BCCI Appeals Against Verdict: రౌఫ్ సూర్యలకు జరిమానా
ABN , Publish Date - Sep 27 , 2025 | 02:47 AM
భారత్‌తో జరిగిన ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‌లో రెచ్చగొట్టేలా హావభావాలు ప్రదర్శించిన పాకిస్థాన్ పేసర్ హారిస్ రౌఫ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీరియస్ అయ్యింది....
మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత
ఫర్హాన్‌కు ఐసీసీ మందలింపు
తీర్పుపై బీసీసీఐ అప్పీలు
దుబాయ్: భారత్‌తో జరిగిన ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‌లో రెచ్చగొట్టేలా హావభావాలు ప్రదర్శించిన పాకిస్థాన్ పేసర్ హారిస్ రౌఫ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీరియస్ అయ్యింది. ఈ విషయమై భారత జట్టు ఇచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం పాక్ బస చేసిన హోటల్‌లో ఐసీసీ రెఫరీ రిచీ రిచర్డ్‌సన్ విచారణ జరిపాడు. అనంతరం.. రౌఫ్ లెవెల్ 1 నిబంధన అతిక్రమించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధిస్తున్నట్టు రిచీ ప్రకటించాడు. గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రౌఫ్ బౌండరీ లైన్ దగ్గర భారత అభిమానులకు 6-0 అనే సంకేతాన్ని చూపించాడు. ఆపరేషన్ సింధూర్‌లో తమ సైన్యం భారత్‌కు చెందిన రఫేల్ విమానాలను కూల్చారనే ఉద్దేశంతో అతను ఈ సైగలు చేశాడు. అలాగే అదే మ్యాచ్‌లో అర్ధసెంచరీ అయ్యాక ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ బ్యాట్‌తో గన్‌ఫైర్ సంబరాలు చేసుకున్నాడు. అయితే ఫర్హాన్ మాత్రం ఐసీసీ మందలింపుతో బయటపడ్డాడు. తమ ఫక్తూన్ తెగలో అలా వేడుకలు చేయడం సహజమేనంటూ ఫర్హాన్ వాదించాడు.
సూర్యకుమార్‌పైనా..: పాక్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో విజయం సాధించాక భారత కెప్టెన్ సూర్యకుమార్ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడికి దీటుగా భారత సైన్యం చూపిన తెగువకు ఈ విజయం అంకితమని ప్రకటించాడు. అయితే ఆటలో రాజకీయాలెందుకని పాక్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో సూర్యకుమార్‌ను కూడా ఐసీసీ విచారించింది. భవిష్యత్‌లో అలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలనే హెచ్చరికతో పాటు అతని మ్యాచ్ ఫీజులో ఐసీసీ 30 శాతం కోత విధించింది. అయితే, ఈ తీర్పుపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. సూర్యకు జరిమానా విధించడాన్ని తప్పుపట్టిన బీసీసీఐ.. ఈ తీర్పుపై అప్పీలు చేసింది. బీసీసీఐ అప్పీలు విషయంలో ఐసీసీ సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News