Share News

India vs England 4th Test: బుమ్రా బరిలోకి

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:49 AM

ఏకాంశ్‌ సింగ్‌ (117) శతకంతో రాణించడంతో.. భారత అండర్‌-19తో రెండో అనధికార టెస్ట్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. ఆటకు రెండో రోజైన సోమవారం...

India vs England 4th Test: బుమ్రా బరిలోకి

ఏకాంశ్‌ సింగ్‌ శతకం

పంత్‌ కీపింగ్‌ ప్రాక్టీస్‌.. అన్షుల్‌కు చాన్స్‌!

  • ఇంగ్లండ్‌ 309 ఆలౌట్‌

  • భారత్‌ 51/1

  • యూత్‌ టెస్ట్‌

చెమ్స్‌ఫోర్డ్‌: ఏకాంశ్‌ సింగ్‌ (117) శతకంతో రాణించడంతో.. భారత అండర్‌-19తో రెండో అనధికార టెస్ట్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. ఆటకు రెండో రోజైన సోమవారం ఓవర్‌నైట్‌ స్కోరు 229/7కు ఇంగ్లండ్‌ మరో 80 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు చేజార్చుకొంది. నిన్నటి బ్యాటర్‌ ఏకాంశ్‌ వంద మార్క్‌ దాటాడు. నమన్‌ పుష్పక్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 51/1 స్కోరు చేసింది. కెప్టెన్‌ ఆయుష్‌ మహత్రే (24), విహాన్‌ మల్హోత్రా (6) క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (20)ను గ్రీన్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు భారత్‌ 258 పరుగుల దూరంలో ఉంది.


తేల్చిన పేసర్‌ సిరాజ్‌

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌తో జరిగే కీలకమైన నాలుగో టెస్టుకు భారత స్టార్‌ పేసర్‌ జస్ర్పీత్‌ బుమ్రా అందుబాటులో ఉంటాడా? లేడా? అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సిరీ్‌సలో 1-2తో వెనుకబడిన దశలో టీమిండియాకు మాంచెస్టర్‌ టెస్టు చావోరేవో లాంటిది. ఇందులో గెలిస్తేనే సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. అలాంటి ముఖ్యమైన టెస్టుకు పనిఒత్తిడిలో భాగంగా బుమ్రాకు విశ్రాంతినివ్వడం సరికాదని విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే ఈ సస్పెన్స్‌కు పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తెర దించాడు. ఈనెల 23 నుంచి ఇక్కడి ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో జరిగే టెస్టులో బుమ్రా బరిలోకి దిగుతాడని తేల్చాడు. ‘నాకు తెలిసినంత వరకు నాలుగో టెస్టులో బుమ్రా ఆడతాడు. గాయాల కారణంగా రోజురోజుకూ మా కాంబినేషన్‌ మారుతూ వస్తోంది. గాయంతో బాధపడుతున్న ఆకాశ్‌ దీప్‌ ఫిజియో పర్యవేక్షణలో ఉన్నాడు. సోమవారం ఉదయం తను బౌలింగ్‌ కూడా చేశాడు. కానీ అతడి ప్రాతినిధ్యంపై ఫిజియో నుంచి ప్రతిస్పందన రావాల్సి ఉంది. ఇక ఇంగ్లండ్‌ ఆటతీరును బట్టి మా బౌలింగ్‌ వ్యూహాలను మార్చుకుంటాం’ అని సిరాజ్‌ తెలిపాడు. ఇక బుమ్రా రాకతో జట్టు బౌలింగ్‌ విభాగం బలంగా మారనుంది. తాజా సిరీ్‌సలో తను తొలి, మూడో టెస్టు ఆడి బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే చివరి టెస్టుకు అందుబాటులో ఉంచాలని ముందుగా భావించారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో నాలుగో టెస్టులోనే తనను ఆడించాల్సిన అవసరం ఏర్పడింది.


కీపింగ్‌కు పంత్‌ సిద్ధమా?

మూడో టెస్టులో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఎడమచేతి చూపుడు వేలికి గాయమైంది. దీంతో తను బ్యాటింగ్‌ మాత్రమే చేసి కీపింగ్‌ బాధ్యతలను ధ్రువ్‌ జురెల్‌కు అప్పగించాడు. అందుకే నాలుగో టెస్టులో పంత్‌ ప్రాతినిధ్యంపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆదివారం నెట్స్‌లోనూ తను బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయగా.. జురెల్‌ కీపింగ్‌ చేస్తూ కనిపించాడు. దీంతో మాంచెస్టర్‌లో పంత్‌ స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా ఆడించి కీపర్‌గా జురెల్‌ను బరిలోకి దించుతారని అంతా భావించారు. కానీ ఈనెల 10 తర్వాత తొలిసారిగా పంత్‌ సోమవారం నెట్స్‌లో కీపింగ్‌ గ్లౌవ్స్‌ ధరించడం కనిపించింది. దీంతో కీపర్‌గా పంత్‌ కొనసాగవచ్చని సమాచారం. అదే జరిగితే జురెల్‌కు స్థానం కష్టమే. కానీ నితీశ్‌ సిరీ్‌సకు దూరమయ్యాడు కాబట్టి.. అతడి స్థానంలో జురెల్‌ను ఆడిస్తారా? లేక మరో ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను బరిలోకి దింపుతారా? అనేది వేచిచూడాల్సిందే.

వెంటాడుతున్న గాయాలు

నాలుగో టెస్టుకు ముందు భారత జట్టును గాయాల బెడద వేధిస్తోంది. యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ మోకాలి గాయంతో సిరీ్‌సకు దూరమైనట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. పునరావాస శిబిరంలో పాల్గొనేందుకు స్వదేశం వెళతాడని పేర్కొంది. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా అతడి మోకాలి లిగమెంట్‌ దెబ్బతింది. అలాగే పేసర్‌ అర్ష్‌దీప్‌ ఎడమచేతి బొటన వేలి గాయంతో ఈ టెస్టుకు అందుబాటులో లేడు. ఇక మరో పేసర్‌ ఆకాశ్‌దీ్‌ప వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అతడి ఫిట్‌నె్‌సపై ఇంకా స్పష్టత రాలేదు. అందుకే ముందు జాగ్రత్తగా హరియాణా యువ పేసర్‌ అన్షుల్‌ కాంబోజ్‌ను ఇంగ్లండ్‌కు రప్పించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో బుమ్రా, సిరాజ్‌కు జతగా మూడో పేసర్‌ స్థానంలో అన్షుల్‌తో అరంగేట్రం చేయించినా ఆశ్చర్యపోనవసరం లేదు.


పేసర్లకే అనుకూలం

మాంచెస్టర్‌ పిచ్‌ పచ్చికతో కళకళలాడుతోంది. అలాగే కొన్ని రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా అవుట్‌ఫీల్డ్‌ మాత్రం తడిగా ఉంది. ఇక వికెట్‌పై గ్రీన్‌ టాప్‌ కారణంగా బంతి స్వింగ్‌తో పాటు చక్కటి సీమ్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో పిచ్‌ ఫాస్ట్‌ బౌలర్లకు లాభించనుంది. ఆరంభ సెషన్లలో బ్యాటింగ్‌ చేయడం కష్టంగా మారనుంది.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 05:49 AM