Share News

Gambhir's Experiment Failure: భారత్ కొంపముంచిన ప్రయోగాలు

ABN , Publish Date - Nov 16 , 2025 | 03:26 PM

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. ఫలితంగా ప్రొటీస్ జట్టు చేతిలో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.

Gambhir's  Experiment Failure: భారత్ కొంపముంచిన ప్రయోగాలు
IND vs SA Test 2025

కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా(India vs South Africa Test )కు చేదు అనుభవం ఎదురైంది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత జట్టు విఫలమై 93 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 30 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో తొలి టెస్టులో టీమిండియా చేసిన కొన్ని ప్రయోగాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gambhir) ఫ్లాన్ విఫలమైందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


సౌతాఫ్రికా(South Africa)తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసింది. ఇంగ్లండ్‌ పర్యటన, వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టుల్లో మూడో స్థానంలో ఆడించిన సాయి సుదర్శన్‌ను తుదిజట్టు నుంచి తప్పించింది. అతడికి బదులుగా వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ టెస్టులో వన్‌డౌన్‌లో అతడిని ఆడించింది. తొలి ఇన్నింగ్స్‌లో 82 బంతులు ఎదుర్కొన్న సుందర్ 29 పరుగులతో పర్వాలేదనిపించాడు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా సుందర్ 31 పరుగులతో మెరుగ్గా రాణించాడు. ప్రొటీస్ జట్టు విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (0), కేఎల్‌ రాహుల్‌ (1) పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌ లో దిగిన సుందర్ 92 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. తర్వాత మార్క్రమ్‌ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.


ఇంత వరకు బాగానే ఉన్నా... ఈ మ్యాచ్ లో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ చేసిన ఓ మరో ప్రయోగం విఫలమైంది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మెడనొప్పి(Shubman Gill injury) కారణంగా మ్యాచ్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌(Dhruv Jurel failure)ను ప్రమోట్‌ చేశాడు. అయితే, కాసేపు క్రీజులో నిలబడ్డా జురెల్‌.. మంచి స్కోర్ చేయలేకపోయాడు. 34 బంతులు ఎదుర్కొని 13 పరుగులే చేసి ఔటయ్యాడు. ఇక ఐదో నంబర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ 13 బంతుల్లో కేవలం 2 పరుగులు చేసి పెవిలీయన్ చేరాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 26 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన జడేజా.. హార్మర్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు.


మొత్తంగా ఈ మ్యాచ్ లో ధ్రువ్, రిషభ్ రూపంలో గంభీర్ చేసిన ప్రయోగం విఫలమైందని క్రీడా నిపుణులు అంటున్నారు. చివర్లో అక్షర్‌ పటేల్‌(Axar Patel) గెలుపు ఆశలు రేపాడు. కేవలం 17 బంతుల్లోనే 26 పరుగులతో స్కోర్ బోర్డును కదిలించాడు. అయితే కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్ లో బవుమాకు క్యాచ్‌ ఇచ్చి.. పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత 93 పరుగుల వద్ద సిరాజ్ చివరి వికెట్ గా వెనుతిరగడటంతో భారత్(Team India) ఓటమి పరిపూర్ణమైంది.


ఇవి కూడా చదవండి:

IND VS SA: తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం

సంజూ మానసికంగా అలసిపోయాడు: ఆర్ఆర్ ఓనర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 04:18 PM