Share News

రాహుల్‌.. జిగేల్‌

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:46 AM

తాజా ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అపజయం లేకుండా దూసుకెళుతోంది. అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌ విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్న ఈ జట్టు ఖాతాలో వరుసగా నాలుగో విజయం చేరింది....

రాహుల్‌.. జిగేల్‌

ఐపీఎల్‌లో నేడు

చెన్నై X కోల్‌కతా

వేదిక : చెన్నై రా.7.30

‘సొంత గడ్డ’పై చెలరేగిన కేఎల్‌

ఢిల్లీకి వరుసగా నాలుగో విజయం

నిరాశపర్చిన బెంగళూరు

సత్తా చాటిన డీసీ బౌలర్లు

బెంగళూరు: తాజా ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అపజయం లేకుండా దూసుకెళుతోంది. అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌ విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్న ఈ జట్టు ఖాతాలో వరుసగా నాలుగో విజయం చేరింది. క్లిష్ట పరిస్థితుల్లో కేఎల్‌ రాహుల్‌ (53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 93 నాటౌట్‌) సమయోచిత ఆటతీరు కనబర్చగా.. గురువారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో డీసీ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అటు సొంత గడ్డపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్‌సీబీకి ఓటములే ఎదురయ్యాయి. మరోవైపు కెరీర్‌లో ఓనమాలు దిద్దిన చిన్నస్వామి స్టేడియంలోనే రాహుల్‌ చెలరేగి స్థానిక జట్టుకు ఓటమి రుచి చూపించడం గమనార్హం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. సాల్ట్‌ (37), డేవిడ్‌ (37 నాటౌట్‌), పటీదార్‌ (25) మాత్రమే రాణించారు. కుల్దీప్‌, విప్రజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. స్టబ్స్‌ (38 నాటౌట్‌) సహకరించాడు. భువనేశ్వర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రాహుల్‌ నిలిచాడు.


శతక భాగస్వామ్యంతో..

పిచ్‌ నుంచి సహకారం లభించడంతో ఆర్‌సీబీ బౌలర్లు ఆరంభంలో వణికించారు. పవర్‌ప్లేలో అతికష్టమ్మీద 39 పరుగులు చేసిన డీసీ మూడు వికెట్లను కూడా కోల్పోయింది. అయితే స్టబ్స్‌తో కలిసి రాహుల్‌ ఐదో వికెట్‌కు 111 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టును గట్టెక్కించాడు.రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ డుప్లెసి (2)ను యష్‌ అవుట్‌ చేయగా, మరో ఓపెనర్‌ ఫ్రేజర్‌ (7), పోరెల్‌ (7)లను భువీ దెబ్బతీశాడు. రాహుల్‌ సైతం ఐదు పరుగుల వద్దే వెనుదిరగాల్సినా.. పటీదార్‌ డైవింగ్‌ క్యాచ్‌ అందుకోలేకపోయాడు. కెప్టెన్‌ అక్షర్‌ (15) కూడా నిరాశపరిచాడు. దీంతో 58/4 స్కోరుతో డీసీ ఇబ్బందుల్లో పడింది. కానీ ఈ దశలో రాహుల్‌ ఎదురుదాడికి దిగాడు. అతడికి స్టబ్స్‌ నుంచి సహకారం అందింది. 13వ ఓవర్‌లో రాహుల్‌ 4,6తో 14 పరుగులు రావడంతో డీసీ ఇన్నింగ్స్‌లో వేగం పెరిగింది. ఇక 15వ ఓవర్‌లో మరింతగా చెలరేగిన రాహుల్‌ 4,4,2,2,4,6తో 22 పరుగులు రాబట్టాడు. 18 బంతుల్లో 18 రన్స్‌ కావాల్సిన వేళ రాహుల్‌ 6,4,6తో 13 బంతులుండగానే డీసీ మ్యాచ్‌ను ముగించింది.

