Dhanush Srikanths Golden Triumph: సైలెంట్ బుల్లెట్
ABN , Publish Date - Nov 20 , 2025 | 06:36 AM
ధనుష్ శ్రీకాంత్.. భారత షూటింగ్‌లో సరికొత్త సంచలనం. వినలేడు.. మాట్లాడలేడు.. కానీ అతడి గన్ ‘స్వర్ణా’లను గర్జిస్తోంది. టోక్యోలో జరుగుతున్న బధిర ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో వ్యక్తిగత స్వర్ణంతోపాటు...
ధనుష్ గురిపెడితే స్వర్ణమే
ధనుష్ శ్రీకాంత్.. భారత షూటింగ్‌లో సరికొత్త సంచలనం. వినలేడు.. మాట్లాడలేడు.. కానీ అతడి గన్ ‘స్వర్ణా’లను గర్జిస్తోంది. టోక్యోలో జరుగుతున్న బధిర ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో వ్యక్తిగత స్వర్ణంతోపాటు మిక్స్‌డ్ విభాగంలో కూడా పసిడితో ఔరా.. అనిపించాడు 23 ఏళ్ల ధనుష్. సాధారణ షూటర్లకు దీటుగా నిలుస్తున్న ఈ హైదరాబాద్ కుర్రాడు.. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నాడు.
బొమ్మల సాయంతో..
ధను్‌షకు పుట్టుక నుంచే వినబడదు. కానీ, అతడి తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడూ ప్రత్యేక అవసరాలు కలిగిన వాడిగా చూడలేదు. షూటింగ్ పట్ల అతడి ఆసక్తిని గుర్తించి హైదరాబాద్‌లోని గగన్ నారంగ్ అకాడమీకి తీసుకెళ్లారు. అయితే, బధిరుడు కావడంతో కోచింగ్ ఇవ్వడం పెద్ద సవాల్‌గా మారింది. దీంతో డ్రాయింగ్‌లు, బొమ్మల సాయంతో ధనుష్‌కు శిక్షణ ఇవ్వడం ఆరంభించారు. అతడికి తల్లి ఆషా ఎంతో అండగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు వెళ్లడం ఆరంభమైన తర్వాత నెమ్మదిగా సంజ్ఞా భాష నేర్చుకొన్నాడు.
జాతీయ జట్టుకు ఆడిన బధిరుడిగా..
2018 తెలంగాణ రాష్ట్ర షూటింగ్ చాంపియన్‌షిప్ బరిలోకి దిగిన ధనుష్ జూనియర్, యూత్, సీనియర్ విభాగాల్లో పతకాలు సాధించాడు. 2019లో ఖేలో యూత్ గేమ్స్‌లో పాల్గొని ఈ క్రీడల్లో మెడల్ సాధించిన తొలి బధిర ప్లేయర్‌గా రికార్డుల కెక్కాడు. 16 ఏళ్ల వయసులో 2019లో జరిగిన ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత అండర్-21 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో జాతీయ జట్టులో చోటుదక్కించుకొన్న తొలి బధిర షూటర్‌గా నిలిచాడు. అనేక ఈవెంట్లలో సత్తాచాటినా.. ట్రయల్స్‌లో విఫలమవడంతో 2022 ఆసియా క్రీడల్లో పోటీపడే చాన్స్ లభించలేదు. కానీ, అదే ఏడాది బ్రెజిల్ వేదికగా జరిగిన డెఫ్లింపిక్స్‌లో తలపడిన ధనుష్.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని సాధించాడు. డెఫ్లింపిక్స్‌లో దేశానికి తొలి బంగారు పతకం అందించిన షూటర్‌గా అందరి దృష్టిని ఆకర్షించాడు. మిక్స్‌డ్‌లో ప్రియేషా దేశ్‌ముఖ్‌తో కలసి మరో పసిడి కొల్లగొట్టాడు. తాజాగా టోక్యో డెఫ్లింపిక్స్‌లోనూ స్వర్ణాలను నిలబెట్టుకొని చరిత్ర సృష్టించాడు. 2023లో జూనియర్ వరల్డ్‌క్‌పలోనూ స్వర్ణంతో మెరిశాడు.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
ఇవి కూడా చదవండి:
Venkatesh Iyer T20 XI: ఆల్‌టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లి దక్కని చోటు!
IND VS SA: ఘోరంగా విఫలమైన అభిషేక్, తిలక్, రుతురాజ్.. భారత్ ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి