Ind Vs Eng Match: ఫామ్‌లోకి వచ్చిన హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్‌పై కళ్లుచెదిరే సెంచరీ!
ABN , Publish Date - Feb 09 , 2025 | 09:44 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ పరుగుల వరద పారించాడు. 76 బంతుల్లో సెంచరీ చేసి పలు రికార్డులు బద్దలకొట్టాడు.

ఇంటర్నెట్ డెస్క్: సిక్సులు, ఫోర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చేశాడు. గత ఏడాదిగా సరైన స్కోర్ చూడక డీలా పడ్డ అభిమానుల్లో కొత్త జోష్ నింపుతూ ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ బాది సార్థక నామథేయుడని మరోసారి రుజువు చేసుకున్నాడు. కటక్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగిన రోహిత్ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులు) కేవలం 76 బంతుల్లో శతకాన్ని నమోదు చేసి వన్డేల్లో 32 సెంచరీ సాధించాడు.
IND vs PAK: టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..
ఈ సెంచరీతో రోహిత్ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఈసారి మొత్తం ఏడు సెక్సులు బాదిన హిట్‌మ్యాన్ వన్డేల్లో అత్యధిక సిక్సులు (338) బారిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. అంతుకుముందు, రెండో స్థానాన్ని వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్‌తో రోహిత్ పంచుకోగా తాజా సిక్సుల పరంపరతో గేల్‌ను వెనక్కు నెట్టినట్టైంది. ఇక 351 సిక్సులతో పాకిస్థానీ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ తొలి స్థానంలో ఉన్నాడు.
ఇక ఇంటర్నేషనల్ మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ రాహుల్ ద్రావిడ్‌ను అధిగమించి మూడో స్థానంలో నిలిచాడు. 100 సెంచరీలతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మొదటి స్థానంలో ఉండగా, కింగ్ కోహ్లీ 81 సెంచరీలు చేసి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ మళ్లీ ఇన్నాళ్లకు ఫామ్‌లోకి రావడంతో అభిమానుల్లో సంబరం అంబరాన్ని అంటింది. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పరుగుల వరద తప్పదన్న అంచనాలు ఊపందుకున్నాయి.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి