Share News

India vs Pakistan T20: ఇక మైదానంలో సమరం

ABN , Publish Date - Sep 14 , 2025 | 05:24 AM

ఆసియాకప్‌ మొదలై వారం కావొస్తున్నా జోష్‌ ఎక్కడ? పైగా అన్నీ ఏకపక్ష మ్యాచ్‌లే.. అంటూ అభిమానులు పెదవి విరుస్తున్న వేళ, ఈ టోర్నీలో అసలు సిసలైన మ్యాచ్‌కు నేడు తెర లేవనుంది. సండే బ్లాక్‌బస్టర్‌గా అలరించనున్న ఈ సమరంలో...

India vs Pakistan T20: ఇక  మైదానంలో సమరం

నేడు పాకిస్థాన్‌తో భారత్‌ పోరు

రాత్రి 8 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

ఆసియాకప్‌ మొదలై వారం కావొస్తున్నా జోష్‌ ఎక్కడ? పైగా అన్నీ ఏకపక్ష మ్యాచ్‌లే.. అంటూ అభిమానులు పెదవి విరుస్తున్న వేళ, ఈ టోర్నీలో అసలు సిసలైన మ్యాచ్‌కు నేడు తెర లేవనుంది. సండే బ్లాక్‌బస్టర్‌గా అలరించనున్న ఈ సమరంలో దాయాదులు భారత్‌-పాకిస్థాన్‌ జట్లు ఢీకొనబోతున్నాయి. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ తర్వాత పాక్‌తో మ్యాచ్‌లను బాయ్‌కాట్‌ చేయాలనే డిమాండ్‌ గట్టిగా వినిపిస్తున్న వేళ.. ఇరు దేశస్థుల భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉన్న తరుణాన.. ఎడారి దేశంలో ఎవరిది పైచేయి కానుందో చూడాల్సిందే!

దుబాయ్‌: అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌-పాకిస్థాన్‌ జట్లు తలపడడం చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ ప్రత్యేక పరిస్థితుల్లో జరుగబోతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. అందుకే పాక్‌తో క్రికెట్‌ ఆడడం అవసరమా? అని ఇప్పటికే భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలు రాజకీయ పార్టీలు కూడా దీనిపై గళమెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో పాక్‌తో పోరుకు టీమిండియా సిద్ధమైంది. యుద్ధభూమిలోనే కాదు మైదానంలోనూ పాక్‌ భరతం పట్టేందుకు సూర్యకుమార్‌ నేతృత్వంలోని భారత యువ ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. మరోవైపు సీనియర్‌ ఆటగాళ్లు లేకపోవడంతో పాక్‌ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది. అయితే జట్టులో స్పిన్నర్లు రాణిస్తుండడం వాళ్లకు సానుకూలాంశం. కాగా.. 2023 తర్వాత భారత్‌ ఆడిన మొత్తం 39 టీ20ల్లో 27 మ్యాచ్‌లు గెలవడం పొట్టి ఫార్మాట్‌లో మన ఆధిపత్యాన్ని చాటి చెబుతోంది. ఇక, ఇరు జట్ల మధ్య ఓవరాల్‌గా 13 టీ20లు జరిగితే.. భారత్‌ తొమ్మిది మ్యాచుల్లో, పాక్‌ మూడింటిలో నెగ్గింది. ఓ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.


ఫేవరెట్‌గా బరిలోకి..

పాక్‌తో పోల్చుకుంటే ప్రపంచ అగ్రశేణి బ్యాటర్లతో కూడిన భారత జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. వరల్డ్‌ నెంబర్‌వన్‌ అభిషేక్‌, గిల్‌ తొలిసారి దాయాదితో టీ20 ఆడబోతున్నారు. ఈ జోడీ దూకుడుకు మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌, తిలక్‌, హార్దిక్‌, దూబేల హిట్టింగ్‌ తోడైతే పాక్‌ బౌలర్లకు కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో స్టార్‌ పేసర్‌ బుమ్రా పదునైన బంతులకు స్పిన్నర్లు కుల్దీప్‌, అక్షర్‌, వరుణ్‌ చక్రవర్తిల మ్యాజిక్‌ స్పెల్‌ తోడైతే ప్రత్యర్థి బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. అయితే పొట్టి ఫార్మాట్‌ అంటే అనిశ్చితికి మారుపేరు కాబట్టి అవతలి జట్టు ఎంత బలహీనంగా కనిపించినా.. దాడి మాత్రం గట్టిగానే ఉండాలనే ఆలోచనలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉంది. కెప్టెన్‌ సూర్య కూడా తమలో దూకుడు ఏమాత్రం తగ్గదని టోర్నీ ఆరంభంలోనే స్పష్టంగా చెప్పాడు. అయితే పాక్‌పై ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో సూర్య 64 పరుగులే సాధించడం గమనార్హం.

తుది జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌, గిల్‌, తిలక్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), శాంసన్‌, దూబే, హార్దిక్‌, అక్షర్‌, కుల్దీప్‌, బుమ్రా, వరుణ్‌.

పాకిస్థాన్‌: ఫర్హాన్‌, సయీమ్‌ అయూబ్‌, ఫఖర్‌ జమాన్‌, సల్మాన్‌ ఆఘా (కెప్టెన్‌), హసన్‌ నవాజ్‌, మహ్మద్‌ హరీస్‌, మహ్మద్‌ నవాజ్‌, ఫహీమ్‌ అష్రాఫ్‌, షహీన్‌ అఫ్రీది, అబ్రార్‌ అహ్మద్‌, సుఫియాన్‌.

పిచ్‌

ఆరంభంలో కొత్త బంతి స్వింగ్‌ అయ్యే చాన్సుంది. అయితే మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపగలరు. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ బౌలింగ్‌ ఎంచుకోవచ్చు.


పోటీ ఏమేరకు?

తాజా పాక్‌ జట్టు లైన్‌పను గమనిస్తే బహుశా ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్ల పేర్లు తప్ప ఇతరుల గురించి క్రికెట్‌ అభిమానులకు అంతగా తెలిసి ఉండకపోవచ్చు. స్టార్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌లపై వేటు వేసి ఎక్కువ మంది కొత్తవారితో జట్టును ఎంపిక చేశారు. కొత్త కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా నేతృత్వంలోని ఈ జట్టు.. ఓపెనర్‌ సయీమ్‌ అయూబ్‌, ఫఖర్‌ జమాన్‌, మహ్మద్‌ హరీ్‌సల బ్యాటింగ్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. బౌలింగ్‌లో పేసర్‌ షహీన్‌ అఫ్రీదితో పాటు స్పిన్‌లో మహ్మద్‌ నవాజ్‌, అబ్రార్‌ అహ్మద్‌, సుఫియాన్‌ కీలకం కానున్నారు. అన్ని విభాగాల్లో భారత్‌కన్నా కాస్త బలహీనంగా కనిపిస్తున్న పాక్‌ జట్టు ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఏమేరకు పోటీనివ్వగలదో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్

ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 14 , 2025 | 05:24 AM