Commonwealth Games 2030: అహ్మదాబాద్‌లో కామన్వెల్త్ క్రీడలు
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:37 AM
భారత్‌లో మరో అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా నిలవడం దాదాపు ఖరారైంది. 2030వ సంవత్సరంలో...
2030 గేమ్స్ వేదికను ప్రతిపాదించిన ఎగ్జిక్యూటివ్ బోర్డు
వచ్చేనెల 26న అధికారిక ప్రకటన
న్యూఢిల్లీ: భారత్‌లో మరో అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా నిలవడం దాదాపు ఖరారైంది. 2030వ సంవత్సరంలో జరిగే ఈ క్రీడలకు అహ్మదాబాద్‌ను ఎంపిక చేయాలని కామన్వెల్త్ ఎగ్జిక్యూటివ్ (కార్యనిర్వహణ) బోర్డు ప్రతిపాదన చేసింది. వచ్చే నెల 26న స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ జనరల్ అసెంబ్లీలో దాదాపు పూర్తి సభ్యదేశాల అంగీకారంతో వేదిక ఖరారవుతుంది. ఇక ఈ క్రీడల ఆతిథ్యం కోసం నైజీరియాలోని అబూజా నగరం కూడా పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే నైజీరియా 2034లో ఈ క్రీడల నిర్వహణకు వ్యూహాలు రూపొందించేందుకు తాము సహకరిస్తామని బోర్డు ఈ సందర్భంగా తెలిపింది. దీంతో భారత్‌కు ఆతిథ్య హక్కులు అప్పగించడం లాంఛనమేనని భావించాలి. కాగా 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. 2036 ఒలింపిక్స్‌ను అహ్మదాబాద్ వేదికగా నిర్వహించేందుకు గతేడాది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి భారత్ తమ ఆసక్తి వ్యక్తీకరణ లేఖను అందించిన సంగతి తెలిసిందే. ఈ కామన్వెల్త్ క్రీడల కేటాయింపు జరిగితే అది ఒలింపిక్స్ ఆతిథ్య రేసులో భారత్‌కు ఎంతో ఉపయుక్తమవుతుంది. ఒలింపిక్స్, ఆసియా క్రీడల తర్వాత క్రీడారంగంలో మూడో అతిపెద్ద ఈవెంట్‌గా కామన్వెల్త్ క్రీడలు భాసిల్లుతున్నాయి. కామన్వెల్త్ క్రీడలు మొదటి సారిగా 1930లో కెనడా వేదికగా జరిగాయి. అహ్మదాబాద్ ఈవెంట్‌తో ఈ మెగా క్రీడలు వందేళ్లు పూర్తి చేసుకోనుండడం విశేషం.
భారత్ సత్తాకు నిదర్శనం
కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం దక్కడంపై భారత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ సత్తా చాటుతుందనేందుకు ఇదే అతి పెద్ద నిదర్శనమని వ్యాఖ్యానించారు.
‘అంతర్జాతీయ క్రీడా యవనికపై భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర ప్రయత్నానికి ఇది నిదర్శనం’ అని అమిత్ షా అన్నారు.
‘ప్రపంచ క్రీడల్లో భారత్ ఆధిపత్యాన్ని చాటుతుందనేందుకు ఈ క్రీడల ఆతిథ్యం దక్కడమే ఉదాహరణ’ అని క్రీడామంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
‘వికసిత్ భారత్ 2047 దిశగా అద్భుత పురోగతి సాధిస్తున్నామని ఈ క్రీడల నిర్వహణ చాటిచెబుతుంది. అంతేకాదు.. ఈ క్రీడలు కామన్వెల్త్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలపరిచేందుకు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి’ అని ఉష వ్యాఖ్యానించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News