Indian Hockey Legend: ఒలింపిక్స్ హాకీ కాంస్య విజేత లియాండర్ తండ్రి వేస్ పేస్ మృతి
ABN , Publish Date - Aug 15 , 2025 | 06:09 AM
టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తండ్రి, హాకీ మాజీ ఆటగాడు వేస్ పేస్ (80) మరణించాడు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వేస్ పేస్‌ను గత మంగళవారం ఇక్కడి ఓ ఆసుపత్రిలో...
కోల్‌కతా: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తండ్రి, హాకీ మాజీ ఆటగాడు వేస్ పేస్ (80) మరణించాడు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వేస్ పేస్‌ను గత మంగళవారం ఇక్కడి ఓ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. విదేశాలలో స్థిరపడిన వేస్ పేస్ కుమార్తెలు వచ్చాక ఆయన అంత్యక్రియలు సోమ లేదా మంగళవారం జరపనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వేస్ పేస్ భార్య జెన్నిఫర్ భారత బాస్కెట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్. భారత క్రీడా రంగంతో వేస్ పేస్‌కు సుదీర్ఘ అనుబంధం ఉంది. మిడ్‌ఫీల్డర్‌గా జాతీయ హాకీ జట్టుకు సేవలందించాడు. 1971 బార్సిలోనా వరల్డ్ కప్, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు గెలుపొందిన భారత జట్లలో పేస్ సభ్యుడు. ఫుట్‌బాల్, క్రికెట్, రగ్బీ క్రీడలలోనూ పేస్‌కు ప్రవేశం ఉంది. డివిజన్ స్థాయిలో ఆ మూడు క్రీడలకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. 1945లో గోవాలో జన్మించిన వేస్ పేస్ ఆటలతోపాటు చదువులోనూ ఎంతో ప్రతిభావంతుడు. హాకీ నుంచి రిటైర్ అయ్యాక స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్‌గా మారాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, బీసీసీఐ, భారత డేవిస్ కప్ జట్టుకు కన్సల్టెంట్ డాక్టర్‌గా వ్యవహరించాడు. కుమారుడు లియాండర్ పేస్‌కు మేనేజర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ లియాండర్ పేస్ 1996 అట్లాంటా ఒలింపిక్స్ టెన్నిస్ సింగిల్స్‌లో కాంస్యం నెగ్గడం విశేషం.. దేశ క్రీడా రంగానికి వేస్ పేస్ అందించిన సేవలు వెల కట్టలేనివని అంటూ ఆయన మృతికి టెన్నిస్ మాజీ ఏస్ సానియా మీర్జా సంతాపం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
For More AndhraPradesh News And Telugu News