Share News

England series 2025: మూడో నెంబర్‌ మ్యూజికల్‌ చైర్‌

ABN , Publish Date - Jul 20 , 2025 | 05:31 AM

ఇంగ్లండ్‌తో మూడో టెస్టు ఓటమి నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో నెంబర్‌ స్థానంపై మరోసారి చర్చ మొదలైంది. గతంలో దిగ్గజ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌, అనంతరం చటేశ్వర్‌ పుజార నెం.3 స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేశారు...

England series 2025: మూడో నెంబర్‌ మ్యూజికల్‌ చైర్‌

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఇంగ్లండ్‌తో మూడో టెస్టు ఓటమి నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో నెంబర్‌ స్థానంపై మరోసారి చర్చ మొదలైంది. గతంలో దిగ్గజ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌, అనంతరం చటేశ్వర్‌ పుజార నెం.3 స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేశారు. అయితే పుజార జట్టులో స్థానం కోల్పోవడంతో కొంతకాలంగా కీలకమైన మూడో నెంబర్‌లో పలువురు ఆటగాళ్లను పరీక్షిస్తున్నారు. ఒకవిధంగా ఈ స్థానం ‘మ్యూజికల్‌ చైర్‌’గా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో ఇద్దరు బ్యాటర్లను ఆ స్థానంలో పరిశీలించారు. మొదటి టెస్టులో సాయి సుదర్శన్‌ను బరిలో దింపారు. తన అరంగేట్ర టెస్టు (లీడ్స్‌) అయిన ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సుదర్శన్‌ డకౌట్‌ కాగా, అతను రెండో ఇన్నింగ్స్‌లో (30 పరుగులు)నూ ఆకట్టుకోలేకపోయాడు. భారత జట్టు ఘన విజయం సాధించిన బర్మింగ్‌హామ్‌ రెండో టెస్టులో సీనియర్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ను మూడో నెంబర్‌లో పంపారు. 31, 26 స్కోర్లతో నాయర్‌ తన పునరాగమనానికి న్యాయం చేయలేకపోయాడు. ఇక ప్రతిష్ఠాత్మక లార్ట్స్‌ టెస్టులోనూ నాయర్‌ (40, 14) విఫలమయ్యాడు. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో 1-2తో వెనుకంజలో ఉన్న భారత్‌..రేస్‌లో నిలవాలంటే ఈనెల 23 నుంచి జరిగే నాలుగో టెస్టులో గెలిచి తీరాల్సిందే. ఈక్రమంలో మూడో నెంబర్‌ బ్యాటర్‌ భారీగా పరుగులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వాస్తవంగా..కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ స్థానంలో ఆడాలని భావించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు జరగడంతో కేఎల్‌ రాహుల్‌ మూడో నెంబర్‌లో దిగాడు. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఆడాలని గిల్‌ నిర్ణయించుకోవడంతో..మూడో నెంబర్‌ బ్యాటర్‌కోసం సెలెక్టర్లు మరోసారి వెతుకులాట ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


టీమిండియాకు సుదీర్ఘకాలం పాటు ఈ స్థానంలో ప్రాతినిథ్యం వహించాల్సిన ఆటగాడిని కనుగొనడం ఆషామాషీ కాదు. గతంలో మూడో నెంబర్‌లో ఆడిన బ్యాటర్లు నాటి కెప్టెన్లకు ఎంతో ఊరట నిచ్చారు. సచిన్‌కు ద్రవిడ్‌, కోహ్లీకి పుజార అండగా నిలిచారు. ఇప్పుడు గిల్‌కు కూడా అలాంటి భరోసా ఇవ్వాల్సిన బ్యాటర్‌ అవసరం. ఈ క్రమంలో సుదర్శన్‌, నాయర్‌లను పరీక్షించారు. వారు రాణించకపోవడంతో ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకు ఇప్పుడు మళ్లీ వెతుకులాట మొదలైంది. మూడో నెంబర్‌ బ్యాటర్‌ 30, 40 రన్స్‌ చేయడం కాదని, శతకాలు సాధించాల్సిందేనని అలనాటి ఆటగాడు ఫరూక్‌ ఇంజనీర్‌ అంటారు. ఈ స్థానంలో ఆడిన దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ లార్డ్స్‌లో ఏకంగా 3 సెంచరీలు కొట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరి కీలకమైన నాలుగో టెస్టులో మూడో నెంబర్‌ బ్యాటర్‌ విషయంలో జట్టు యాజమాన్యం తీసుకొనే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 05:31 AM