కివీస్‌నూ పడగొట్టి.. అజేయంగా నిలిచి..
ABN , Publish Date - Mar 03 , 2025 | 02:25 AM
చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గ్రూప్ దశను అజేయంగా ముగించింది. స్లో పిచ్‌పై న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి భారత్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైనా.. నలుగురితో కూడిన స్పిన్ దళం...
ఆసీస్‌తో నాకౌట్‌కు భారత్ సై
సెమీ్‌సలో ఎవరితో ఎవరు?
మార్చి 4 భారత్ X ఆస్ట్రేలియా దుబాయ్
మార్చి 5 న్యూజిలాండ్ X దక్షిణాఫ్రికా లాహోర్
చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గ్రూప్ దశను అజేయంగా ముగించింది. స్లో పిచ్‌పై న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి భారత్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైనా.. నలుగురితో కూడిన స్పిన్ దళం జట్టుకు ఆసరాగా నిలిచింది. కెరీర్‌లో రెండో వన్డే ఆడిన వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ బంతులకు కేన్ విలియమ్సన్ మినహా కివీస్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఫలితంగా హ్యాట్రిక్ విజయంతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచిన భారత్.. ఆస్ట్రేలియాతో సెమీస్ పోరుకు సిద్ధమైంది.
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో భారత వన్డే జట్టు అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థుల పనిబడుతున్న రోహిత్ సేన ఆదివారం న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో గ్రూప్ ‘ఎ’లో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. ఈనెల 4న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (79), హార్దిక్ పాండ్యా (45), అక్షర్ పటేల్ (42) రాణించారు. హెన్రీ 5 వికెట్లు తీశాడు. ఛేదనలో కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (81) ఒంటరి పోరాటం చేయగా, శాంట్నర్ (28) చివర్లో ఫర్వాలేదనిపించాడు. పేసర్ హర్షిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/42) ఐదు వికెట్లతో భేష్ అనిపించాడు. కుల్దీప్ (2/56)కు రెండు వికెట్లు దక్కాయి. వరుణ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
కేన్ మినహా..: మందకొడిగా మారిన పిచ్‌పై 250 పరుగుల ఛేదన కివీ్‌సకు సవాల్‌గా మారింది. కేన్ విలియమ్సన్ మాత్రమే భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. మిగతా బ్యాటర్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్ రచిన్ (6)ను హార్దిక్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కేన్ జాగ్రత్తగా ఆడుతూ ఓపెనర్ యంగ్‌తో రెండో వికెట్‌కు 32, మిచెల్ (17)తో మూడో వికెట్‌కు 44, లాథమ్ (14)తో కలిసి నాలుగో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. ఈక్రమంలో తను అర్ధసెంచరీ కూడా పూర్తి చేశాడు. అయితే మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ఆధిపత్యం చూపారు. దీంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతూ వచ్చింది. దీనికితోడు 36వ ఓవర్‌లో హిట్టర్ ఫిలిప్స్ (12), బ్రేస్‌వెల్ (2)లను వరుణ్ అవుట్ చేయడంతో కివీస్ 159/6తో ఒత్తిడిలో పడింది. ఇక ఓపిగ్గా క్రీజులో నిలిచిన విలియమ్సన్ వికెట్‌ను అక్షర్ తీయడంతో ప్రత్యర్థి ఆశలు వదులుకుంది. వరుణ్ టెయిలెండర్ల పనిబట్టడంతో మరో 4.3 ఓవర్లుండగానే మ్యాచ్ ముగిసింది.
