South Africas Victory In 2nd T20: డికాక్ దంచేశాడు
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:10 AM
భారత్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఘనంగా పుంజుకుంది. తొలి మ్యాచ్‌లో 74 పరుగులకే కుప్పకూలిన ఈ జట్టు గురువారం జరిగిన రెండో టీ20లో తడాఖా చూపింది...
46 బంతుల్లో 90 రన్స్
దక్షిణాఫ్రికా ఘనవిజయం
తిలక్ పోరాటం వృథా
రెండో టీ20
ముల్లన్‌పూర్: భారత్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఘనంగా పుంజుకుంది. తొలి మ్యాచ్‌లో 74 పరుగులకే కుప్పకూలిన ఈ జట్టు గురువారం జరిగిన రెండో టీ20లో తడాఖా చూపింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 90) తన పేలవ ఫామ్‌కు చెక్ పెడుతూ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. దీంతో 51 పరుగుల తేడాతో నెగ్గిన సౌతాఫ్రికా సిరీ్‌సలో 1-1తో సమంగా నిలిచింది. ఆదివారం మూడో టీ20 జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. ఫెరీరా (16 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 30 నాటౌట్), మిల్లర్ (12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 20 నాటౌట్) ఆఖర్లో మెరుపు వేగంతో ఆడారు. మార్‌క్రమ్ (29) ఫర్వాలేదనిపించాడు. స్పిన్నర్ వరుణ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 62) ఒక్కడే రాణించాడు. బార్ట్‌మన్‌కు నాలుగు.. యా న్సెన్, ఎన్‌గిడి, సిపమ్లాలకు రెండేసి వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా క్వింటన్ డికాక్ నిలిచాడు.

తిలక్ పోరాడినా..: మంచు ప్రభావం అధికంగా ఉండడంతో భారత బ్యాటర్లు కూడా చెలరేగుతారని ఆశించినా.. సఫారీ బౌలర్లు వారికి ముకుతాడు వేశారు. తొలి ఓవర్ నుంచే వికెట్ల పతనం సాగడంతో ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేకపోయింది. తిలక్ వర్మ ఒక్కడే పోరాటం సాగించాడు. గిల్ (0), అభిషేక్ (17), సూర్యకుమార్ (5) పవర్‌ప్లేలోనే వెనుదిరగడం దెబ్బతీసింది. వన్‌డౌన్‌లో అక్షర్ (21) బరిలోకి దిగినా ఫలితం లేకపోయింది. హార్దిక్ (20)తో కలిసి ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు. అయితే గెలిచే అవకాశం లేకపోయినా.. నాలుగు పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లు నేలకూలడం గమనార్హం.
ఆది నుంచే దూకుడు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. డికాక్ ఆరంభంలో అర్ష్‌దీ్‌పను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లతో అదరగొట్టాడు. వరుణ్ వెంటనే ఓపెనర్ హెన్‌డ్రిక్స్ (8)ను బౌల్డ్ చేశాడు. 26 బంతుల్లోనే డికాక్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కెప్టెన్ మార్‌క్రమ్ వరుణ్ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లు బాదినా అతడికే చిక్కడంతో రెండో వికెట్‌కు 47 బంతుల్లోనే 83 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. హార్దిక్ ఓవర్‌లో 4,6తో 90కి చేరిన డికాక్ సెంచరీ ఖాయమనిపించినా.. వరుణ్ ఓవర్‌లో రనౌటయ్యాడు. ఆ వెంటనే బ్రెవిస్ (14)ను అక్షర్ అవుట్ చేసినప్పటికీ.. మిల్లర్, ఫెరీరా జోడీ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. ఆఖరి ఓవర్‌లో ఫెరీరా రెండు సిక్సర్లతో 18 రన్స్ అందించి స్కోరును 200+ దాటించాడు. ఐదో వికెట్‌కు ఈ జోడీ 23 బంతుల్లోనే అజేయంగా 53 పరుగులు చేసింది.
