Akash Deep Struggles: కష్టాల కడలిని దాటి..ఆకాశమే హద్దుగా ఎదిగి
ABN , Publish Date - Jul 08 , 2025 | 02:52 AM
ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్టు విజయం కోసం భారత జట్టు దశాబ్దాలపాటు ఎదురుచూసింది.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం): ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్టు విజయం కోసం భారత జట్టు దశాబ్దాలపాటు ఎదురుచూసింది. అయితే బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై పది వికెట్లు పతనం చేయడం ద్వారా ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన పేసర్ ఆకాశ్ దీప్ ఈ గెలుపు సంబరాలకు ప్రధాన కారకుల్లో ఒకడు. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో తుది జట్టులోకి వచ్చిన ఆకాశ్ చిరస్మరణీయ ప్రదర్శనతో అబ్బురపర్చాడు. బర్మింగ్‌హామ్ టెస్టుకు ముందు అతడు 7 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు. దీంతో ఆకాశ్‌కు బదులు అర్ష్‌దీ్‌పకు చాన్స్ ఇవ్వాలన్న చర్చలు కూడా జరిగాయి. అయితే కోచ్, కెప్టెన్.. ఆకాశ్‌పై నమ్మకముంచి తుదిజట్టులో చోటు కల్పించారు. ఆ ఇద్దరి నమ్మకాన్ని నిలబెడుతూ ఆకాశ్ ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే బిహార్ నుంచి బర్మింగ్‌హామ్ వరకు ఎదిగిన ఆకాశ్ విజయం వెనుక ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, సవాళ్లున్నాయి.
సీక్రెట్‌గా క్రికెట్ ఆడేస్తూ..
బిహార్‌లోని రోహ్‌తాస్ జిల్లా దెహ్రి గ్రామంలో జన్మించిన ఆకాశ్ కుటుంబానికి క్రీడా నేపథ్యం లేదు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ కనిపించదు. ఇక బ్యాట్, బంతి పడితే భవిష్యత్ ఉండదని టీచర్‌గా పనిచేసిన ఆకాశ్ తండ్రి కూడా అతడిని ప్రోత్సహించలేదు. కొడుకు బాగా చదువుకుని ఉద్యో గం చేస్తే చాలనుకున్నాడు. ఆ గ్రామంలో బాలురు క్రికెట్ ఆడితే పెద్ద తప్పుగా పరిగణిస్తుంటారు. మిగతా తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఆకాశ్‌తో కలవనిచ్చేవారు కాదట. అతడు క్రికెట్ ఆడడం తప్ప ఏమీ చేయడని, మీ చదువులు కూడా పాడవుతాయని హెచ్చరించేవారు. అందుకే ఆకాశ్ ఎవరికంటా పడకుండా క్రికెట్ ఆడాల్సి వచ్చేది.
బిహార్‌లో ఉంటే ఎదగలేమనుకున్న ఆకాశ్ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు మకాం మార్చాడు. అప్పటిదాకా బ్యాటర్‌గా ఉన్న అతను పేసర్‌గా శిక్షణ తీసుకుంటూ స్థానిక క్లబ్‌లకు ఆడాడు. కెరీర్ గాడిలో పడుతున్న దశలో ఆకాశ్ జీవితంలో ఊహించని విషాదాలు చోటు చేసుకున్నాయి. ఆరు నెలల వ్యవధిలోనే ఆకాశ్ తండ్రి, సోదరుడు అనారోగ్యంతో మరణించారు. దాంతో కుటుంబ బాధ్యతల కోసం అతను స్వస్థలానికి తిరిగిరాక తప్పలేదు. క్రికెట్‌వైపు మనసు లాగుతున్నా, కుటుంబ పరిస్థితుల రీత్యా అతను మూడేళ్లు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. ఈ దశలో ఆకాశ్ పడిన వేదన అంతాఇంతా కాదు. ఎట్టకేలకు సుదీర్ఘకాలం తర్వాత కోల్‌కతా వెళ్లి అరుణ్ లాల్ శిక్షణలో రాటుదేలి బెంగాల్ జట్టులో చేరాడు.
2019లో రంజీల్లో అరంగేట్రం చేసి 35 వికెట్లు తీశాడు. జట్టును రన్నర్‌పగా నిలిపాడు. ఇక తమ నెట్ బౌలర్‌గా ఉన్న ఆకాశ్ ప్రతిభను గమనించి ఆర్‌సీబీ 2021 ఐపీఎల్ వేలంలో రూ. 20 లక్షలకు తీసుకుంది. అప్పటి నుంచి 2024 వరకు ఆ జట్టుకే ఆడిన అతను వెనుదిరిగి చూడలేదు. అందుకే ఈ ఏడాది వేలంలో లఖ్‌నవూ జట్టు ఆకాశ్‌పై రూ. 8 కోట్లు వెచ్చించింది. చక్కటి ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకున్న ఆకాశ్ గతేడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యా డు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టుతో అరంగేట్రం చేసి 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కెరీర్‌లో 8 టెస్టులు ఆడిన ఆకాశ్ పరిమిత ఓవర్లలో ఇంకా ప్రాతినిధ్యం వహించలేదు. అయితే బుమ్రాపై పనిఒత్తిడి భారం అధికంగా ఉన్న నేపథ్యంలో ఆకాశ్ మున్ముందు ఇదే రీతిన చెలరేగితే భారత పేస్ దళం మరింత బలపడినట్టే.