Australia Women Cricketers: ఆసీస్ మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:04 AM
సాఫీగా సాగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఊహించని ఉదంతం చోటు చేసుకుంది. ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు లైంగిక వేధింపులకు గురి కావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో..
ఇండోర్‌లో ఘటన
నిందితుడి అరెస్ట్
ఇండోర్: సాఫీగా సాగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఊహించని ఉదంతం చోటు చేసుకుంది. ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు లైంగిక వేధింపులకు గురి కావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆ ఇద్దరు మహిళా క్రికెటర్లు తాము బస చేసిన రాడిసన్ బ్లూ హోటల్ నుంచి సమీపంలోని కేఫ్‌కు బయలు దేరారు. మోటార్ సైకిల్‌పై అనుసరిస్తూ వచ్చిన యువకుడొకరు ఖజ్రానా రోడ్డులోకి రాగానే క్రికెటర్లలో ఒకరిని అసభ్యకర రీతిలో తాకి పరారయ్యాడు. సంఘటనతో షాక్‌కు గురైన క్రికెటర్లు తమ భద్రతా అధికారి డానీ సిమోన్స్‌కు ‘డిస్ట్రెస్ కాల్’ చేశారు. అప్రమత్తమైన ఆ అధికారి స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. తక్షణమే అక్కడికి చేరుకున్న పోలీసులు తమ వాహనంలో క్రికెటర్లను హోటల్‌కు చేర్చారు. ఈ ఘటనపై స్థానిక ఎంఐజీ పోలీస్టేషన్‌లో సిమోన్స్ ఫిర్యాదు చేశారు. అనంతరం విచారణ జరిపిన పోలీసులు.. నిందితుడిని ఆజాద్ నగర్‌కు చెందిన 30 ఏళ్ల అఖీల్‌ఖాన్‌గా గుర్తించి అతడిని అరెస్ట్ చేసినట్టు ఇండోర్ నేర విభాగ అదనపు డీసీపీ రాజేశ్ దంతోదియన్ వెల్లడించారు. అతడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 74 (మహిళపై దాడి చేయడం), 78 (వెంబడించడం)పై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్టు తెలిపారు. ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ విజయ్‌వర్గీయ స్పందించారు. ఇది భారత ప్రతిష్ఠను దెబ్బ తీస్తుందన్నారు.
బీసీసీఐ ఖండన: ఆస్ట్రేలియా క్రికెటర్లపై జరిగిన ఘటనను బీసీసీఐ తీవ్రంగా ఖండించింది. ‘ఆతిథ్యానికి భారత్ పెట్టింది పేరు. ఇలాంటి ఘటనను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోం. మా భద్రతా చర్యలను సమీక్షించుకొని మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాం’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Gautam Gambhir's Reaction: రోహిత్ శర్మ 50వ సెంచరీ.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్
Rohit Sharma: ఫీల్డింగ్‌లోనూ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అదెలాగంటే?