Share News

Sanjeev Sanyal: రూపాయి పతనంపై దిగులొద్దు

ABN , Publish Date - Dec 19 , 2025 | 03:30 AM

డాలర్‌ మారకంలో రూపాయి పతనంపై ప్రభుత్వం ఏ మాత్రం ఆందోళన చెందడం లేదు. దేశంలో ధరల సెగకు (ద్రవ్యోల్బణం) దారి తీయనంత వరకు రూపాయి పతనంపై ఆందోళన చెందాల్సిన...

Sanjeev Sanyal: రూపాయి పతనంపై దిగులొద్దు

  • ధరల సెగ లేనంత వరకు ఓకే

  • అధిక వృద్ధి సమయంలో ఇది సహజమే

  • ‘వాణిజ్యం’పై అమెరికా ఒత్తిళ్లకు లొంగం

  • ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు

సంజీవ్‌ సన్యాల్‌

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి పతనంపై ప్రభుత్వం ఏ మాత్రం ఆందోళన చెందడం లేదు. దేశంలో ధరల సెగకు (ద్రవ్యోల్బణం) దారి తీయనంత వరకు రూపాయి పతనంపై ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని ప్రధాని ఆర్థిక సలహా మండలి(ఈఏసీ-పీఎం) సభ్యుడు సంజీవ్‌ సన్యాల్‌ స్పష్టం చేశారు. డాలర్‌తో రూపాయి మారకం రేటు ‘బేర్‌’మంటున్నా ప్రస్తుతం దేశంలో ధరల సెగ అదుపులోనే ఉందన్నారు. ఆర్థిక అభివృద్ధిని, రూపాయి పతనాన్ని కలిపి చూడడమే తప్పన్నారు. అధిక జీడీపీ వృద్ధి రేటు నమోదు చేస్తున్న దశలో జపాన్‌, చైనా దేశాల కరెన్సీలు కూడా ఇలాగే బలహీన పడిన విషయాన్ని సన్యాల్‌ గుర్తు చేశారు. మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం రేటు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.91 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో సన్యాల్‌ ఈ విషయం చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. డాలర్‌-రూపాయి మారకం రేటులో ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుందన్నారు.


మన ప్రయోజనాలే మిన్న

మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు ఉంటాయని సంజీవ్‌ సన్యాల్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అమెరికా, ఈయూ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం జరుగుతున్న చర్చలు ప్రస్తుతం తీవ్ర స్థాయిలోనే ఉన్నాయన్నారు. అమెరికాతో ఒప్పందం విషయంలో ఇప్పటికే ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్టు తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా, అదే సమయంలో ఆ దేశంతో విభేదాలు ముదరకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం భారత్‌, చైనా మాత్రమే అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా సుంకాలను ఎదుర్కొంటున్న విషయాన్ని సన్యాల్‌ గుర్తు చేశారు.

Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

For More Latest News

Updated Date - Dec 19 , 2025 | 03:30 AM