Joe Root Scores Crucial Century: శతక జోరూట్
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:31 AM
ఆధునిక క్రికెట్‌లో గొప్ప బ్యాటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నా.. ఇంగ్లండ్ స్టార్ జో రూట్‌కు ఆసీస్ గడ్డపై సెంచరీ ఊరిస్తూనే ఉంది. కానీ ఇన్నాళ్లకు ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోగలిగాడు...
యాషెస్ సిరీస్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 325/9
స్టార్క్‌కు ఆరు వికెట్లు
ఆసీస్‌తో రెండో టెస్టు
బ్రిస్బేన్: ఆధునిక క్రికెట్‌లో గొప్ప బ్యాటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నా.. ఇంగ్లండ్ స్టార్ జో రూట్‌కు ఆసీస్ గడ్డపై సెంచరీ ఊరిస్తూనే ఉంది. కానీ ఇన్నాళ్లకు ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోగలిగాడు. గురువారం ఆరంభమైన రెండో టెస్టులో 34 ఏళ్ల రూట్ (135 బ్యాటింగ్) అజేయ సెంచరీతో నిలిచాడు. గాబా మైదానంలో జరుగుతున్న ఈ గులాబీ టెస్టులో ఓవైపు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (6/71) నిప్పులు చెరిగే బంతులతో వికెట్ల వేట సాగిస్తున్నా.. మరో ఎండ్‌లో రూట్ మాత్రం పట్టు వదలకుండా క్రీజులో నిలిచాడు. ఫలితంగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 74 ఓవర్లలో 9 వికెట్లకు 325 పరుగులు చేసింది. ఓపెనర్ క్రాలే (76) అర్ధసెంచరీతో సహకరించాడు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టామ్ పేసర్‌గా వసీం అక్రమ్ (414) రికార్డును స్టార్క్ (418) అధిగమించాడు.
5/2తో తడబాటు..: స్టార్క్ ధాటికి మూడో ఓవర్‌లోపే ఓపెనర్ డకెట్, పోప్ డకౌట్లుగా వెనుదిరిగారు. అప్పటికి స్కోరు కేవలం ఐదు పరుగులే. ఈ దశలో మరో ఓపెనర్ క్రాలే అండతో రూట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. బ్రూక్‌ను అవుట్ చేసిన స్టార్క్ చివరి సెషన్‌లో చకచకా వికెట్లు తీసి ఒత్తిడి పెంచాడు. అటు రూట్ మాత్రం ఎదురొడ్డి నిలిచి ఆసీస్ గడ్డపై తొలి సెంచరీ పూర్తి చేశాడు.
సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 74 ఓవర్లలో 325/9 (రూట్ 135 బ్యాటింగ్, క్రాలే 76, ఆర్చర్ 32 బ్యాటింగ్, బ్రూక్ 31; స్టార్క్ 6/71).
హేడెన్ నగ్న నడక తప్పింది..
జో రూట్ శతకంతో మెల్‌బోర్న్ వాసులకు ఓ ‘ప్రమాదం’ తప్పింది. గతంలో ఆసీస్ గడ్డపై నాలుగు యాషెస్ సిరీస్‌లు ఆడిన రూట్ ఒక్కసారి కూడా సెంచరీ చేయలేదు. అందుకే రూట్ ఈసారి కూడా ఆసీస్ గడ్డపై సెంచరీ చేయలేకపోతే తాను మెల్‌బోర్న్ మైదానంలో నగ్నంగా నడుస్తానంటూ ఇటీవల ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీనికి హేడెన్ కూతురు, వ్యాఖ్యాత గ్రేస్ స్పందిస్తూ.. ‘రూట్.. దయచేసి ఒక్క సెంచరీ అయినా చెయ్’ అని సరదాగా పేర్కొంది.

ఎక్కువ వికెట్లు తీసిన లెఫ్టామ్ పేసర్లు
బౌలర్ టెస్టులు వికెట్లు
స్టార్క్ 102 418
అక్రమ్ 104 414
వాస్ 111 355
బౌల్ట్ 78 317
జహీర్ 92 311
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News