Share News

BCCI on Ind Vs Pak: ఆసియా కప్‌లో పాక్‌తో భారత్ తలపడుతుందా.. బీసీసీఐ ఏమందంటే..

ABN , Publish Date - Sep 06 , 2025 | 09:51 PM

పాక్‌తో మల్టీనేషనల్ టోర్నమెంట్‌లల్లో పాల్గొనవద్దని కేంద్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదని బీసీసీఐ సెక్రెటరీ దేవ్‌జిత్ సైకియా తాజాగా స్పష్టం చేశారు. స్నేహపూర్వక సంబంధాలు లేని దేశాలతో ద్వైపాక్షిక టోర్నీల్లోనే భారత్ పాల్గొనబోదని వివరించారు.

BCCI on Ind Vs Pak: ఆసియా కప్‌లో పాక్‌తో భారత్ తలపడుతుందా.. బీసీసీఐ ఏమందంటే..
India vs Pakistan Asia Cup 2025

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో భారత్, పాక్‌లు తలపడతాయా అన్న ప్రశ్నపై ఉత్కంఠకు తెరపడింది. ఈ విషయంపై తాజాగా బీసీసీఐ సెక్రెటరీ దేవ్‌జిత్ సైకియా స్పందించారు. క్రీడా ఈవెంట్‌లకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలను ప్రస్తావించిన ఆయన.. పలు దేశాలు పాలుపంచుకునే మల్టీనేషనల్ ఈవెంట్స్‌లో స్నేహపూర్వక సంబంధాలు లేని దేశాలతో ఆడొద్దని కేంద్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదని అన్నారు. ఇలాంటి దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రమే భారత్ దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు.

‘ఆసియా ఖండంలోని దేశాలు పాల్గొనే మల్టీనేషనల్ టోర్నమెంట్ ఆసియా కప్. మనం ఇందులో పాల్గొనాల్సిందే. అదే విధంగా, ఐసీసీ టోర్నమెంట్స్‌లో భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు లేని దేశంతో మనం ఆడొచ్చు. ద్వైపాక్షిక సిరీస్‌లల్లో మాత్రం శత్రు దేశాలతో కలిసి పాల్గొనబోము’ అని సైకియా వివరించారు. వివిధ క్రీడల మల్టీనేషనల్ ఈవెంట్స్‌లో ఇలా బాయ్‌కాట్ చేస్తే అంతర్జాతీయ స్థాయి ఆంక్షలు వచ్చే అవకాశం ఉందని కూడా అన్నారు.


యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 9న జరగనుంది. ఈ మ్యాచ్‌లో అప్ఘానిస్థాన్, హాంకాంగ్ తలపడనున్నాయి. ఆ మరుసటి రోజు టీమిండియా తొలి మ్యాచ్ యూఏఈతో జరుగుతుంది. ఈ టోర్నీలో హైలైట్‌గా నిలవనున్న దాయాది దేశాల పోరు సెప్టెంబర్ 14న జరుగుతుంది. అయితే, పహల్గాం దాడి నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌తో క్రికెట్ సంబంధాలు వద్దని అభిమానులు, కొందరు మాజీ క్రీడాకారులు పలు వేదికల్లో అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై తాజాగా బీసీసీఐ స్పందించడంతో క్లారిటీ వచ్చింది. ఇక ఈ టోర్నీలో.. సెప్టెంబర్ 9 తేదీ నుంచి నుంచి సెప్టెంబర్ 19 వరకూ గ్రూప్ దశ మ్యాచులను నిర్వహిస్తారు. ఆ తరువాత సెప్టెంబర్ 20 నుంచి 26 తేదీల మధ్య సూపర్ 4 స్టేజి మ్యాచులు జరగనున్నాయి. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది.


ఇవి కూడా చదవండి

సెమీస్‌లో తలపడనున్న జొకో, అల్కారజ్.. అభిమానుల్లో ఉత్కంఠ

ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 06 , 2025 | 10:40 PM