Share News

Rivaba Jadeja: మా ఆయనకు చెడు అలవాట్లు లేవు కానీ.. రవీంద్ర జడేజా భార్య వ్యాఖ్యలతో కాంట్రవర్సీ

ABN , Publish Date - Dec 12 , 2025 | 03:58 PM

గుజరాత్ మంత్రి, రవీంద్ర జడేజా భార్య రివాబా తాజాగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తన భర్తకు ఎలాంటి చెడు అలవాట్లు లేవంటూనే మిగతా క్రికెటర్లు అలా కాదని ఆమె కామెంట్ చేయడంతో నెట్టింట పెద్ద చర్చ మొదలైంది.

Rivaba Jadeja: మా ఆయనకు చెడు అలవాట్లు లేవు కానీ.. రవీంద్ర జడేజా భార్య వ్యాఖ్యలతో కాంట్రవర్సీ
Rivaba jadeja

ఇంటర్నెట్ డెస్క్‌: గుజరాత్ మంత్రి, టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన భర్తను ప్రశంసిస్తూ ఇతర క్రికెటర్ల ప్రస్తావన తెచ్చారు. తన భర్తకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని రివాబా ప్రశంసించారు. విదేశీ టూర్లలో కూడా జడేజా బాధ్యతతో నడుచుకుంటారని, మిగతా క్రికెటర్లలో కొందరు మాత్రం ఇలా ఉండరని చెప్పారు. ఈ కామెంట్స్‌తో నెట్టింట కలకలం మొదలైంది (Rivaba Statement on Ravindra Jadeja).

‘నా భర్త క్రికెట్ కోసం లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి చోట్లకు వెళుతుంటారు. కానీ ఈ రోజు వరకూ ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఆయనకు తన బాధ్యత ఎంటో తెలుసు. మిగతా టీమ్ సభ్యులు మాత్రం అలా కాదు, కానీ వారిపై ఆంక్షలు కూడా ఏమీ ఉండవు’ అని అన్నారు. నిత్యం విదేశీ పర్యటనలతో బిజీబిజీగా గడిపే అంతర్జాతీయ క్రీడాకారులకు ఎదురయ్యే సవాళ్లను ప్రస్తావిస్తూ ఆమె ఈ కామెంట్స్ చేశారు. ‘నా భర్త దాదాపు 12 ఏళ్ల పాటు వివిధ దేశాలకు వెళ్లారు. అక్కడ ఆయనకు ఏదైనా చేసే స్వేచ్ఛ ఉంది. కానీ తన నైతిక బాధ్యత ఏమిటో ఆయనకు బాగా తెలుసు’ అని అన్నారు.


ఇదిలా ఉంటే, 2016లో విదేశీ టూర్‌లో ఉండగా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ బీర్ బాటిల్‌ పట్టుకుని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం కాంట్రవర్సీకి దారి తీసింది. దీంతో, రంగంలోకి దిగిన బీసీసీఐ క్రీడాకారులకు కీలక సూచన చేసింది. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోట్లాది మంది యువతకు రోల్ మోడల్స్ అయిన క్రికెటర్లు తమ నైతిక బాధ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించింది. ఈ నేపథ్యంలో రాహుల్ ఆ ఫొటోను కూడా డిలీట్ చేయాల్సి వచ్చింది.


ఇవీ చదవండి:

రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్న వినేశ్ ఫోగట్

పేలవ ప్రదర్శన.. సూర్యకు అసలు ఏమైంది?

Updated Date - Dec 12 , 2025 | 04:47 PM