National Sports Governance Bill: క్రీడా బిల్లుకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Aug 12 , 2025 | 02:56 AM
జాతీయ క్రీడా పరిపాలన బిల్లు (ఎన్‌ఎ్‌సజీబీ)ను లోక్‌సభ సోమవారం ఆమోదించింది. స్వాతంత్య్రం తర్వాత దేశ క్రీడా రంగంలో తీసుకొచ్చిన ఏకైక అతి పెద్ద సంస్కరణగా ఈ బిల్లును కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవ్య...
లోక్‌సభ ఆమోదం
దేశ క్రీడా రంగంలో అతిపెద్ద సంస్కరణ
మంత్రి మన్‌సుఖ్ మాండవ్య
డోపింగ్ నిరోధక సవరణ బిల్లుకూ ఓకే
న్యూఢిల్లీ : జాతీయ క్రీడా పరిపాలన బిల్లు (ఎన్‌ఎ్‌సజీబీ)ను లోక్‌సభ సోమవారం ఆమోదించింది. స్వాతంత్య్రం తర్వాత దేశ క్రీడా రంగంలో తీసుకొచ్చిన ఏకైక అతి పెద్ద సంస్కరణగా ఈ బిల్లును కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవ్య అభివర్ణించారు. బిహార్‌లో ఎన్నికల జాబితాలో సవరణలపై ప్రతిపక్షం వ్యక్తంజేస్తున్న నిరసనల మధ్యే క్రీడా బిల్లును సభ ఆమోదించడం గమనార్హం. అలాగే జాతీయ డోపింగ్ నిరోధక (ఎన్‌ఏడీ) సవరణ బిల్లుకూ లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘స్వాతంత్య్రం వచ్చాక క్రీడల్లో చేపట్టిన అతి పెద్ద సంస్కరణ ఈ బిల్లు. క్రీడా సమాఖ్యలలో జవాబుదారీతనం, అథ్లెట్లకు న్యాయం చేకూర్చడంతోపాటు ఉత్తమ పరిపాలనను ఈ బిల్లు అందిస్తుంది’ అని విపక్ష సభ్యుల నినాదాల మధ్య మాండవ్య ప్రకటించారు. బిహార్ ఎన్నికల జాబితాలో సవరణలను వ్యతిరేకిస్తూ ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం ముట్టడికి వెళ్లిన నేపథ్యంలో.. లోక్‌సభలో క్రీడా బిల్లు ఆమోదం సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతలెవరూ లేరు. అయితే తర్వాత ఇద్దరు విపక్ష ఎంపీలు బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ తమ మద్దతు తెలిపారు. నిరసన కార్యక్రమం తర్వాత సభలో ప్రవేశించిన విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యనే ‘వాయిస్ ఓటు’తో క్రీడా బిల్లును సభ ఆమోదించింది.
ప్యానెల్‌కు నివేదించాలి: దిగ్విజయ్ సింగ్
అంతకుముందు..క్రీడలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ క్రీడా పరిపాలన బిల్లును పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపాలని లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లాను కోరారు. ఈ బిల్లును ప్యానెల్ కూలంకషంగా పరిశీలించడంతోపాటు చర్చించిన అనంతరమే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని అభిప్రాయపడ్డారు. అయితే దేశ క్రీడా రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతోపాటు 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రపంచ స్థాయి క్రీడా సంస్కృతిని ప్రవేశపెట్టేందుకు ఈ రెండు బిల్లులు ఎంతో కీలకమైనవని మాండవ్య చెప్పారు. ‘దేశ క్రీడా రంగంలో సంస్కరణలకోసం 1975 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1985లో మేం తొలి ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టాం. కానీ వ్యక్తిగత లబ్ధికోసం క్రీడలను కూడా రాజకీయం చేశారు. ఈ బిల్లును ముందుకు తెచ్చేందుకు గతంలో క్రీడా మంత్రులు ప్రయత్నించారు. కానీ సఫలం కాలేకపోయారు’ అని మాండవ్య వివరించారు.
బిల్లులోని ముఖ్యాంశాలు..
సివిల్ కోర్టు అధికారాలతో నేషనల్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ (ఎన్‌ఎ్‌సటీ) ఏర్పాటు చేస్తారు.
నేషనల్ స్పోర్ట్స్ బోర్డు (ఎన్‌ఎ్‌సబీ) ఏర్పాటు కానుంది.
ఎన్నికలు నిర్వహించని జాతీయ క్రీడా సమాఖ్యల గుర్తింపును రద్దు చేసే అధికారాన్ని ఎన్‌ఎ్‌సబీ కలిగి ఉంటుంది.
నేషనల్ స్పోర్ట్స్ ఎలక్షన్ ప్యానెల్ ఏర్పాటు కానుంది.
బీసీసీఐ మినహా గుర్తింపు పొందిన అన్ని క్రీడా సమాఖ్యలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రానున్నాయి.
ఐఓసీతో నిరంతర చర్చలు
2036 ఒలింపిక్స్ నిర్వహణ బిడ్డింగ్‌కు సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ‘ప్యూచర్ హోస్ట్ కమిటీ’తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి మాండవ్య తెలిపారు. ఆప్ సభ్యుడు గుర్మీత్‌సింగ్ లోక్‌సభలో సోమవారం అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఖరీదైన కారు కొన్న రోహిత్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ మరో షాకింగ్ డెసిషన్..?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..