Inspiring Rise of Indian Womens Cricket: నిరాదరణ నుంచి జగజ్జేతగా
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:19 AM
2006లో భారత మహిళా క్రికెట్ జట్టు బీసీసీఐ ఆధ్వర్యంలోకి రావడంతో నెమ్మదిగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఆరంభంలో బోర్డు కూడా సీనియర్ జట్టుపైనే దృష్టి పెట్టింది. కానీ 2017 వన్డే వరల్డ్‌కప్ సెమీస్ మహిళల క్రికెట్‌లో కీలక మలుపుగా...
ఇదీ భారత మహిళల క్రికెట్ ప్రస్థానం
సాధారణ బోగీల్లో ప్రయాణాలు
సొంత బ్యాట్ కూడా లేని దుస్థితి
దేశంలో ఎక్కడ చూసినా భారత మహిళల క్రికెట్ జట్టు విశ్వకప్ సంబరాలే.. అటు చూస్తే హర్మన్‌ప్రీత్ సేనపై కాసుల వర్షం కురుస్తోంది. ఆ మాటకొస్తే. ఈ తరం మహిళా క్రికెటర్లకు గత కొంతకాలంగా పురుష క్రికెటర్లతో సమానంగా వేతనాలు లభిస్తున్నాయి. కొందరు ఎండార్స్‌మెంట్లతో కోట్ల సంపాదన కళ్లజూస్తున్నారు. జట్టు ఎక్కడికి వెళ్లినా బిజినెస్ క్లాసుల్లో ప్రయాణిస్తూ, ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేస్తోంది. ఇదంతా నేటి తరం క్రికెట్ అభిమానులకు మామూలుగానే అనిపిస్తుండొచ్చునేమో కానీ ఓ దశాబ్ద కాలం వెనక్కి వెళితే భారత మహిళా క్రికెటర్లు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో తెలుస్తుంది.
బీసీసీఐ అండతో..
2006లో భారత మహిళా క్రికెట్ జట్టు బీసీసీఐ ఆధ్వర్యంలోకి రావడంతో నెమ్మదిగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఆరంభంలో బోర్డు కూడా సీనియర్ జట్టుపైనే దృష్టి పెట్టింది. కానీ 2017 వన్డే వరల్డ్‌కప్ సెమీస్ మహిళల క్రికెట్‌లో కీలక మలుపుగా చెప్పవచ్చు. ఆసీ్‌సపై హర్మన్‌ప్రీత్ అజేయంగా 171 రన్స్ బాదడంతో జనాల దృష్టి ఒక్కసారిగా అమ్మాయిల జట్టుపై పడింది. ఆ తర్వాత స్మృతి మంధాన తన బ్యాటింగ్ మెరుపులతో మరింత ఆదరణ తెచ్చింది. అటు బోర్డు కూడా మహిళల క్రికెట్‌ను సీరియ్‌సగా తీసుకోవడం.. వీరికి కూడా డబ్ల్యూపీఎల్ నిర్వహించడంతో ఆట స్వరూపమే మారిపోయింది. తొలితరం మహిళా క్రికెటర్లు ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా ఆటపై అంకితభావంతో ముందుకు సాగారు. వారిని ప్రేరణగా తీసుకున్న ఇప్పటి ఆటగాళ్లు తమ అసాధారణ నైపుణ్యాలతో భారత మహిళల జట్టును అత్యున్నత స్థాయికి చేర్చగలిగారు.
చందాలతో పర్యటనలకు..
1973 నుంచి 2006 వరకు భారత మహిళల క్రికెట్ సంఘం (డబ్ల్యూసీఏఐ) ఆధ్వర్యంలో అమ్మాయిల జట్టు నడిచేది. ఆటగాళ్ల ఎంపికను కూడా ఈ సంఘమే చూసేది. అయితే టూర్లకు వెళ్లాలంటే మాత్రం చేతిలో డబ్బుండేది కాదు. దీంతో రైళ్లలో జనరల్ బోగీల్లోనే ప్రయాణించేవారు. ఆడినందుకు మ్యాచ్ ఫీజులుండేవి కావు. అటు అంతర్జాతీయ మహిళల క్రికెట్ మండలి (ఐడబ్ల్యూసీసీ) సైతం తమ సభ్యదేశాలకు నయా పైసా ఇచ్చేది కాదు. కేవలం ఆటపై అమితాసక్తి, ప్రేమతోనే అప్పటి ప్లేయర్లు క్రికెట్ టోర్నీల్లో ఆడేవారు. ఓసారి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి హోటళ్లలో బస చేసేందుకు డబ్ల్యూసీఏఐ దగ్గర డబ్బులు లేకపోతే.. స్థానిక భారతీయుల నివాసాల్లో సర్దుకోవాల్సి వచ్చింది. మరోసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సిన పరిస్థితిలో మాజీ ప్రెజెంటర్ మందిరా బేడీ సహాయపడింది. ఓ డైమండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు తనకు లభించిన మొత్తాన్ని డబ్ల్యూసీఏఐకి ఇవ్వగా, ఆ డబ్బుతోనే విమాన టిక్కెట్లు కొనుగోలు చేసి ప్లేయర్లను ఇంగ్లండ్‌కు పంపగలిగారు.

బ్యాట్లు కూడా పంచుకునేవారు
అప్పటి క్రికెటర్లకు సొంత కిట్ అనేది లగ్జరీ కిందే లెక్క. అందుకే బ్యాట్లను కూడా షేర్ చేసుకునేవారు. స్థానిక క్రికెట్ టోర్నీల్లో పాల్గొనేటప్పుడు ఆయా జట్ల దగ్గర మూడు బ్యాట్లే ఉండేవి. ఓపెనర్లు, వన్‌డౌన్ బ్యాటర్ ముందు వినియోగించేవారు. ఓపెనర్ అవుటైతే నాలుగో నెంబర్ ప్లేయర్ తన బ్యాట్, లెగ్ గార్డ్స్‌ను వాడేది. ఇక వీరుండే వసతి గృహాల్లో 20 మందికి కలిపి నాలుగు వాష్‌రూమ్స్‌ను వినియోగించుకునేవారు. నేలపైనే తమ సొంత దుప్పట్లు వేసుకుని పడుకునేవారు. 2005 వన్డే వరల్డ్‌క్‌పలో రన్నరప్‌గా నిలిచినందుకు ప్రైజ్‌మనీ లభించినా.. ఇప్పటి మాదిరిగా ప్రోత్సాహకాలూ వారికి దక్కలేదు.
ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం
ఈ వార్తలు కూడా చదవండి:
Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా
Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!
Read Latest AP News And Telugu News