Share News

Rohit and Virat Shine Whitewash Avoided: ఇద్దరూ ఇరగదీశారు

ABN , Publish Date - Oct 26 , 2025 | 03:31 AM

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియాకు ఓదార్పు విజయం దక్కింది. వెటరన్‌ స్టార్లు రోహిత్‌ శర్మ (125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 121 నాటౌట్‌) సెంచరీతో, విరాట్‌ కోహ్లీ (81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో బ్యాట్లు ఝుళిపించడంతో..

Rohit and Virat Shine Whitewash Avoided: ఇద్దరూ ఇరగదీశారు

  • సెంచరీ బాదిన రోహిత్‌

  • ఫామ్‌ చాటుకున్న విరాట్‌

  • ఆఖరి వన్డేలో ఆసీస్‌పై భారత్‌ ఘనవిజయం

ఇప్పటికే సిరీస్‌ పోయిన దశలో మూడో వన్డే నామమాత్రపు మ్యాచే.. అయితేనేం.. ప్రేక్షకులకదేమీ పట్టలేదు. ఆసీస్‌ గడ్డపై విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ చివరి ఆట చూసేందుకు ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్‌ మైదానం కిటకిటలాడిపోయింది. ఇంతటి అభిమానాన్ని ఆ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు కూడా ఏమాత్రం వమ్ము చేయలేదు. ఆసీస్‌ బౌలర్లపై ఆధిపత్యంతో రోహిత్‌ తన వింటేజ్‌ ఆటతీరును ప్రదర్శించగా, ఇక రెండు వరుస డకౌట్ల నుంచి తేరుకున్న విరాట్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌తో మైమరిపించాడు. అజేయంగా నిలిచిన ఈ ఇద్దరు భారత్‌ను వైట్‌వాష్‌ ముప్పు నుంచి తప్పించడంతో పాటు విమర్శకుల నోళ్లు మూయించారు.

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియాకు ఓదార్పు విజయం దక్కింది. వెటరన్‌ స్టార్లు రోహిత్‌ శర్మ (125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 121 నాటౌట్‌) సెంచరీతో, విరాట్‌ కోహ్లీ (81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో బ్యాట్లు ఝుళిపించడంతో మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించింది. అయితే సిరీ్‌సను 2-1తో ఆసీస్‌ దక్కించుకున్నప్పటికీ.. ఈ ఫార్మాట్‌లో తొలిసారిగా భారత్‌ను క్లీన్‌స్వీ్‌ప చేయాలనుకున్న కంగారూల కోరిక మాత్రం నెరవేరలేదు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. రెన్షా (56), కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (41), షార్ట్‌ (30) రాణించారు. హర్షిత్‌ రాణాకు 4, సుందర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్‌ 38.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 237 పరుగులు చేసి నెగ్గింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా రోహిత్‌ నిలిచాడు.


అదిరే ఆట: 237 పరుగుల ఛేదనలో ఓపెనర్‌ రోహిత్‌, విరాట్‌ కళ్లుచెదిరే ఆటతీరుతో ప్రేక్షకులను అలరించారు. వీరి ప్రతీ పరుగును వారంతా ఆస్వాదించారు. మరో ఓపెనర్‌ గిల్‌ (24)తో రోహిత్‌ తొలి వికెట్‌కు 69 రన్స్‌ అందించాడు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన పేసర్‌ హాజెల్‌వుడ్‌ 11వ ఓవర్‌లో గిల్‌ను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత ఆసీస్‌ బౌలర్లకు రో-కో చుక్కలు చూపించారు. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య క్రీజులోకి వచ్చిన విరాట్‌ తొలి సింగిల్‌ తీయగానే స్టేడియం మార్మోగిపోయింది. రెండు వరుస డకౌట్ల తర్వాత వచ్చిన పరుగు కావడంతో కోహ్లీ కూడా సరదాగా పిడికిలి బిగించి చూపాడు. జంపా, హాజెల్‌వుడ్‌ ఓవర్లలో ఒక్కో ఫోర్‌తో విరాట్‌ లయ అందుకున్నాడు. రోహిత్‌ సైతం జంపా ఓవర్‌లో సిక్సర్‌తో గేరు మార్చాడు. 56 బంతుల్లో విరాట్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేయగా, 105 బంతుల్లో రోహిత్‌ కెరీర్‌లో 33వ శతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత షార్ట్‌ ఓవర్‌లో రోహిత్‌ 6,4తో.. 39వ ఓవర్‌లో విరాట్‌ ఫోర్‌తో మరో 69 బంతులుండగానే మ్యాచ్‌ ముగిసింది.

