Share News

Champions Trophy: భారత్‌తో మ్యాచ్.. పాక్ గెలవాలంటే ఇదొక్కటే మార్గం

ABN , Publish Date - Feb 23 , 2025 | 10:58 AM

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌‌పై పాక్ గెలుపు అసాధ్యమే అయినా ఒక్క అవకాశం మాత్రం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Champions Trophy: భారత్‌తో మ్యాచ్..  పాక్ గెలవాలంటే ఇదొక్కటే మార్గం
Ind Vs Pak Champions Trophy 2025

ఇంటర్నెట్ డెస్క్: దాయాది దేశల మధ్య క్రికెట్ పోరు (India vs Pakistan) అంటేనే నరాలు తెగే ఉత్కంఠ. భారత్, పాక్ అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ పోరు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే, గత కొన్నేళ్లుగా పాక్ ఫామ్‌లో లేక తడబడుతోంది. దీంతో, భారత్ పాక్ మ్యాచులకు ఒకప్పటి క్రేజ్ ఇప్పుడు లేదనే వారూ ఉన్నారు. ‘‘ఈ మ్యాచ్‌లను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. మరి ఇంత జనాదరణ ఉన్న క్రికెట్ మ్యాచ్‌కు క్రేజ్ లేదని, కాదు ఉందని అనడానికి మనం ఎవరం’’ అని టీమిండియ వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇటీవల కామెంట్ చేశారు. ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ ఐసీసీ ఈవెంట్లలో భారత్ పాక్ మ్యాచ్‌కు ఉండే జనాదరణ మరే మ్యాచ్‌కు ఉండదనేది ఇప్పటికీ వాస్తవమే. నేడు దుబాయ్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసి పోనుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు టీవీలకు అతుక్కుపోనున్నారు (Champions Trophy 2025).

1990ల తరువాత నుంచి పాకిస్థాన్ వెనకబాటు మొదలైందని కొందరు చెబుతుంటారు. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రం, వకార్ యూనిస్, ఇన్‌జమామ్ ఉల్ హక్ తరువాత ఆ స్థాయి స్టార్లు, ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే ప్లేయర్లు పాక్ టీంలో కానకారకుండా పోయారు. భారత్‌లో మాత్రం ప్రతి తరంలోనూ కొత్త లాటెంట్ ఉనికిలోకి వస్తూనే ఉంది. టీమిండియాకు అండగా ఉంటోంది. జస్‌ప్రీత్ బుమ్రా వంటి స్టార్లు లేకపోయినా ప్రత్యామ్నాయ ప్లేయర్లతో ధీమాగా బరిలో దిగే స్థితిలో ప్రస్తుతం భారత్ ఉందంటే ఇదే కారణం.


Ind vs Pak: పాపం పాకిస్తాన్ అభిమానులు.. ఈసారి మ్యాచ్ ఓడిపోయినా టీవీలు పగలగొట్టలేరు..

పాక్ ప్లేయర్ల పేరు చెబితే భారతీయ అభిమానుల్లో ఒకప్పుడు కనిపించే ఆందోళన ప్రస్తుతం కనుమరుగైపోయిందనే చెప్పాలి. ఒకప్పటి పాక్ స్టార్ బౌలర్లు ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయెబ్ అక్తర్ వంటి భయానక బౌలర్లు పాక్‌లో ప్రస్తుతం లేరు. ప్రస్తుత బ్యాటర్లు బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్‌ ఒకప్పటికీ జావేద్ మియాందాద్, ఇన్‌జమామ్ ఉల్ హక్ స్థాయిలో ప్రత్యర్థిపై విరుచుపడలేరు.

ఇక నేడు జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ గ్రూప్ ఏ తరపున ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ మ్యాచ్‌లో భారత్‌ 80 శాతం వరకూ గెలిచే అవకాశం ఉంది. పాక్ ప్రస్తుత లైనప్ చూస్తే గెలిచే అవకాశం ఇసుమంతైనా కానరాదు. అదృష్టం కలిసొస్తే తప్ప దయాదీ దేశం గెలిచే ప్రసక్తే లేదని విశ్లేషకులు చెబుతున్న మాట. ఇరు దేశాల మధ్య కనీసం ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువే అని అంటున్నారు.


Ind vs Pak: భారత్‌తో మ్యాచ్.. స్పెషల్ కోచ్‌ను నియమించుకున్న పాకిస్తాన్ టీమ్..!

ఓవైపు టీమిండియాలో విజయోత్సాహం ఉరకలెత్తుతుంటే పాక్ మాత్రం గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి తప్పుకునే ప్రమాదం ఎదుర్కొంటోంది. టోర్నీలో కొనసాగడం దాదాపుగా అసాధ్యంగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 60 పరుగుల తేడాతో ఓడిపోవడంతో పాక్ రన్ రేట్ పడిపోయింది. ఇది చాలదన్నట్టు 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ ఓటమికి బాటలు వేసిన ఫకార్ జమన్ కూడా ఈసారి మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో, పాక్ బ్యాటింగ్ లైనప్ మరింత బలహీనంగా మారింది. భారత్ విజయావకాశాలను పెంచింది.

పాక్ ప్రధాన బలం బౌలింగ్. 2021 నాటి టీ20 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌ బౌలర్లు తమ సత్తా చాటారు. అయితే, ప్రస్తుత స్టార్ బౌలర్లు షాహీన్ అఫ్రీదీ, నసీమ్ షా, హరీస్ రవూఫ్ ఫామ్ లేక తడబాటుకు లోనవుతున్నారు. అయితే, పాక్ కోచ్ అకీబ్ జావెద్ మాత్రం ఇటీవల పత్రికా సమావేశంలో బౌలర్ల త్రయంలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. వారిని వసీం, వకార్, షోయెబ్‌లతో పోలుస్తూ ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. కానీ గాయాలు, ఫామ్ లేమి వారిని సతమతం చేస్తున్నాయి. ఇక దుబాయ్ పిచ్‌ పాకిస్థాన్‌కు అంతగా అనుకూలించకపోవచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. పిచ్ మందకొడిగా మారితే పాక్ పేసర్లకు చుక్కలు తప్పవని అంటున్నారు. ఇటీవల భారత్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. మంచు ప్రభావం కూడా లేకపోవడంతో రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బాగా నెమ్మదించిన విషయం తెలిసిందే.

అయితే, పాక్‌కు గెలించేందుకు ఒకే ఒక మార్గం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పిచ్ మందకొడిగా ఉన్న కారణంగా భారత్‌ను పాక్ తక్కువ స్కోరుకు పరిమితం చేయగలిగితే దయాది దేశానికి విజయావకాశాలు మెరుగవుతాయి. పాక్ 260 నుంచి 280 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగలిగినా లేదా ఆ స్థాయి లక్ష్యాన్ని ఛేదించేలా భారత్‌ను కట్టడి చేయగలిగినా మ్యాచ్ ఉత్కంఠ భరింతా మారొచ్చు. కానీ టీమిండియా భారీ స్కోరు చేస్తే మాత్రం పాక్ ఓటమి తప్పదు. పాక్ బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు చెప్పేమాట.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2025 | 11:11 AM