Messi India Tour Scam: మెస్సీ కోల్‘కథ’ వెనుక పెద్ద స్కామ్
ABN , Publish Date - Dec 21 , 2025 | 06:50 AM
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ వచ్చివెళ్లడంతో మున్ముందు భారత ఫుట్‌బాల్‌కు కొత్తగా ఏమైనా ఒనగూరనుందా? రానున్న రోజుల్లో దేశమంతా సాకర్ ఫీవర్‌తో ఉర్రూతలూగనుందా? అనేవి పక్కనబెడితే..
సాకర్ స్టార్ టూర్ ఆసరాగా రూ.100 కోట్ల కుంభకోణం?
మెస్సీతో ఫొటో చార్జి, టిక్కెట్ల విక్రయాల్లో అవకతవకలు
ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు ఇంట్లో సోదాలు
అతడి ఖాతాలో రూ. 22 కోట్లు సీజ్
లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్
కోల్‌కతా: అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ వచ్చివెళ్లడంతో మున్ముందు భారత ఫుట్‌బాల్‌కు కొత్తగా ఏమైనా ఒనగూరనుందా? రానున్న రోజుల్లో దేశమంతా సాకర్ ఫీవర్‌తో ఉర్రూతలూగనుందా? అనేవి పక్కనబెడితే.. అతని పర్యటనను ఆసరాగా చేసుకొని ఈవెంట్ నిర్వాహకులు మాత్రం భారీస్థాయిలో స్కామ్‌కు పాల్పడ్డారని తెలుస్తోంది. గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా మెస్సీ మొదట అంటే.. ఈనెల 13న కోల్‌కతా వచ్చిన విషయం విదితమే. అక్కడి సాల్ట్‌లేక్ స్టేడియంలో చెప్పినదానికంటే మెస్సీ తక్కువ సమయం గడపడంతో ఆగ్రహానికి గురైన అభిమానులు.. మైదానంలోకి సీసాలు, కుర్చీలు విసిరేసి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఈవెంట్ నిర్వాహకుడైన శతద్రు దత్తాను అదేరోజు పోలీసులు అరెస్టు చేయగా, అతనికి న్యాయస్థానం బెయిల్ కూడా నిరాకరించింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. ఇందులో భాగంగా సోదాలు నిర్వహించేందుకు శనివారం తెల్లవారుజామున కోల్‌కతాలోని దత్తా ఇంటికి వెళిన సిట్ అధికారులు.. అక్కడ అత్యంత విలాసవంతమైన ఆయన సామ్రాజ్యాన్ని చూసి నోరెళ్లబెట్టారు. విశాలమైన ప్రదేశంలో మూడంతస్థుల భవనం నిర్మించుకున్న దత్తా.. తన నివాసంపై ఏకంగా ఫుట్‌బాల్ మైదానాన్ని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఓ భారీ స్విమ్మింగ్‌పూల్, చాలా పెద్ద కార్యాలయం ఆయన ఇంట్లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. మెస్సీ టూర్ ద్వారా శతద్రు అతని బృందం.. దాదాపు రూ.100 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయని పోలీసులు తెలిపారు. మెస్సీతో ఫొటో దిగేందుకు రూ.10 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు వసూలు చేసిన నిర్వాహకులు.. ఈ చెల్లింపులకు సంబంధించి పోలీసులకు అధికారిక లెక్కలు చూపలేకపోయారని సమాచారం. టికెట్ల విక్రయాల్లోనూ భారీస్థాయిలో గోల్‌మాల్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. సిట్ దర్యాప్తులో భాగంగా దత్తాకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ.22 కోట్లను పోలీసులు స్తంభింపజేశారు. లోతుగా దర్యాప్తు జరిపితే, మరిన్ని అక్రమాలు బయటకు వెల్లడయ్యే అవకాశముందని సిట్ అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..
నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్