AI for MSMEs: ఎంఎస్ఎంఈలకు ఏఐ దన్ను
ABN , Publish Date - Dec 19 , 2025 | 03:36 AM
దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎ్‌సఎంఈ) కూడా కృత్రిమ మేధ (ఏఐ) బాట పట్టాలని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ)-భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) కోరాయి....
అదనంగా రూ.45 లక్షల కోట్ల లబ్ధి
బీసీజీ-ఫిక్కీ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎ్‌సఎంఈ) కూడా కృత్రిమ మేధ (ఏఐ) బాట పట్టాలని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ)-భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) కోరాయి. గురువారం నాడిక్కడ ఫిక్కీ నిర్వహించిన ‘ఏఐ ఇండియా కాంక్లేవ్’లో దీనికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేశాయి. ఏఐ ఆధారిత ఉత్పత్తి, నిర్వహణ విధానాల ద్వారా దేశంలోని 6.4 కోట్ల ఎంఎ్‌సఎంఈలు 50,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.45 లక్షల కోట్లు) మేర లబ్ధి పొందుతాయని ఈ నివేదిక పేర్కొంది. ఖర్చులు తగ్గి ఉత్పాదకత, పరపతి సౌకర్యాలు పెరగడం ద్వారా ఈ లబ్ధి చేకూరుతుందని తెలిపింది.
అయితే ఎంఎ్‌సఎంఈలు ఇందుకోసం ‘ముందు అనుసరించు’ అనే విధానాన్ని పక్కన పెట్టి ‘ముందు ఆవిష్కరించు’ అనే మనస్తత్వం అలవరుచుకుంటేనే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం అత్యధికంగా ఏఐ మార్కెట్ వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటైనా సరికొత్త ఆవిష్కరణలు, విలువ జోడింపుల్లో వెనుకబడి ఉందని నివేదిక పేర్కొంది. ప్రపంచ ఏఐ పేటెంట్స్‌లో ప్రస్తుతం భారత్ వాటా ఒక శాతం కూడా లేదని పేర్కొంది. ఏఐపై అవగాహన లేమి, సరైన డిజిటల్ మౌలిక సదుపాయాలు లేకపోవడం, చాలినంత మంది నిపుణులైన ఉద్యోగులు లభించక పోవడం ప్రస్తుతం భారత ఏఐ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని బీసీజీ-ఫిక్కీ నివేదిక పేర్కొంది.
ఆఫీసు ఉద్యోగాలకే ఎక్కువ ప్రమాదం
కృత్రిమ మేధ (ఏఐ).. ఆఫీసుల్లో పనిచేసే వైట్ కాలర్ ఉద్యోగుల ఉద్యోగాలకే ఎక్కువగా ఎసరు పెడుతుందని కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ హెచ్చరించారు. ఏఐ ఇండియా కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆలోచనా నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకూ ఈ ముప్పు తప్పదన్నారు. గత పారిశ్రామిక విప్లవాల్లో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదన్నారు. అయితే నిరంతరం నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా ఈ ఉద్యోగులు కూడా తమ ఉద్యోగావకాశాలు పెంచుకోవచ్చన్నారు. ఏఐ భారత్ వంటి వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థల ఉత్పాతకతను మరింత పెంచుతుందన్నారు.
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News