స్కోరుబోర్డు
దక్షిణాఫ్రికా: డికాక్ (రనౌట్) 90, హెన్‌డ్రిక్స్ (బి) వరుణ్ 8, మార్‌క్రమ్ (సి) అక్షర్ (బి) వరుణ్ 29, బ్రెవిస్ (సి) తిలక్ (బి) అక్షర్ 14, ఫెరీరా (నాటౌట్) 30, మిల్లర్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: 20 ఓవర్లలో 213/4. వికెట్ల పతనం: 1-38, 2-121, 3-156, 4-160; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-54-0, బుమ్రా 4-0-45-0, వరుణ్ 4-0-29-2, అక్షర్ 3-0-27-1, హార్దిక్ 3-0-34-0, దూబే 2-0-18-0.
భారత్: అభిషేక్ (సి) డికాక్ (బి) యాన్సెన్ 17, గిల్ (సి) హెన్‌డ్రిక్స్ (బి) ఎన్‌గిడి 0, అక్షర్ (సి) హెన్‌డ్రిక్స్ (బి) బార్ట్‌మన్ 21, సూర్యకుమార్ (సి) డికాక్ (బి) యాన్సెన్ 5, తిలక్ (సి) మార్‌క్రమ్ (బి) ఎన్‌గిడి 62, హార్దిక్ (సి) బ్రెవిస్ (బి) సిపమ్లా 20, జితేశ్ (సి) బార్ట్‌మన్ (బి) సిపమ్లా 27, దూబే (బి) బార్ట్‌మన్ 1, అర్ష్‌దీప్ (సి) మిల్లర్ (బి) బార్ట్‌మన్ 4, వరుణ్ (సి) మార్‌క్రమ్ (బి) బార్ట్‌మన్ 0, బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 19.1 ఓవర్లలో 162 ఆలౌట్; వికెట్ల పతనం: 1-9, 2-19, 3-32, 4-67, 5-118, 6-157, 7-158, 8-162, 9-162, 10-162; బౌలింగ్: ఎన్‌గిడి 3.1-0-26-2, యాన్సెన్ 4-0-25-2, సిపమ్లా 4-0-46-2, ఫెరీరా 1-0-14-0, బార్ట్‌మన్ 4-0-24-4, లిండే 3-0-23-0.
ఒక్క ఓవర్.. 7 వైడ్లు
పేసర్ అర్ష్‌దీప్ పేలవ బౌలింగ్‌తో నిరాశపర్చాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఏకంగా ఏడు వైడ్లు విసిరాడు. తొలి బంతిని డికాక్ సిక్సర్‌గా మలచగా, ఇక వరుసగా ఏడు బంతుల్లో ఆరు వైడ్లు వేయడంతో కోచ్ గంభీర్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత కూడా మరో బంతిని వైడ్‌గా వేయడంతో మొత్తం 13 బంతుల్లో ఈ ఓవర్‌ను ముగించి 18 రన్స్ సమర్పించుకున్నాడు.
యువీ, హర్మన్ పేరిట స్టాండ్స్
మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌లకు అరుదైన గౌరవం దక్కింది. గురువారం రెండో టీ20కి ముందు మహరాజా యదువీంద్ర సింగ్ స్టేడియం లోని స్టాండ్స్‌కు వీరిద్దరి పేర్లను పెట్టారు.
1
అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఓవర్‌లో ఎక్కువ బంతులు (13) వేసిన బౌలర్‌గా నవీనుల్ హక్ (అఫ్ఘాన్)తో సమంగా నిలిచిన అర్ష్‌దీప్.
2
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లుఏకంగా 16 వైడ్లు వేశారు. గతంలో విండీస్‌పై ఇన్నే వేయగా.. శ్రీలంకపై అత్యధికంగా 17 వైడ్లు వేశారు.
ఇవీ చదవండి:
సహచరుడికి ఇచ్చిన మాట..15 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్న సచిన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