India Versus South Africa T20 series: మెగా టోర్నీ ముంగిట
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:59 AM
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టీ20 వరల్డ్‌క్‌పనకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతకంటే ముందు మనోళ్లు ఆడే మ్యాచ్‌లు పది మాత్రమే. ఇందులో భాగంగా నేటి నుంచి దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీ్‌సలో...
రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నేటి నుంచి ఐదు టీ20ల సిరీస్
గిల్, హార్దిక్‌ల రాకతో బలంగా భారత్
కెప్టెన్ సూర్య ఫామ్‌పై ఆందోళన
ఒత్తిడిలో దక్షిణాఫ్రికా
కటక్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టీ20 వరల్డ్‌క్‌పనకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతకంటే ముందు మనోళ్లు ఆడే మ్యాచ్‌లు పది మాత్రమే. ఇందులో భాగంగా నేటి నుంచి దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీ్‌సలో తలపడనుండగా, మిగతా ఐదు మ్యాచ్‌లను న్యూజిలాండ్‌తో ఆడనుంది. దీంతో టీమిండియా తాజా సిరీ్‌సను మెగా టోర్నీకి సన్నాహకంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. అంతేకాకుండా విశ్వకప్ కోసం చక్కటి కోర్ గ్రూప్‌ను తయారు చేసుకునే ఆలోచనలో కోచ్ గంభీర్ ఉన్నాడు. ఏ స్థానంలో ఎవరు ఆడాలి? కాంబినేషన్ ఎలా ఉండాలనేది ఈ సిరీస్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో భారత ప్రదర్శన అద్భుతంగా ఉంది. గతేడాది టీ20 వరల్డ్‌క్‌పలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లను నెగ్గి విజేతగా నిలిచిన టీమిండియా.. ఆ తర్వాత కూడా 20 మ్యాచ్‌ల్లో గెలిచి కేవలం నాలుగింట్లోనే ఓడింది. ఈ మధ్యకాలంలో ఒక్క టీ20 సిరీ్‌సను కూడా కోల్పోలేదు. ఇప్పుడు ఆ మెగా టోర్నీ ఫైనల్ ప్రత్యర్థితోనే జరుగుతున్న తాజా పోరులో బలాబలాలను సరిచూసుకోవాలనుకుంటోంది. అటు సఫారీలు పొట్టి ఫార్మాట్‌లో తడబడుతున్నారు. విశ్వక్‌పలో రన్నర్‌పగా నిలిచాక ఆ జట్టు ఆడిన 25 మ్యాచ్‌ల్లో తొమ్మిదే గెలవడం గమనార్హం. ఆసీస్, పాక్‌లపై సిరీ్‌సలు కోల్పోగా.. నమీబియాపైనా ఓడారు. దీంతో ఈ సిరీస్ సఫారీలకు సవాల్‌గా మారనుంది.
పటిష్టంగా భారత్: గాయాల నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో చేరడంతో టీమిండియా అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్ నుంచి నిరంతరాయంగా క్రికెట్ ఆడుతున్న గిల్‌కు దాదాపు నెల రోజుల విశ్రాంతి లభించినట్టయింది. అద్భుత ఫామ్‌లో ఉన్న అభిషేక్‌తో కలిసి అతను ఓపెనింగ్ చేయనున్నాడు. ఇక ఆసియాక్‌పలో గాయపడిన పాండ్యా రెండు నెలలకు పైగా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడి ఫామ్ చాటుకున్నాడు. అతడి రాకతో బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తోంది. అయితే ఆదివారం సాయంత్రం నెట్స్‌లో బౌలింగ్ చేసేటప్పుడు హార్దిక్ కాస్త అసౌకర్యానికి లోనైనట్టు సమాచారం. కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్‌లేమి మాత్రం జట్టును తీవ్రంగా ఆందోళన పరుస్తోంది. ఐపీఎల్‌లో 717 పరుగులతో అదరగొట్టిన తను భారత్ తరఫున మాత్రం రాణించడం లేదు. గతేడాది జూలైలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి 15 ఇన్నింగ్స్‌లో 184 పరుగులే చేయగా, చివరి 20 మ్యాచ్‌ల్లో అర్ధసెంచరీ చేయలేకపోయాడు. ఈ సిరీ్‌సలోనూ విఫలమైతే కెప్టెన్సీకే ఎసరు రావచ్చు. వికెట్ కీపర్ స్థానం కోసం శాంసన్, జితేశ్ మధ్య పోటీ నెలకొంది. ఆసీస్ టూర్‌లో వన్‌డౌన్‌లో శాంసన్‌ను ఒకే మ్యాచ్ ఆడించగా, చివరి మూడు మ్యాచ్‌ల్లో జితేశ్‌కు చోటు కల్పించారు. వాస్తవానికి గతేడాది ప్రపంచకప్ తర్వాత శాంసన్ ఓపెనర్‌గా మూడు శతకాలు బాదాడు. ఇందులో రెండు దక్షిణాఫ్రికాపైనే ఉన్నాయి. కానీ గిల్‌కు వైస్‌కెప్టెన్సీ అప్పగించి ఓపెనర్‌గా ఆడించడంతో సంజూ స్థానం మారింది. పేస్‌లో బుమ్రాకు హార్దిక్, దూబే తోడుగా ఉండనున్నారు. వరుణ్, అక్షర్, కుల్దీప్ స్పిన్ బాధ్యతలు తీసుకోనున్నారు.
జట్టులోకి నోకియా: మార్‌క్రమ్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న సౌతాఫ్రికా జట్టు హిట్టర్ డి జోర్జి, పేసర్ మఫాక సేవలను కోల్పోయింది. గాయాలతో వీరు సిరీస్‌కు దూరమయ్యారు. అయితే స్టార్ పేసర్ నోకియా సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి రావడం సానుకూలాంశం కానుంది. గిల్ ఎక్కువగా అతని బౌలింగ్‌లోనే దొరికిపోతుంటాడు. డికాక్‌తో కలిసి మార్‌క్రమ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. మిడిలార్డర్‌లో స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్ భారత బౌలర్లను ఇబ్బంది పెట్టగలరు. ముఖ్యంగా బ్రెవిస్ స్పిన్నర్లను ఓ ఆటాడుకుంటాడు. ఈ త్రయంలో ఒక్కరు కుదురుకున్నా భారీ స్కోరు ఖాయమే. పేసర్ యాన్సెన్ నిఖార్సయిన ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్, జితేశ్/శాంసన్, హార్దిక్, శివమ్ దూబే, అక్షర్, బుమ్రా, వరుణ్, కుల్దీప్.
దక్షిణాఫ్రికా: డికాక్, మార్‌క్రమ్ (కెప్టెన్), హెన్‌డ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, బాష్, యాన్సెన్, కేశవ్, ఎన్‌గిడి, నోకియా.
పిచ్
దక్షిణాఫ్రికాతో ఇక్కడ ఆడిన రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ భారత్‌కు ఓటములే ఎదురయ్యాయి. తొలిసారిగా ఈ వికెట్‌ను ఎర్రమట్టితో తయారు చేయడంతో ఆరంభంలో పేస్, బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బంతి బ్యాట్‌పైకి వచ్చే అవకాశం ఉండడంతో స్ట్రోక్‌ప్లేకు అనువుగా ఉంటుంది. స్పిన్నర్లు కూడా ప్రభావం చూపగలరు. మంచు కారణంగా టాస్ గెలిచిన జట్టు చేజింగ్‌కు మొగ్గు చూపే అవకాశముంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Jio Hotstar Exit: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. జియో హాట్ స్టార్ సంచలన నిర్ణయం
87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!