శ్రేయా్‌స-అక్షర్ జోడీ నిలకడ: టాస్ కోల్పోయిన భారత్ తొలిసారి బ్యాటింగ్‌కు దిగింది. అయితే పవర్‌ప్లేలోనే ఓపెనర్లు గిల్ (2), రోహిత్ (15), విరాట్ (11) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో శ్రేయా్‌స-అక్షర్ జోడీ ఆదుకోగా.. చివర్లో హార్దిక్ వేగం ఓ మాదిరి స్కోరుకు కారణమైంది. ఫామ్‌లో ఉన్న గిల్‌ను మూడో ఓవర్‌లోనే హెన్రీ ఎల్బీ చేశాడు. రోహిత్, విరాట్ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరడంతో భారత్ 30/3 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. కానీ శ్రేయాస్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తనకు మరో ఎండ్ నుంచి అక్షర్ అద్భుత సహకారం అందించాడు. పిచ్ నెమ్మదిగా మారడంతో వికెట్‌ను చేజారనీయకుండా ఈ జోడీ 8 ఓవర్లపాటు సింగిల్స్‌కే పరిమితమైంది. 17వ ఓవర్‌లో శ్రేయాస్ షార్ట్ పిచ్ బంతులను హ్యాట్రిక్ ఫోర్లుగా మలిచి స్కోరులో కదలిక తెచ్చాడు. ఆ వెంటనే స్పిన్నర్లు కట్టడి చేయడంతో ఆచితూచి ఆడాల్సి వచ్చింది. దీంతో శ్రేయాస్ 75 బంతుల్లో తన కెరీర్‌లో నెమ్మదైన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అయితే రచిన్ బౌలింగ్‌లో అక్షర్ అవుట్ కావడంతో నాలుగో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే ఓరౌర్కీ షార్ట్ పిచ్ బంతికి శ్రేయాస్ క్యాచ్ అవుటయ్యాడు. రాహుల్ (23), జడేజా (16) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగిన వేళ హార్దిక్ డెత్ ఓవర్లలో వేగం చూపాడు. 49వ ఓవర్‌లో వరుసగా 4,4,6తో 15 రన్స్ సమకూరాయి. ఆఖరి ఓవర్‌లో హార్దిక్, షమి (5)లను అవుట్ చేసిన హెన్రీ ఐదు వికెట్లను పూర్తి చేసుకున్నాడు.
స్కోరుబోర్డు
భారత్: రోహిత్ (సి) యంగ్ (బి) జేమిసన్ 15; గిల్ (ఎల్బీ) హెన్రీ 2; విరాట్ (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 11; శ్రేయాస్ (సి) యంగ్ (బి) ఓరౌర్కీ 79; అక్షర్ (సి) విలియమ్సన్ (బి) రచిన్ 42; రాహుల్ (సి) లాథమ్ (బి) శాంట్నర్ 23; హార్దిక్ (సి) రచిన్ (బి) హెన్రీ 45; జడేజా (సి) విలియమ్సన్ (బి) హెన్రీ 16; షమి (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 5; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 50 ఓవర్లలో 249/9. వికెట్ల పతనం: 1-15, 2-22, 3-30, 4-128, 5-172, 6-182, 7-223, 8-246, 9-249. బౌలింగ్: హెన్రీ 8-0-42-5; జేమిసన్ 8-0-31-1; ఓరౌర్కీ 9-0-47-1; శాంట్నర్ 10-1-41-1; బ్రేస్‌వెల్ 9-0-56-0; రచిన్ 6-0-31-1.
న్యూజిలాండ్: యంగ్ (బి) వరుణ్ 22; రచిన్ (సి) అక్షర్ (బి) హార్దిక్ 6; విలియమ్సన్ (స్టంప్) రాహుల్ (బి) అక్షర్ 81; మిచెల్ (ఎల్బీ) కుల్దీప్ 17; లాథమ్ (ఎల్బీ) జడేజా 14; ఫిలిప్స్ (ఎల్బీ) వరుణ్ 12; బ్రేస్‌వెల్ (ఎల్బీ) వరుణ్ 2; శాంట్నర్ (బి) వరుణ్ 28; హెన్రీ (సి) విరాట్ (బి) వరుణ్ 2; జేమిసన్ (నాటౌట్) 9; ఓరౌర్కీ (బి) కుల్దీప్ 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 45.3 ఓవర్లలో 205 ఆలౌట్. వికెట్ల పతనం: 1-17, 2-49, 3-93, 4-133, 5-151, 6-159, 7-169, 8-195, 9-196, 10-205. బౌలింగ్: షమి 4-0-15-0; హార్దిక్ 4-0-22-1; అక్షర్ 10-0-32-1; వరుణ్ 10-0-42-5; కుల్దీప్ 9.3-0-56-2; జడేజా 8-0-36-1.
1
చాంపియన్స్ ట్రోఫీ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు 9 వికెట్లు తీయడం ఇదే తొలిసారి.
1
వన్డేల్లో అత్యధికంగా వరుస (13) టాస్‌లు కోల్పోయిన జట్టుగా భారత్. ఇందులో రోహిత్ కెప్టెన్సీలోనే పదిసార్లు ఈ ఫీట్ నమోదైంది.
2
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ నుంచి ఉత్తమ బౌలింగ్ (5/42) కనబర్చిన రెండో బౌలర్‌గా వరుణ్. జడేజా (5/36) ముందున్నాడు.
Read Also : Business Ideas: ఇండియాలో పోటీలేని టాప్ బిజినెస్ ఇదే.. తక్కువ ఖర్చు.. అధిక లాభాలు..
SugarCane Juice: ప్రతిరోజు చెరకు రసం తాగవచ్చా.. తాగితే ఏమవుతుంది..
మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..