Prateeka Rawal: షెఫాలీ అలా ఆడుతుందని గ్రహించాను: ప్రతీకా రావల్
ABN , Publish Date - Nov 07 , 2025 | 07:53 PM
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 లీగ్ స్టేజ్‌లో టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్ అద్భుతంగా రాణించింది. గాయం కారణంగా ప్రపంచకప్ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు దూరమైంది. అయితే తన స్థానంలో అనూహ్యంగా షెఫాలి వర్మ ఆడిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందే షెఫాలీ ఏదో మ్యాజిక్ చేయబోతుందని ప్రతీకాకు అనిపించిందట!
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 లీగ్ స్టేజ్‌లో టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్ అద్భుతంగా రాణించింది. గాయం కారణంగా ప్రపంచకప్ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు దూరమైంది. అయితే తన స్థానంలో అనూహ్యంగా షెఫాలి వర్మ ఆడిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందే షెఫాలీ ఏదో మ్యాజిక్ చేయబోతుందని ప్రతీకాకు అనిపించిందట!
‘షెఫాలీ(Shafali Verma)కి ప్రేరణ అవసరం లేదు. ఆమె తన మీద నమ్మకంతో ఆడుతుంది. ఫైనల్‌కి ముందు వచ్చి నాతో ‘మీరు ఆడలేకపోతున్నారు. నిజంగా బాధగా ఉంది’ అని చెప్పింది. నేను కూడా ‘ఇది ఆటలో భాగం’ అన్నాను. కానీ నాకు ఆ రోజు ఆమె ఏదో అద్భుతం చేయబోతోందని అప్పటికే తెలుసు’ అంటూ ప్రతీకా(Prateeka Rawal) తెలిపింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో షెఫాలీ బ్యాట్‌తో 87 పరుగులు.. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.
గాయం బలాన్నిచ్చింది..
‘బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కాలి గాయంతో టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. ఇంకా మాస్టర్స్ పూర్తి చేయలేదు కాబట్టి నేను సైకాలజిస్టునని చెప్పలేను. కానీ అలాంటి సమయంలో ఈ గాయం మానసికంగా కుంగదీస్తుంది అనుకున్నా. సైకాలజీ తెలుసు కాబట్టి మనసు ఎలా పని చేస్తుందో అర్థం చేసుకున్నా. జరిగిపోయిన విషయాన్ని అంగీకరించడం మొదలు పెట్టా. దాని తర్వాత దృష్టి రికవరీ, ఆహారం, నిద్ర, జట్టుకు మద్దతు ఇవ్వడం వైపు మళ్లింది. ఆ గాయమే నాకు మరింత బలాన్ని ఇచ్చింది’ తెలిపింది.
మెడల్‌పై క్లారిటీ..
‘ప్రపంచ కప్ గెలిచిన తర్వాత వీల్ చెయిర్‌లో మైదానానికి వెళ్లి సంబరాల్లో పాల్గొనడం నాకు కలలా అనిపించింది. నాకు మెడల్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. నా మెడల్ రాలేదు కాబట్టి సపోర్ట్ స్టాఫ్‌లో ఒకరు వాళ్లది తాత్కాలికంగా ఇచ్చారు. తర్వాత జై షా సర్ నా మెడల్ నాకు పంపించారు’ అని ప్రతీకా వివరించింది.
రికవరీ అయ్యాను..
‘ఇప్పటికే చాలా బాగున్నాను. కొన్ని టెస్ట్ రిపోర్ట్స్ రావాల్సి ఉన్నాయి. డాక్టర్లు చెబితే మళ్లీ బ్యాటింగ్ మొదలు పెడతాను. బ్యాట్ పట్టుకోవడమే మిస్ అవుతున్నా. త్వరగా కోలుకుని దేశవాళీ సీజన్‌కు సిద్ధమవ్వడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం. ఆ తర్వాత డబ్ల్యూపీఎల్ కూడా మొదలు కానుంది. త్వరగా ఫిట్ అవుతాను’ అని చెప్పుకొచ్చింది. 2022లో అరంగేట్రం చేసిన ప్రతీకా ఇప్పటివరకు 24 వన్డేల్లో 1,100 పరుగులు సాధించింది. రెండు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి