Share News

India vs UAE Asia Cup 2025: 27 బంతుల్లోనే

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:54 AM

డిఫెండింగ్‌ చాంప్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. ఆసియా కప్‌లో ఘనంగా బోణీ చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కుల్దీప్‌ యాదవ్‌ (4/7), శివం దూబే (3/4) తిప్పేయడంతో.. గ్రూప్‌-ఎలో బుధవారం ఏకపక్షంగా...

India vs UAE Asia Cup 2025: 27 బంతుల్లోనే

ఆసియా కప్‌లో నేడు

బంగ్లాదేశ్‌ X హాంకాంగ్‌

రాత్రి 8 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..

భారత్‌ సునాయాస విజయం

యూఏఈ 57 ఆలౌట్‌

కుల్దీ్‌పకు 4, దూబేకి 3 వికెట్లు

దుబాయ్‌: డిఫెండింగ్‌ చాంప్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. ఆసియా కప్‌లో ఘనంగా బోణీ చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కుల్దీప్‌ యాదవ్‌ (4/7), శివం దూబే (3/4) తిప్పేయడంతో.. గ్రూప్‌-ఎలో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. 79 బంతుల్లోనే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన టీమిండియా.. కేవలం 27 బంతుల్లోనే లక్ష్యాన్ని ఊదేసింది. దీంతో మొత్తం 106 బంతుల్లోనే మ్యాచ్‌ ముగిసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ 13.1 ఓవర్ల్లలో 57 పరుగులకే కుప్పకూలింది. అలీషాన్‌ షరాఫు (22), మహ్మద్‌ వసీం (19) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. శివం దూబే మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో భారత్‌ 4.3 ఓవర్లలో 60/1 స్కోరు చేసి గెలిచింది. అభిషేక్‌ శర్మ (30), శుభ్‌మన్‌ గిల్‌ (20 నాటౌట్‌) రాణించారు. జునైద్‌ ఒక వికెట్‌ దక్కించుకొన్నాడు.

అలవోకగా..: స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు అభిషేక్‌, గిల్‌ ప్రత్యర్థి బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు. తొలి బంతినే సిక్స్‌కు తరలించిన శర్మ.. రెండో బంతికి బౌండ్రీ సాధించాడు. రెండో ఓవర్‌లో రోహిద్‌ బౌలింగ్‌లో గిల్‌ 4,6తో 15 పరుగులు రాబట్టడంతో స్కోరు బోర్డు దూసుకెళ్లింది. మరో రెండు సిక్స్‌లు, ఫోర్‌ కొట్టిన అభిషేన్‌ను జునైద్‌ క్యాచవుట్‌ చేయడంతో.. తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. విజయానికి 10 పరుగులు కావల్సి ఉండగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ (7 నాటౌట్‌) ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలిచాడు. మరోవైపు బౌండ్రీతో మ్యాచ్‌ను ఫినిష్‌ చేసిన గిల్‌.. మరో 93 బంతులు మిగిలుండగానే జట్టుకు ఘన విజయం అందించాడు.


పెవిలియన్‌కు క్యూ..: పవర్‌ప్లేలో ఫర్వాలేదనిపించినా.. కుల్దీప్‌ స్పిన్‌ ఉచ్చులో చిక్కుకొన్న యూఏఈ బ్యాటింగ్‌ పేకమేడలా కూలింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈకి ఓపెనర్‌ అలీషాన్‌ మెరుగైన ఆరంభాన్నే ఇచ్చాడు. పాండ్యా వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో రెండు బౌండ్రీలు బాదాడు. బుమ్రా బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన షరాఫు.. అక్షర్‌ వేసిన మూడో ఓవర్‌లో సిక్స్‌తో బ్యాట్‌ ఝుళిపించాడు. కానీ, ఆ తర్వాతి ఓవర్‌లో బుమ్రా యార్కర్‌కు అలీషాన్‌ పెవిలియన్‌ చేరాడు. దీంతో తొలి వికెట్‌కు 26 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జొహైబ్‌ (2)ను వరుణ్‌ క్యాచవుట్‌ చేశాడు. కానీ, ఆరో ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో వసీం మూడు బౌండ్రీలతో 12 పరుగులు రాబట్టడంతో.. పవర్‌ప్లేను యూఏఈ 41/2తో ముగించింది. అయితే, మధ్య ఓవర్లలో కుల్దీప్‌ మాయాజాలంతో ఒక్కసారిగా కుదేలైంది. 8వ ఓవర్‌లో రాహుల్‌ చోప్రా (3), వసీంతోపాటు హర్షిత్‌ కౌశిక్‌ (2)ను కుల్దీప్‌ అవుట్‌ చేయడంతో.. యూఏఈ 50/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసిఫ్‌ ఖాన్‌ (2), ధ్రువ్‌ (1), జునైద్‌ సిద్దిఖీ (0)ను దూబే పెవిలియన్‌ చేర్చాడు. హైదర్‌ అలీ (1)ను క్యాచవుట్‌ చేసిన కుల్దీప్‌.. యూఏఈ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.


స్కోరుబోర్డు

యూఏఈ: అలిషన్‌ షరాఫు (బి) బుమ్రా 22, మహ్మద్‌ వసీమ్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 19, జొహైబ్‌ (సి) కుల్దీప్‌ (బి) వరుణ్‌ 2, రాహుల్‌ చోప్రా (సి) గిల్‌ (బి) కుల్దీప్‌ 3, ఆసిఫ్‌ (సి) శాంసన్‌ (బి) దూబే 2, హర్షిత్‌ (బి) కుల్దీప్‌ 2, ధ్రువ్‌ పరాషర్‌ (ఎల్బీ) దూబే 1, సిమ్రన్‌జీత్‌ (ఎల్బీ) అక్షర్‌ 1, హైదర్‌ (సి) శాంసన్‌ (బి) కుల్దీప్‌ 1, సిద్దిఖీ (సి) సూర్య (బి) దూబే 0, మహ్మద్‌ రోహిద్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 13.1 ఓవర్లలో 57 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-26, 2-29, 3-47, 4-48, 5-50, 6-51, 7-52, 8-54, 9-55, 10-57; బౌలింగ్‌: హార్దిక్‌ 1-0-10-0, బుమ్రా 3-0-19-1, అక్షర్‌ 3-0-13-1, వరుణ్‌ చక్రవర్తి 2-0-4-1, కుల్దీప్‌ 2.1-0-7-4, శివమ్‌ దూబే 2-0-4-3.

భారత్‌: అభిషేక్‌ (సి) హైదర్‌ (బి) సిద్దిఖీ 30, గిల్‌ (నాటౌట్‌) 20, సూర్యకుమార్‌ (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 4.3 ఓవర్లలో 60/1; వికెట్‌ పతనం: 1-48; బౌలింగ్‌: హైదర్‌ 1-0-10-0, రోహిద్‌ 1-0-15-0, పరాషర్‌ 1-0-13-0, సిద్దిఖీ 1-0-16-1, సిమ్రన్‌జీత్‌ సింగ్‌ 0.3-0-6-0.

1

4.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించిన భారత్‌.. టీ20ల్లో తన వేగవంతమైన ఛేదనను నమోదు చేసింది. గతంలో స్కాట్లాండ్‌పై 6.3 ఓవర్లలోనే ఛేదించిన రికార్డును టీమిండియా ఈ మ్యాచ్‌లో తిరగరాసింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 11 , 2025 | 04:54 AM