,477 కోట్లు) వెచ్చిస్తోందన్నది ఆ పోస్ట్ సారాంశం. రెండోసారి గర్భవతిగా ఉన్న సెరెనా ఆ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తున్నట్టుగా ఆ పోస్ట్‌లో ఫొటో కూడా ఉంది. అయితే, ఈ వార్త నిజమేనా అంటే.. ఇందులో వాస్తవం లేదని తేలింది. సెరెనా 2023లోనే రెండో బిడ్డకు జన్మనివ్వగా.. తాజా ఫొటోలో ఆమె ఇప్పుడు రెండోసారి గర్భవతి అని పేర్కొన్నారు. సెరెనా, ఆమె భర్త అలెక్సిస్ ఒహానియన్ సంపద మొత్తం కలిపినా 430 మిలియన్ డాలర్లుగానే ఉంది. కానీ, తాజా వార్తలో సెరెనా తన సంపదలో 500 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్టుగా పేర్కొనడం.. ఇంత పెద్ద వార్త అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒక్కదాంట్లోనూ రాకపోవడం చూస్తుంటే ఇది తప్పుడు ప్రచారమని స్పష్టమవుతోంది.
ఇవీ చదవండి:
రూపాయి పతనంపై దిగులొద్దు: సంజీవ్ సన్యాల్