Share News

Test thriller: ఉత్కంఠ పోరులో.. లార్డ్స్‌ చేజారె

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:03 AM

ఆహా.. ఇది కదా టెస్టు క్రికెట్‌ మజా అంటే.. టీ20 జోరులో ఐదు రోజుల ఆటను బోరింగ్‌గా ఫీలయ్యే నేటి తరానికి విఖ్యాత లార్డ్స్‌ మైదానంలో భారత్‌ సాగించిన పోరాటాన్ని చూపాల్సిందే..

Test thriller: ఉత్కంఠ పోరులో.. లార్డ్స్‌ చేజారె

పోరాడి ఓడిన భారత్‌

రెండో ఇన్నింగ్స్‌లో 170 ఆలౌట్‌

22 పరుగులతో ఇంగ్లండ్‌ విజయం

జడేజా అజేయ అర్ధసెంచరీ

ఆహా.. ఇది కదా టెస్టు క్రికెట్‌ మజా అంటే.. టీ20 జోరులో ఐదు రోజుల ఆటను బోరింగ్‌గా ఫీలయ్యే నేటి తరానికి విఖ్యాత లార్డ్స్‌ మైదానంలో భారత్‌ సాగించిన పోరాటాన్ని చూపాల్సిందే.. 193 పరుగుల ఛేదనలో 112 రన్స్‌కే 8 వికెట్లు కోల్పోయిన గడ్డు స్థితిలో జడేజా వీరోచితంగా నిలబడిన తీరు అపూర్వం. మరో ఎండ్‌లో బుమ్రా, సిరాజ్‌ ఏపాటి క్రీజులో నిలుస్తారులే అని అంతా భావించినా.. చక్కటి వ్యూహంతో జడేజా వీరి అండతోనే భారత్‌ పోరాటాన్ని మరో 35 ఓవర్లపాటు కొనసాగించి టెస్టుపై ఆశలు రేపాడు. కానీ ఆఖరి సెషన్‌ ఆరంభంలో విజయానికి 22 పరుగుల దూరంలో భారత్‌ అద్వితీయ సమరానికి చెక్‌ పడింది. తొలి సెషన్‌లో నాలుగు కీలక వికెట్లతో దెబ్బతీసి పైచేయి సాధించిన ఇంగ్లండ్‌ చివరికి మూడో టెస్టును దక్కించుకుంది.


లండన్‌: ఇంగ్లండ్‌తో ఉత్కంఠ భరితంగా ముగిసిన మూడో టెస్టులో టీమిండియా పోరాటం ఫలితాన్నివ్వలేదు. టెయిలెండర్ల అండతో విజయం కోసం పట్టు వదలకుండా ప్రయత్నించినా దురదృష్టం వెంటాడింది. ఫలితంగా 193 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన గిల్‌ సేన ఆదివారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైంది. దీంతో 22 పరుగుల తేడాతో గట్టెక్కిన ఇంగ్లండ్‌ ఐదు టెస్టుల సిరీ్‌సలో 2-1తో ఆధిక్యం సాధించింది. జడేజా (181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 61 నాటౌట్‌), రాహుల్‌ (39) మాత్రమే రాణించారు. స్టోక్స్‌, ఆర్చర్‌లకు మూడేసి, కార్స్‌కు రెండు వికెట్లు దక్కాయి.ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 387, భారత్‌ 387 పరుగులు సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 192 రన్స్‌ చేసింది. స్టోక్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

వణికించిన ఆర్చర్‌

58/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆఖరి రోజు ఛేదన ఆరంభించిన భారత జట్టు రాహుల్‌, పంత్‌ (9) బ్యాటింగ్‌పైనే ఆశలు పెట్టుకుంది. కానీ విజయం కోసం మరో 135 పరుగులు కావాల్సి ఉండగా, అటు ఇంగ్లండ్‌ పేసర్ల సవాల్‌ను వీరితోపాటు ఇతర బ్యాటర్లు కూడా సరిగ్గా ఎదుర్కోలేకపోయారు. ఫలితంగా తొలి సెషన్‌ ముగిసే సరికి 112/8 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. రాహుల్‌, పంత్‌ క్రీజులో నిలిస్తే గెలుపు సులువే అని అంతా భావించారు. కానీ ఈ జోడీ 18 బంతుల తేడాతో పెవిలియన్‌కు చేరింది. వేలి నొప్పితో బాధపడుతున్న పంత్‌.. ఆర్చర్‌ పేస్‌ను ఆడేందుకు ఇబ్బందిపడ్డాడు. అయితే తన ఓవర్లలోనే రెండు ఫోర్లు బాదినా ఓ అద్భుత బంతికి బౌల్డయ్యాడు. ఇక కాసేపటికే కీలక రాహుల్‌ను స్టోక్స్‌ ఎల్బీ చేయగా, తర్వాతి ఓవర్‌లో సుందర్‌ను సూపర్‌ రిటర్న్‌ క్యాచ్‌తో ఆర్చర్‌ అవుట్‌ చేశాడు. ఇలా తొలి గంట ఆటలోనే మూడు వికెట్లు కోల్పోయి 82/7 స్కోరుతో నిలిచింది. ఈ స్థితిలో చివరి స్పెషలిస్ట్‌ బ్యాటర్లు జడేజా-నితీశ్‌ పట్టు వదలకుండా క్రీజులో నిలిచి బౌలర్లను విసిగించారు. చివరి ఓవర్‌లో నితీశ్‌ను పేసర్‌ వోక్స్‌ అవుట్‌ చేయడంతో 112/8తో జట్టు బ్రేక్‌కు వెళ్లింది. తొలి సెషన్‌లో స్టోక్స్‌ వరుసగా 9 ఓవర్లు వేయడం విశేషం.


