India Women Face Crucial Semi Final: అమ్మాయిలకు అగ్నిపరీక్ష
ABN , Publish Date - Oct 30 , 2025 | 03:19 AM
కొంచెం కష్టానికి మరికొంత అదృష్టం కలిసొచ్చి వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌కు చేరిన భారత జట్టు ఇప్పుడిక అసలు సిసలు సవాలుకు సిద్ధమైంది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది....
మ. 3 గంటలనుంచి నేడు
ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్
వన్డే వరల్డ్ కప్
నవీ ముంబై: కొంచెం కష్టానికి మరికొంత అదృష్టం కలిసొచ్చి వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌కు చేరిన భారత జట్టు ఇప్పుడిక అసలు సిసలు సవాలుకు సిద్ధమైంది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సందర్భంగా డెర్బీలో జరిగిన 2017 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుపైనే ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన అసామాన ప్రదర్శన గుర్తు చేసుకోవాలి. ఆ మ్యాచ్‌లో ప్రత్యరి బౌలర్లపై విరుచుకు పడిన కౌర్ కేవలం 115 బంతులలో అజేయంగా 171 పరుగులు చేసి భారత్‌కు అపురూప విజయం అందించింది. మరి..ఈసారి సెమీఫైనల్లోనూ కౌర్ సారథ్యంలోని మన అమ్మాయిలు ఆ మ్యాచ్ ఫలితాన్ని పునరావృతం చేస్తారేమో చూడాలి. కానీ ఈసారి టోర్నీలో హర్మన్ సేన నిలకడైన ప్రదర్శన కనబర్చలేకపోయింది. వరుసగా మూడు పరాజయాలు చవిచూడడమే అందుకు ఉదాహరణ.
జట్టు కూర్పు ఆసక్తికరం..
సెమీ్‌సకు ముందు కీలక బ్యాటర్ ప్రతీక రావల్ గాయంతో వైదొలగడం భారత్‌కు పెద్ద దెబ్బ. దాంతో దూకుడైన బ్యాటింగ్ చేసే షఫాలీ వర్మను ప్రతీక స్థానంలో తీసుకున్నారు. ఆస్ట్రేలియాపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో..మంధానతో కలిసి షఫాలీని ఓపెనింగ్ చేయిస్తారా? లేదంటే ఆరో బౌలర్‌కు చోటు కల్పించేందుకు హర్లీన్ డియోల్‌ను ఓపెనర్‌గా పంపుతారా.. అనేది చూడాలి. అలాగే..బంగ్లాదేశ్‌పై గత మ్యాచ్‌లో పదునైన బౌలింగ్‌తోపాటు చురుకైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న స్పిన్నర్ రాధా యాదవ్‌ను కొనసాగిస్తారా అనేదీ ఆసక్తికరం. ఈ సారి టోర్నమెంట్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన కెప్టెన్ కౌర్..ఎనిమిదేళ్ల నాటి సెమీస్ ఇన్నింగ్స్ స్ఫూర్తిగా ఆస్ట్రేలియాపై మరోసారి విరుచుకు పడాలన్నది అభిమానుల ఆకాంక్ష. మరోవైపు ఇప్పటికే ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉన్న మంధాన అదే జోరు కొనసాగించాల్సి ఉంటుంది. అయితే బౌలర్లు ధారాళంగా పరుగులిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈనేపథ్యంలో పటిష్టమైన ఆస్ట్రేలియా బ్యాటర్లను నిలువరించాలంటే మన బౌలర్లు శక్తికి మించి సత్తా చాటాల్సిందే.
హీలీ ఓకే..
ఈసారి పలు మ్యాచ్‌ల్లో క్లిష్ట సమయాల్లో పుంజుకొన్న తీరు ఆస్ట్రేలియా పోరాట పటిమను తెలియజేస్తుంది. కాగా.. కండర గాయంతో చివరి రెండు లీగ్ మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ హీలీ ఫిట్‌నెస్ టెస్ట్‌లో నెగ్గడం సెమీ్‌సకు ముందు ఆసీస్ జట్టుకు అత్యంత సానుకూలాంశం.
జట్లు (అంచనా)
భారత్: హర్మన్ ప్రీత్ (కెప్టెన్), స్మృతీ మంధాన, హర్లీన్, షఫాలీ, దీప్తిశర్మ, జెమీమా, స్నేహ్ రాణా, శ్రీచరణి, రేణుకా సింగ్, రిచా ఘోష్ (కీపర్), క్రాంతి గౌడ్.
ఆస్ట్రేలియా: అలిసా హీలీ (కెప్టెన్), గార్డ్‌నర్, కిమ్ గార్త్, అలనా కింగ్, లిచ్‌ఫీల్డ్, మెక్‌గ్రాత్, మోలినెక్స్, బేత్ మూనీ (కీపర్), పెర్రీ, షూట్, సదర్లాండ్.
వాతావరణం
గురువారం వర్షం కురిసే అవకాశం 25 శాతం మేర ఉంది. కనీసం 20 ఓవర్లు సాధ్యపడకపోతే మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరనుంచి శుక్రవారం రిజర్వ్‌డే నాడు మిగతా ఆట కొనసాగుతుంది. ఒక వేళ రిజర్వ్‌డే రోజు కూడా ఫలితం రాకపోతే గ్రూప్ దశలో భారత్‌కంటే అత్యధిక విజయాలున్న ఆస్ర్టేలియా ఫైనల్‌కు వెళ్తుంది.
Also Read:
రింకూ సింగ్-ప్రియ సరోజ్ లవ్ స్టోరీ రివీల్
సూర్య బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు: అభిషేక్ నాయర్