Share News

Asia Cup T20: గిల్‌ రాకతో సంజూకు చోటెక్కడ

ABN , Publish Date - Aug 13 , 2025 | 02:21 AM

టెస్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు ఆసియాకప్‌ టీ20 జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. దీంతో అతను ఏడాది విరామం తర్వాత పొట్టి ఫార్మాట్‌ ఆడబోతుండడంతో పాటు జట్టు వైస్‌ కెప్టెన్‌గానూ మారే అవకాశం ఉంది. అయితే, తన కెరీర్‌లో ఆడిన...

Asia Cup T20: గిల్‌ రాకతో సంజూకు చోటెక్కడ

టెస్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు ఆసియాకప్‌ టీ20 జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. దీంతో అతను ఏడాది విరామం తర్వాత పొట్టి ఫార్మాట్‌ ఆడబోతుండడంతో పాటు జట్టు వైస్‌ కెప్టెన్‌గానూ మారే అవకాశం ఉంది. అయితే, తన కెరీర్‌లో ఆడిన 21 మ్యాచ్‌ల్లో గిల్‌ ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. దీంతో ఆసియాక్‌పలోనూ అతను అభిషేక్‌ శర్మకు జతగా ఇన్నింగ్స్‌ ఆరంభించవచ్చు. అదే జరిగితే ఇప్పటిదాకా ఓపెనర్‌గా ఆడుతున్న సంజూ శాంసన్‌ పరిస్థితి ఏమిటన్న చర్చ మొదలైంది. భారత్‌ తరఫున 14 టీ20ల్లో టాపార్డర్‌లో బరిలోకి దిగిన శాంసన్‌ 182.20 స్ట్రయిక్‌ రేట్‌తో 512 పరుగులు సాధించాడు. అంతేకాకుండా ఓ క్యాలెండర్‌ ఏడాదిలో భారత్‌ తరఫున మూడు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. ఇవన్నీ అతను ఓపెనర్‌గా సాధించినవే. ఇలాంటి నేపథ్యంలో శాంసన్‌ను మరో స్థానంలో ఆడించడం ఎంతమేరకు సబబనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


మూడో స్థానం తప్పదా?

శాంసన్‌ కెరీర్‌లో భారత్‌ తరఫున మూడు టీ20ల్లో మాత్రమే వన్‌డౌన్‌లో దిగాడు. అయితే ఓవరాల్‌గా ఈ ఫార్మాట్‌లో అతడికి మూడో స్థానంలో 133 ఇన్నింగ్స్‌ ఆడిన అనుభవముంది. 3 సెంచరీలతో 4,136 పరుగులు సాధించాడు. అందుకే ఆసియాక్‌పలో గిల్‌, అభిషేక్‌తో ఓపెనింగ్‌ చేయిస్తే ఆ తర్వాత స్థానంలో శాంసన్‌ను ఆడించడం ఉత్తమం. లేని పక్షంలో అతడికి బెర్త్‌ కష్టమే అవుతుంది. సహజంగా కెప్టెన్‌ సూర్యకుమార్‌ నెంబర్‌ 4లో వస్తుంటాడు. తిలక్‌, హార్దిక్‌ ఆ తర్వాత వస్తారు కాబట్టి శాంసన్‌కు ఓపెనర్‌గా కాకుంటే వన్‌డౌన్‌ స్థానమే సరిపోతుంది. ఇక, ఈ టోర్నీ కోసం శాంసన్‌ తన సన్నాహకాలను ఆరంభించాడు. మంగళవారం తిరువనంతపురంలోని ఓ స్టేడియంలో కేరళ పోలీస్‌లతో కలిసి ప్రాక్టీస్‌ చేసిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 02:21 AM