US Open Doubles Gabriela Dabrowski: డబ్రోస్కీ జోడీకి డబుల్స్ కిరీటం
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:58 AM
యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో మూడో సీడ్ ఎరిన్ రౌటిఫ్ (న్యూజిలాండ్)-గాబ్రియెలా డబ్రోస్కి (కెనడా) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో గాబ్రియెలా ద్వయం 6-4, 6-4తో టాప్ సీడ్...
నిరుడు క్యాన్సర్‌తో పోరాడి.. నేడు విజేతగా నిలిచి..
యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో మూడో సీడ్ ఎరిన్ రౌటిఫ్ (న్యూజిలాండ్)-గాబ్రియెలా డబ్రోస్కి (కెనడా) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో గాబ్రియెలా ద్వయం 6-4, 6-4తో టాప్ సీడ్ జంట టేలర్ టౌన్‌సెండ్ (యూఎ్‌సఏ)-కాటెరీనా సినియకోవా (చెక్)కు షాకిచ్చి ట్రోఫీని అందుకుంది.
ఏడాది క్రితం క్యాన్సర్ బారిన పడి ఎంతో వేదనను అనుభవించిన కెనడా టెన్నిస్ స్టార్ గాబ్రియెలా డబ్రోస్కీ (33).. ఇప్పుడు యూఎస్ ఓపెన్‌లో డబుల్స్ ట్రోఫీని ముద్దాడి చిరునవ్వులు చిందించింది. 2024, ఏప్రిల్‌లో డబ్రోస్కీ రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. రెండు సర్జరీలు, రేడియేషన్ చికిత్స చేయించుకొన్న ఆమె మూడు నెలలపాటు ఆట నుంచి విరామం తీసుకొంది. కానీ, పోరాటపటిమ గల డబ్రోస్కీ.. అతి తక్కువ వ్యవధిలోనే క్యాన్సర్ నుంచి కోలుకొంది. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ రాకెట్ పట్టింది. నిరుడు ఆగస్టులో పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడిన డబ్రోస్కీ.. ఫెలిక్స్ అలియాసిమితో జతకట్టి మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం గెలిచింది. ఆ తర్వాత కివీస్ క్రీడాకారిణి ఎరిన్ రౌటిఫ్‌తో కలిసి రియాద్‌లో జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్, సిన్సినాటితోపాటు పలు టోర్నీల్లో టైటిళ్లు సాధించింది. అదే జోష్‌తో తాజాగా యూఎస్ ఓపెన్ బరిలోకి దిగి విజేతగా నిలిచింది. ఇది కేవలం గెలుపు కాదు.. వ్యక్తిగతంగా, క్రీడాకారిణిగా తనకిది పునర్జన్మ అని డబ్రోస్కీ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ‘నేను అనుభవించిన బాధ చాలా మందికి తెలియదు. టెన్నిస్ కోర్టులో ఎందుకు అంతగా నవ్వుతున్నావని అందరూ అడుగుతున్నారు. అది ఎందుకో నాకు మాత్రమే తెలుసు’ అని బాధను సంతోషాన్ని కలగలిపి చెప్పిన డబ్రోస్కీ.. తన గాథతో నేటితరం ప్లేయర్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..