India Women Cricket: సిరీస్ మనదే
ABN , Publish Date - Dec 27 , 2025 | 02:55 AM
శ్రీలంక మహిళలతో ఐదు టీ20ల సిరీ్‌సను భారత్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సొంతం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మూడో టీ20లో ఎనిమిది వికెట్లతో హర్మన్ సేన...
రేణుక స్వింగ్, దీప్తి స్పిన్‌కు లంక విలవిల
షఫాలీ ధనాధన్
మూడో టీ20లో
భారత్ ఘన విజయం
తిరువనంతపురం: శ్రీలంక మహిళలతో ఐదు టీ20ల సిరీ్‌సను భారత్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సొంతం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మూడో టీ20లో ఎనిమిది వికెట్లతో హర్మన్ సేన ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు విజృంభించిన వేళ తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 112/7 స్కోరుకే పరిమితమైంది. ఇమేషా దులానీ (27), హాసినీ పెరీరా (25), కవిషా దిల్హరీ (20) మోస్తరుగా ఆడారు. ఏడాది తర్వాత టీ20ల బరిలో దిగిన రేణుకా సింగ్ (4/21) స్వింగ్ బౌలింగ్‌తో అదరగొట్టింది. దీప్తీశర్మ (3/18) మూడు వికెట్లు పడగొట్టింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 13.2 ఓవర్లలో 115/2తోఛేదించింది. షఫాలీ వర్మ (42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిసింది. కవిషా దిల్హరీ రెండు వికెట్లు కైవసం చేసుకుంది. రేణుకా సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.
షఫాలీ ఆడేసింది: ఈ మ్యాచ్‌లోనూ షఫాలీ వర్మ శ్రీలంక బౌలర్లను ఆడేసుకుంది. మంధాన (1), జెమీమా (9) విఫలమైనా కెప్టెన్ హర్మన్ (21 నాటౌట్) జతగా జట్టును సునాయాసంగా విజయ తీరాలకు చేర్చింది. స్పిన్నర్ నిమష వేసిన ఐదో ఓవర్లో 4,4,6,4తో షఫాలీ కదం తొక్కింది. అదే జోరులో 24 బంతుల్లోనే సిరీ్‌సలో వరుసగా రెండో హాఫ్ సెంచరీ పూరించింది. హర్మన్‌తో కలిసి మూడో వికెట్‌కు అభేద్యంగా 48 పరుగులు జోడించిన షఫాలీ..షఫానీ బౌలింగ్‌లో ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించింది.
బౌలర్ల జోరు: శ్రీలంక ఇన్నింగ్స్ ధాటిగానే ప్రారంభమైనా..భారత బౌలర్ల విజృంభణతో కుదుపులకు లోనైంది. మధ్య ఓవర్లలో ఇమేషా, కవిష ఆదుకోవడంతో స్కోరు సెంచరీ దాటింది. రేణుకా సింగ్, దీప్తీశర్మ దాటికి శ్రీలంక 45/4 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. క్రాంతి గౌడ్ వేసిన 13వ ఓవర్లో ఇమేషా దులానీ 4, కవిషా దిల్హరీ 6 బాదడంతో శ్రీలంకకు 14 పరుగులు లభించాయి. కుదురుకుంటున్న ఈ జోడీ నుంచి దిల్హరీని క్యాచవుట్ చేసిన దీప్తి ప్రత్యర్థికి మరోసారి షాకిచ్చింది. దాంతో 40 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. ఇక.. 16వ ఓవర్లో దులానీని కూడా రేణుక పెవిలియన్ చేర్చగా, 18వ ఓవర్లో మల్షాను దీప్తి బౌల్డ్ చేసింది. చివరి రెండు ఓవర్లలో కౌషిని (19 నాటౌట్) ఒక్కో ఫోర్ కొట్టడంతో శ్రీలంక ఓ మోస్తరు స్కోరు సాధించింది.
స్కోరు బోర్డు
శ్రీలంక: హాసినీ పెరీరా (సి) దీప్తీ శర్మ (బి) రేణుక 25, ఆటపట్టు (సి) హర్మన్ (బి) దీప్తీ శర్మ 3, హర్షిత (సి) అండ్ (బి) రేణుక 2, ఇమేషా (సి) జెమీమా (బి) రేణుక 27, నీలాక్షిక (ఎల్బీ) రేణుక 4, కవిష(సి) అమన్‌జోత్ (బి) దీప్తీ శర్మ 20, నుత్యాంగన (నాటౌట్) 19, షెహాని (బి) దీప్తీ శర్మ 5, మల్కి (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం: 20 ఓవర్లలో 112/7;
వికెట్లపతనం: 1-25, 2-31, 3-32, 4-45, 5-85, 6-90, 7-98; బౌలింగ్: రేణుక 4-1-21-4, క్రాంతి గౌడ్ 4-0-22-0, దీప్తీ శర్మ 4-0-18-3, వైష్ణవి 3-0-14-0, అమన్‌జోత్ 4-0-23-0, శ్రీ చరణి 1-0-11-0.
భారత్: షఫాలీ (నాటౌట్) 79, మంధాన (ఎల్బీ) దిల్హరీ 1, జెమీమా (బి) దిల్హరీ 9, హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 21, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం: 13.2 ఓవర్లలో 115/2; వికెట్లపతనం: 1-27, 2-67; బౌలింగ్: షెహాని 2.2-0-28-0, మదార 2-0-11-0, నిమషా 2-0-29-0, కవిష 3-0-18-2, ఇనోక 4-0-28-0.
1
టీ20 పురుషులు, మహిళల క్రికెట్‌లో 1000 రన్స్, 150 వికెట్లు సాధించిన ఏకైక ప్లేయర్‌గా దీప్తీ శర్మ.
1
టీ20ల్లో అత్యధిక వికెట్లు (151) తీసిన బౌలర్‌గా మెగన్ షట్ (ఆస్ట్రేలియా)తో కలిసి సంయుక్తంగా టాప్‌లో నిలిచిన దీప్తీ శర్మ.
1
మహిళల టీ20లలో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు (77, 130 మ్యాచ్‌లు) అందించిన హర్మన్‌ప్రీత్. మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా, 76 విజయాలు, 100 మ్యాచ్‌లు)ను అధిగమించింది.
3
మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక (333) వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా దీప్తీశర్మ. జులన్ గోస్వామి (355), షివర్ బ్రంట్ (335) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
Vignesh Puthur Creates History: 32 ఏళ్ల రికార్డ్ బద్దలు.. చరిత్ర సృష్టించిన విజ్ఞేష్