Sports Governance Bill: రాజ్యసభలోనూ పాస్
ABN , Publish Date - Aug 13 , 2025 | 02:16 AM
చారిత్రక జాతీయ క్రీడా పాలన బిల్లుకు ఉభయ సభల ఆమోదం లభించింది. లోక్‌సభలో నెగ్గిన 24 గంటల తర్వాత రాజ్యసభలో కూడా బిల్లు పాసైంది. రాష్ట్రపతి ఆమోదంతో త్వరలో చట్టరూపం దాల్చనుంది. జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లుకు...
క్రీడా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: చారిత్రక జాతీయ క్రీడా పాలన బిల్లుకు ఉభయ సభల ఆమోదం లభించింది. లోక్‌సభలో నెగ్గిన 24 గంటల తర్వాత రాజ్యసభలో కూడా బిల్లు పాసైంది. రాష్ట్రపతి ఆమోదంతో త్వరలో చట్టరూపం దాల్చనుంది. జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లుకు కూడా పార్లమెంట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు నిరసనగా విపక్షాలు వాకౌట్ చేసిన సమయంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ‘20 దేశాల్లో క్రీడా చట్టాలున్నాయి. భారత్‌ను 21వ దేశంగా నిలపమని కోరుతున్నాన’ని సభలో చర్చ సందర్భంగా మాండవీయ వ్యాఖ్యానించారు. కొత్త బిల్లు కారణంగా పరిపాలనలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. అంతేకానీ ప్రభుత్వ నియంత్రణ, జోక్యం ఏమాత్రం ఉండవని స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం బలప్రదర్శనతో బిల్లును పాస్ చేసుకొందని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ విమర్శించారు. ఇది బీసీసీఐకి మేలు చేసేలా ఉందని ఎక్స్‌లో పోస్టు చేశారు.
సరైన దిశగా..
క్రీడా బిల్లును భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష స్వాగతించింది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ బిడ్ వేసేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో సరైన దిశగా అడుగులు పడుతున్నాయని పేర్కొంది. ఈ క్షణం కోసమే తాను ఎదురుచూస్తున్నట్టు సభలో తెలిపింది. దేశ క్రీడారంగంలో నూతన బిల్లు ఓ మైలురాయి అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కే ప్రశంసించాడు.

ఏజీఎం వరకు పదవిలో బిన్నీ..
బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ సెప్టెంబరు వరకు ఆ పదవిలో కొనసాగనున్నాడు. గతనెలలోనే బిన్నీకి 70 ఏళ్లు నిండాయి. అయితే, కొత్త క్రీడా బిల్లులో 75 ఏళ్ల వరకు వెసులుబాటు కల్పించారు. దీంతో సెప్టెంబరులో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వరకు అతడి పదవికి ఢోకా లేదు. ఒకవేళ బోర్డు పెద్దల ఆశీస్సులుంటే మరోసారి కూడా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. 2022 అక్టోబరులో సౌరభ్ గంగూలీ స్థానంలో బిన్నీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి