Share News

Vijay Hazare Trophy: చెలరేగిన రోహిత్‌ అలరించిన కోహ్లీ

ABN , Publish Date - Dec 25 , 2025 | 01:18 AM

విజయ్‌ హజారే ట్రోఫీ ఆరంభం అదిరింది. రోహిత్‌, కోహ్లీతోపాటు పలువురు టీమిండియా బ్యాటర్లు ఆడుతుండడంతో ఫ్యాన్స్‌ స్టేడియాలకు క్యూ కట్టారు. అందుకు తగ్గట్టే రో-కో శతకాలతో...

Vijay Hazare Trophy: చెలరేగిన రోహిత్‌ అలరించిన కోహ్లీ

విజయ్‌ హజారే ట్రోఫీ ఆరంభం అదిరింది. రోహిత్‌, కోహ్లీతోపాటు పలువురు టీమిండియా బ్యాటర్లు ఆడుతుండడంతో ఫ్యాన్స్‌ స్టేడియాలకు క్యూ కట్టారు. అందుకు తగ్గట్టే రో-కో శతకాలతో అలరించగా.. సకీబల్‌ గని, ఇషాన్‌ కిషన్‌, వైభవ్‌ సూర్యవంశీ వేగవంతమైన సెంచరీలతో మెరుపులు మెరిపించారు. మొత్తంగా టోర్నీలో పరుగుల వరద పారింది. ఇక, బిహార్‌ భారీ స్కోరుతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

చెలరేగిన రోహిత్‌ (155)

జైపూర్‌: రోహిత్‌ శర్మ (94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్సర్లతో 155) దుమ్మురేపడంతో.. గ్రూప్‌-సి మ్యాచ్‌లో ముంబై 8 వికెట్లతో సిక్కింను చిత్తు చేసింది. తొలుత సిక్కిం 50 ఓవర్లలో 236/7 స్కోరు చేసింది. ఆశిష్‌ థాపా (79) హాఫ్‌ సెంచరీ చేశాడు. శార్దూల్‌ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో ముంబై 30.3 ఓవర్లలో 237/2 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్‌.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొన్నాడు. లిస్ట్‌-ఎలో తన వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. అయితే, రోహిత్‌ను క్రాంతి అవుట్‌ చేశాడు. రఘువంశీ (38)తోపాటు ముషీర్‌ ఖాన్‌ (27 నాటౌట్‌), సర్ఫరాజ్‌ (8 నాటౌట్‌) రాణించారు.

అలరించిన కోహ్లీ (131)

బెంగళూరు: పదిహేనేళ్ల తర్వాత విజయ్‌ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లీ (101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131) సెంచరీతో చెలరేగాడు. దీంతో గ్రూప్‌-డి మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్లతో ఆంధ్రపై గెలిచింది. తొలుత ఆంధ్ర 50 ఓవర్లలో 298/8 స్కోరు చేసింది. రికీ భుయ్‌ (122) సెంచరీ సాధించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సిమర్‌జీత్‌ సింగ్‌ 5 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ఢిల్లీ 37.4 ఓవర్లలో 300/6 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్‌ అర్పిత్‌ రాణా (0)ను నితీశ్‌ డకౌట్‌ చేశాడు. దీంతో తొలి ఓవర్‌లోనే బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ.. మరో ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య (74)తో కలసి స్కోరు బోర్డును నడిపించాడు. కాగా, సెంచరీ పూర్తి చేసుకొన్న విరాట్‌ను సత్యనారాయణ రాజు అవుట్‌ చేశాడు. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (5) విఫలమైనా.. ఢిల్లీ అప్పటికే గెలుపునకు చేరువైంది.

77-Sports.jpg


అవుట్‌ చేయకుండా ఉండాల్సింది!

రాజుకు సందేశాల వెల్లువ

సెంచరీ అనంతరం సత్యనారాయణ రాజు బౌలింగ్‌లో కోహ్లీ క్యాచవుటయ్యాడు. కెరీర్‌లో రాజుకు ఇది చిరకాలం గుర్తిండి పోయేది. అయితే, కోహ్లీని అవుట్‌ చేయడంపై అతడి ఫ్యాన్స్‌ నిరాశను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కోహ్లీని అవుట్‌ చేయకుండా ఉండాల్సిందంటూ రాజు ఇన్‌స్టాకు సందేశాల మీద సందేశాలు పంపారు. ‘నాటౌట్‌గా ఉంచాల్సింది.. సోదరా’ అని ఒకరు పోస్టు చేస్తే.. ‘వాళ్లు వస్తూనే ఉంటారు. 131కే అవుట్‌ చేశావు. అయినా బాగా ఆడావు’ అని మరొకరు రాశారు.

1

లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఇన్నింగ్స్‌ పరంగా వేగంగా 16 వేల పరుగుల మైలురాయిని చేరిన ఆటగాడిగా కోహ్లీ (330 ఇన్నింగ్స్‌).. సచిన్‌ టెండూల్కర్‌ (391 ఇన్నింగ్స్‌)ను వెనక్కినెట్టాడు.

ఇవీ చదవండి:

మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్

బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ

Updated Date - Dec 25 , 2025 | 01:18 AM