Lakshya Sen Wins Australian Open: సేన్ సాధించెన్
ABN , Publish Date - Nov 24 , 2025 | 06:08 AM
ఆహా... ఎన్నాళ్లకెన్నాళ్లకు.. లక్ష్య సేన్ టైటిల్ కొరత తీరింది. ఏడాదికాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న ఈ స్టార్ షట్లర్ కల నెరవేరింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సేన్ చాంపియన్‌గా నిలిచి ఈ సీజన్‌లో తొలి ట్రోఫీని ముద్దాడాడు...
లక్ష్య ఖాతాలో ఆస్ట్రేలియన్ ఓపెన్
సీజన్‌లో తొలి టైటిల్ కైవసం
ఆహా... ఎన్నాళ్లకెన్నాళ్లకు.. లక్ష్య సేన్ టైటిల్ కొరత తీరింది. ఏడాదికాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న ఈ స్టార్ షట్లర్ కల నెరవేరింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సేన్ చాంపియన్‌గా నిలిచి ఈ సీజన్‌లో తొలి ట్రోఫీని ముద్దాడాడు. తన ఫామ్‌పై నెలకొన్న సందేహాలకు చెక్ పెడుతూ, పునర్‌వైభవం దిశగా ముందడుగు వేశాడు.
సిడ్నీ: గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో నాలుగోస్థానంతో త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్న భారత యువ షట్లర్ లక్ష్య సేన్.. ఆ తర్వాత ఇన్నాళ్లకు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి ఈ సీజన్‌లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ 21-15, 21-11తో జపాన్‌కు చెందిన 26 ఏళ్ల యుషి తనకను వరుస గేముల్లో చిత్తుచేసి ట్రోఫీ దక్కించుకున్నాడు. గత మ్యాచ్‌లో మూడు గేమ్‌ల పాటు పోరాడిన లక్ష్య.. ఫైనల్లో మాత్రం ప్రత్యర్థి యుషిని అలవోకగా ఓడించాడు. కేవలం 38 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన సేన్.. ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండో గేమ్‌లో మూడుసార్లు మ్యాచ్ పాయింట్‌ను కాచుకొని విజయం సాధించాడు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన 24 ఏళ్ల లక్ష్యకు ఇది ఈ ఏడాది తొలి టైటిల్. చివరిగా అతను నిరుడు నవంబరులో భారత్ వేదికగా జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో విజేతగా నిలిచాడు. ఇక.. ఈ సీజన్ సెప్టెంబరులో హాంకాంగ్ ఓపెన్ ఫైనల్ చేరినా, టైటిల్ దక్కించుకోలేకపోయాడు. 2021లో ప్రపంచ చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకం నెగ్గిన లక్ష్య సేన్.. ఆ తర్వాత ప్రతి ఏటా కనీసం ఒక టైటిల్ నెగ్గడం విశేషం. 2022లో ఇండియా ఓపెన్ విజేతగా నిలిచిన లక్ష్య.. 2023లో కెనడా ఓపెన్, 2024లో సయ్యద్ మోదీ, ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ 14వ ర్యాంక్‌లోనున్న లక్ష్య.. తాజా ప్రదర్శనతో 11వ స్థానానికి ఎగబాకాడు.
2
ఈ సీజన్‌లో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ నెగ్గిన రెండో భారత షట్లర్ లక్ష్య. అంతకుముందు ఈ ఏడాది ఆయుష్ శెట్టి యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు.
3
లక్ష్యకు ఇది కెరీర్‌లో మూడో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టైటిల్. అంతకుముందు ఇండియా, కెనడా ఓపెన్ గెలిచాడు.
3
సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన మూడో భారత షట్లర్ లక్ష్య సేన్.
ఇవీ చదవండి:
అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..
ఊహించని పరిణామం.. స్మృతి మంధాన పెళ్లి వాయిదా..