అదిరే పోరాటంతో..

లక్ష్యం 81 పరుగులు.. ఉన్నవి రెండే వికెట్లు. రెండో సెషన్‌ సమయానికి గెలిచేందుకు భారత్‌ ముందున్న పరిస్థితి ఇది. అయితే అనూహ్యంగా బుమ్రా (5), సిరాజ్‌ (4)ల నుంచి జడేజాకు అద్భుతమైన సహకారం లభించింది. ఓవర్‌లో నాలుగు నుంచి ఐదు బంతులు తానే ఆడడం.. చివరి బంతిని వీరికి వదిలేసే ప్లాన్‌తో జడ్డూ బ్యాటింగ్‌ సాగించాడు. వోక్స్‌ ఓవర్‌లో జడేజా ఎల్బీ అయినా రివ్యూ ద్వారా బతికిపోయాడు. బుమ్రాను స్టోక్స్‌ అవుట్‌ చేయడంతో తొమ్మిదో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివరి వికెట్‌ మిగిలి ఉండడంతో ఈ సెషన్‌ను మరో అర్ధగంట పాటు పొడిగించారు. అయినప్పటికీ ఇంగ్లండ్‌ పేసర్ల బంతులను కాచుకున్న జడ్డూ-సిరాజ్‌ జోడీ వికెట్‌ను మాత్రం కోల్పోలేదు. జడ్డు ఎక్కువగా తనే స్ట్రయికింగ్‌ వచ్చేలా చూసుకున్నాడు. చివరకు 150 బంతుల్లో తన కెరీర్‌లోనే నెమ్మదైన అర్ధసెంచరీని సైతం పూర్తి చేశాడు. ఇక విజయానికి 30 పరుగుల దూరంలో జట్టు టీ బ్రేక్‌కు వెళ్లింది. కానీ ఆ తర్వాత భారత్‌ పోరాటం మరో ఐదు ఓవర్లకే పరిమితమైంది. స్పిన్నర్‌ బషీర్‌ ఓవర్‌లో సిరాజ్‌ ఐదో బంతిని బ్యాక్‌ఫుట్‌తో డిఫెండ్‌ చేశాడు. కానీ కింద పడగానే బంతి అతడి ప్యాడ్స్‌ పక్కనుంచి లెగ్‌ స్టంప్‌ను తాకింది. సిరాజ్‌ గమనించేలోపే బెయిల్స్‌ కూడా కిందపడడంతో తను షాక్‌తో క్రీజులో కుప్పకూలగా.. అటు స్టోక్స్‌ సేన సంబరాలు మిన్నంటాయి.


స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 387; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 387;

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 192.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) స్మిత్‌ (బి) ఆర్చర్‌ 0; రాహుల్‌ (ఎల్బీ) స్టోక్స్‌ 39; కరుణ్‌ (ఎల్బీ) కార్స్‌ 14; గిల్‌ (ఎల్బీ) కార్స్‌ 6; ఆకాశ్‌ (బి) స్టోక్స్‌ 1; పంత్‌ (బి) ఆర్చర్‌ 9; జడేజా (నాటౌట్‌) 61; సుందర్‌ (సి అండ్‌ బి) ఆర్చర్‌ 0; నితీశ్‌ (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 13; బుమ్రా (సి-సబ్‌) సామ్‌ కుక్‌ (బి) స్టోక్స్‌ 5; సిరాజ్‌ (బి) బషీర్‌ 4; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 74.5 ఓవర్లలో 170 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-5, 2-41, 3-53, 4-58, 5-71, 6-81, 7-82, 8-112, 9-147, 10-170; బౌలింగ్‌: వోక్స్‌ 12-5-21-1; ఆర్చర్‌ 16-1-55-3; స్టోక్స్‌ 24-4-48-3; కార్స్‌ 16-2-30-2; రూట్‌ 1-0-1-0; బషీర్‌ 5.5-1-6-1.

1

లార్డ్స్‌లో జరిగిన టెస్టుల్లో ఎక్కువ సార్లు (4) ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన స్టోక్స్‌

2

లార్డ్స్‌లో జరిగిన టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లోనూ 50+ స్కోర్లు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా జడేజా. 1952లో వినూ మన్కడ్‌ ఈ ఫీట్‌ సాధించాడు.

3

ఇంగ్లండ్‌లో భారత్‌ తరఫున వరుసగా నాలుగు 50+ స్కోర్లు సాధించిన మూడో బ్యాటర్‌గా జడేజా. పంత్‌ (5), గంగూలీ (4) ముందున్నారు.


సిరాజ్‌కు జరిమానా

పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించారు. అలాగే అతడి ఖాతాలో ఓ డీమెరిట్‌ పాయింట్‌ను కూడా చేర్చారు. నాలుగో రోజు ఆటలో డకెట్‌ వికెట్‌ తీసిన ఆనందంలో అతడు దూకుడుగా వ్యవహరించాడు. డకెట్‌ మొహం దగ్గరికి వెళ్లి అతడి భుజాన్ని ఢీకొట్టడం ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌కు విరుద్ధం కావడంతో రెఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 05:03 AM