Test Match Excitement: అదే టెస్టుఔన్నత్యం
ABN , Publish Date - Aug 06 , 2025 | 02:10 AM
అసలు సిసలు టెస్టు క్రికెట్ మజాను ఇంగ్లండ్-భారత్ సిరీస్ రుచి చూపించింది. ఐదు టెస్టుల్లో ఇరుజట్ల
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం): అసలు సిసలు టెస్టు క్రికెట్ మజాను ఇంగ్లండ్-భారత్ సిరీస్ రుచి చూపించింది. ఐదు టెస్టుల్లో ఇరుజట్ల ఆటగాళ్లు పోరాడిన తీరు అద్భుతం. ఇంగ్లండ్‌లో టెస్టులు అంటే ప్రతి అభిమానికి గుర్తుకు వచ్చేది ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్. కానీ, భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్ అంతకుమించి అనే విధంగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకొంది. నాటకీయ పరిణామాల మధ్య 25 రోజులపాటు సాగిన సిరీస్.. టెస్టుల స్థాయిని అమాతంగా పెంచేసింది. ఈ ఇండో-ఇంగ్లండ్ సిరీస్ సరికొత్త శత్రుత్వానికి బీజం వేసింది. ఈ ఆరోగ్యకరమైన పోరు భవిష్యత్‌లో యాషె్‌సను మించి ఎదగవచ్చన్నది విశ్లేషకుల అంచనా. సుదీర్ఘమైన షెడ్యూల్‌లో ఇరుజట్లూ కొదమసింహాల్లా తలపడ్డాయి. ప్రతి టెస్టూ ఐదోరోజు వరకూ సాగడం ఈ మధ్యకాలంలో అద్భుతమనే చెప్పుకోవాలి. సంధి దశలో ఉన్న టీమిండియా..యువ కెప్టెన్ గిల్ నాయకత్వంలో ఆతిథ్య ఇంగ్లండ్‌కు కనీసపోటీ ఇస్తే గొప్పే అని సిరీస్ ఆరంభానికి ముందు భావించారు. కానీ, యువ భారత్ పోరాటంతో ఇంగ్లండ్ బిత్తరపోయింది. బుమ్రా దూరమైన రెండు టెస్టుల్లోనూ గిల్‌సేన నెగ్గడం గమనార్హం. ముఖ్యంగా భారత్ సమష్టిగా ఆడడం ఈ సిరీస్ ప్రత్యేకతగా భావించాలి. ఆఖరి టెస్టు వేదిక ఓవల్‌లో మ్యాచ్ ముగింపు చిరకాలం గుర్తుండిపోతుంది. గెలుపు దోబూచులాడుతున్న తరుణంలో.. తీవ్ర ఒత్తిడి మధ్య భారత్ అపూర్వ విజయంతో అభిమానుల హృదయం పులకరించింది. సిరీస్ సాగిన తీరును యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించింది. ఫ్రాంచైజీ లీగుల జోరులో వైభవం కోల్పోతున్న టెస్టు క్రికెట్‌కు ఈ సిరీస్ సరికొత్త ఊపిరిలూదింది. ఇండో-ఇంగ్లండ్ సిరీ్‌సలో గెలుపెవరిదో తేలలేదు.. కానీ విజయం సాధించింది మాత్రం క్రికెట్ మాతృక టెస్టు ఫార్మాటే!
ఎప్పటికీ ఎవర్‌గ్రీన్
ఇంగ్లండ్‌తో సిరీస్ డ్రాగా ముగిసినా.. ఇరుజట్లు చేసిన పోరాటం అసాధారణం. మా ఈ ప్రదర్శన భారత టెస్టు క్రికెట్‌లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. టెస్టు క్రికెట్ మజా ఏంటన్నది ఈ సిరీస్ రుచి చూపించింది. ఇకనుంచి ఎవరు కూడా టెస్టు మ్యాచ్‌లు బోర్ అని అనరన్న నమ్మకముంది. సంప్రదాయ ఫార్మాట్ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్.
- కేఎల్ రాహుల్
ఇప్పుడు కూడా 4 రోజులంటారా..?
ఐసీసీ.. ఈ మ్యాచ్ జరిగిన విధానాన్ని చూసిన తర్వాత కూడా మీరు టెస్టులను నాలుగు రోజులకు కుదించాలనుకొంటున్నారా..?
- హెర్షల్ గిబ్స్