2-Sports.jpg

చెక్‌ పెట్టిన రాణా: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీ్‌సను పేసర్‌ హర్షిత్‌ చక్కటి పేస్‌, బౌన్స్‌తో ఇబ్బందిపెట్టాడు. అలాగే ఫీల్డింగ్‌లో విరాట్‌, శ్రేయాస్‌ కళ్లు చెదిరే క్యాచ్‌లతో ఆకట్టుకున్నారు. ఓపెనర్లు మార్ష్‌, హెడ్‌ (29) వేగంగా ఆడి తొలి వికెట్‌కు 61 రన్స్‌ జోడించారు. ఆ తర్వాత బౌలర్ల ధాటికి ఆసీస్‌ నుంచి భారీ భాగస్వామ్యాలు ఏర్పడలేదు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు అక్షర్‌, సుందర్‌ కట్టడి చేయగా.. రాణా మిడిలార్డర్‌ను కుదురుకోనీయలేదు. దీంతో ఆసీస్‌ స్పల్ప స్కోరుకే పరిమితమైంది.


స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా: మార్ష్‌ (బి) అక్షర్‌ 41, హెడ్‌ (సి) ప్రసిద్ధ్‌ (బి) సిరాజ్‌ 29, షార్ట్‌ (సి) విరాట్‌ (బి) సుందర్‌ 30, రెన్షా (ఎల్బీ) సుందర్‌ 56, క్యారీ (సి) శ్రేయాస్‌ (బి) హర్షిత్‌ 24, కూపర్‌ (సి) విరాట్‌ (బి) హర్షిత్‌ 23, ఓవెన్‌ (సి) రోహిత్‌ (బి) హర్షిత్‌ 1, స్టార్క్‌ (బి) కుల్దీప్‌ 2, ఎలిస్‌ (సి) రోహిత్‌ (బి) ప్రసిద్ధ్‌ 16, జంపా (నాటౌట్‌) 2, హాజెల్‌వుడ్‌ (బి) హర్షిత్‌ 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 46.4 ఓవర్లలో 236 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-61, 2-88, 3-124, 5-195, 6-198, 7-201, 8-223, 9-236, 10-236. బౌలింగ్‌: సిరాజ్‌ 5-1-24-1, హర్షిత్‌ 8.4-0-39-4, ప్రసిద్ధ్‌ 7-0-52-1, కుల్దీప్‌ 10-0-50-1, అక్షర్‌ 6-0-18-1, సుందర్‌ 10-0-44-2.

భారత్‌: రోహిత్‌ (నాటౌట్‌) 121, గిల్‌ (సి) క్యారీ (బి) హాజెల్‌వుడ్‌ 24, విరాట్‌ (నాటౌట్‌) 74, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 38.3 ఓవర్లలో 237/1. వికెట్‌ పతనం: 1-69. బౌలింగ్‌: స్టార్క్‌ 5-0-31-0, హాజెల్‌వుడ్‌ 6-1-23-1, ఎలిస్‌ 7.3-0-60-0, కూపర్‌ 5-0-36-0, జంపా 10-0-50-0, ఓవెన్‌ 1-0-2-0, షార్ట్‌ 4-0-29-0.

మళ్లీ వస్తామో.. లేదో?

ఆసీ్‌సలో క్రికెట్‌ ఆడడం నాకిష్టం. 2008లో తొలిసారిగా ఇక్కడికి వచ్చా. అప్పుడు చాలా సరదాగా గడిచింది. ఇక మళ్లీ క్రికెటర్లుగా మేమిద్దరం (రోహిత్‌, విరాట్‌) ఇక్కడికి వస్తామో? రామో? తెలియదు. ఆసీ్‌సలో ఇంత చక్కటి ఆదరణ లభించడం అద్భుతంగా అనిపిస్తుంది. మమ్మల్ని ఆదరించిన ఆసీస్‌ ప్రేక్షకులకు కృతజ్ఞతలు.

రోహిత్‌ శర్మ


1

వన్డే, టీ20ల్లో కలిపి అత్యధిక పరుగులు (18,437) చేసిన బ్యాటర్‌గా విరాట్‌. సచిన్‌ (18,436)ను అధిగమించాడు.

వన్డేల్లో ఎక్కువ 150+ భాగస్వామ్యాలు (12) నమోదు చేసిన జోడీగా సచిన్‌-గంగూలీతో సమంగా నిలిచిన రోహిత్‌-విరాట్‌.

ఆసీ్‌సలో ఎక్కువ సెంచరీలు (6) చేసిన పర్యాటక బ్యాటర్‌గా రోహిత్‌.

అంతర్జాతీయ క్రికెట్‌లోని ప్రతీ ఫార్మాట్‌లోనూ కనీసం 5 శతకాలు బాదిన ఏకైక ప్లేయర్‌గా రోహిత్‌. టెస్టులు (12), వన్డేలు (33), టీ20లు (5) కలిపి ఓవరాల్‌గా అతడికిది 50వ సెంచరీ.

2

అతి పెద్ద వయస్సు (38)లో ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ గెలుచుకున్న భారత ప్లేయర్‌గా రోహిత్‌. ధోనీ (37)ని అధిగమించాడు.

వన్డేల్లో ఎక్కువ పరుగులు (14,255) సాధించిన రెండో బ్యాటర్‌గా విరాట్‌.

సచిన్‌ (18,426) ముందున్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి:

Gautam Gambhir's Reaction: రోహిత్ శర్మ 50వ సెంచరీ.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్

Rohit Sharma: ఫీల్డింగ్‌లోనూ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అదెలాగంటే?

Updated Date - Oct 26 , 2025 | 03:31 AM