ఆరంభం అదిరినా..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ వామ్మో.. అనే రీతిలో ఆరంభమైంది. ఓపెనర్‌ సాల్ట్‌ వీర బాదుడుకు జట్టు తొలి 3.4 ఓవర్లలోనే 61 పరుగులతో నిలిచింది. ఆ సమయంలో 220కి పైనే స్కోరు చేస్తారనిపించింది. కానీ ఢిల్లీ బౌలర్ల ధాటికి గతి తప్పిన ఆర్‌సీబీ ఆ తర్వాత 86 బంతుల్లో 66 పరుగులే చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే టిమ్‌ డేవిడ్‌ పుణ్యమా చివరి రెండు ఓవర్లలో 36 పరుగులతో సవాల్‌ విసిరే స్కోరందుకుంది. అంతకుముందు స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లోనే సాల్ట్‌ 6,4,4,4,6 బాది ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఇంత జోరు మీదున్న వేళ.. లేని పరుగు కోసం వెళ్లి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నాలుగో ఓవర్‌లో కవర్స్‌ వైపు ఆడిన సాల్ట్‌ సింగిల్‌ కోసం ముందుకు కదిలాడు. కానీ కోహ్లీ వారించడంతో వెనక్కి మళ్లిన అతడు కింద పడి క్రీజులోకి చేరుకోలేకపోవడంతో, అటు విప్రజ్‌ త్రోను అందుకున్న కీపర్‌ రాహుల్‌ రనౌట్‌ చేశాడు. అంతే.. అక్కడి నుంచి ఆర్‌సీబీ ఆట ఒక్కసారిగా తేలిపోయింది. ఐదో ఓవర్‌లో విప్రజ్‌ రెండు పరుగులే ఇవ్వగా.. ముకేశ్‌ ఆరో ఓవర్‌ను మెయిడిన్‌గా వేసి మరీ పడిక్కళ్‌ (1) వికెట్‌ తీశాడు. ఇక వరుస విరామాల్లో విరాట్‌ (22), లివింగ్‌స్టోన్‌ (4), జితేశ్‌ (3)లను పెవిలియన్‌కు చేర్చిన ఢిల్లీ బౌలర్లు పైచేయి సాధించారు. వాస్తవానికి తొమ్మిది ఓవర్ల వరకు కూడా జట్టు పది పరుగుల రన్‌రేట్‌తోనే ఉంది. కానీ ఆ తర్వాత ఆర్‌సీబీ బ్యాటర్లు భారీ షాట్లు ఆడలేక వికెట్లు సైతం కోల్పోయారు. ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ పటీదార్‌ కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. అతడిని 15వ ఓవర్‌లో కుల్దీప్‌ అవుట్‌ చేశాడు. కానీ రన్స్‌ కోసం అష్టకష్టాలు పడుతున్న జట్టుకు చివరి రెండు ఓవర్లలో డేవిడ్‌ ఊపిరిలూదాడు. 19వ ఓవర్‌లో 6,4,6తో 17 రన్స్‌.. ఆఖరి ఓవర్‌లో 6,6,4తో 19 రన్స్‌ రాబట్టడంతో ఆర్‌సీబీ 160+ స్కోరుతో ఫర్వాలేదనిపించింది.


స్కోరుబోర్డు

బెంగళూరు: సాల్ట్‌ (రనౌట్‌) 37; విరాట్‌ (సి) స్టార్క్‌ (బి) విప్రజ్‌ 22; దేవ్‌దత్‌ (సి) అక్షర్‌ (బి) ముకేశ్‌ 1; పటీదార్‌ (సి) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 25; లివింగ్‌స్టోన్‌ (సి) అశుతోష్‌ (బి) మోహిత్‌ 4; జితేశ్‌ (సి) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 3; క్రునాల్‌ (సి) అశుతోష్‌ (బి) విప్రజ్‌ 18; డేవిడ్‌ (నాటౌట్‌) 37; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 20 ఓవర్లలో 163/7; వికెట్ల పతనం: 1-61, 2-64, 3-74, 4-91, 5-102, 6-117, 7-125; బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-35-0; అక్షర్‌ 4-0-52-0; విప్రజ్‌ 4-0-18-2; ముకేశ్‌ 3-1-26-1; కుల్దీప్‌ 4-0-17-2; మోహిత్‌ 2-0-10-1.

ఢిల్లీ: డుప్లెసి (సి) పటీదార్‌ (బి) యశ్‌ దయాళ్‌ 2 ; మెక్‌గుర్క్‌ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 7; అభిషేక్‌ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 7; రాహుల్‌ (నాటౌట్‌) 93, అక్షర్‌ (సి) డేవిడ్‌ (బి) సుయాశ్‌ 15, స్టబ్స్‌ (నాటౌట్‌) 38, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం: 17.5 ఓవర్లలో 169/4; వికెట్లపతనం: 1-9, 2-10, 3-30, 4-58; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-26-2, యశ్‌ దయాళ్‌ 3.5-0-45-1, హాజిల్‌వుడ్‌ 3-0-40-0, సుయాశ్‌ 4-0-25-1, కృనాల్‌ 2-0-19-1, లివింగ్‌స్టోన్‌ 1-0-14-0.

1

ఐపీఎల్‌లో వెయ్యి బౌండరీలు బాదిన తొలి బ్యాటర్‌గా విరాట్‌.

ఇవి కూడా చదవండి:

సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ

రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఆ జట్లకే చాన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2025 | 05:46 AM