అభి‘షేక్’ చేశాడు
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:37 AM
అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ (54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లతో 135)కు ఇంగ్లండ్ జట్టు బెంబేలెత్తిపోయింది. వాంఖడేలో అతడి సిక్సర్ల సునామీకి స్టాండ్స్ దద్దరిల్లిపోయాయి. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా ఎవరి బంతి అయినా క్రీజులో పడితే చాలు...

37 బంతుల్లోనే అదిరే శతకం
విజృంభించిన బౌలర్లు
ఆఖరి టీ20లోనూ భారత్ విజయం
చిత్తుగా ఓడిన ఇంగ్లండ్
4-1తో సిరీస్ కైవసం
ముంబై: అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ (54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లతో 135)కు ఇంగ్లండ్ జట్టు బెంబేలెత్తిపోయింది. వాంఖడేలో అతడి సిక్సర్ల సునామీకి స్టాండ్స్ దద్దరిల్లిపోయాయి. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా ఎవరి బంతి అయినా క్రీజులో పడితే చాలు.. బౌండరీకే అన్నట్టుగా అభిషేక్ ఆటతీరు సాగింది. ఆ తర్వాత బౌలర్ల ఆధిపత్యానికి ఇంగ్లండ్ జట్టు కనీసం అభిషేక్ వ్యక్తిగత స్కోరును కూడా సాధించలేకపోయింది. ఫలితంగా ఆ జట్టు టీ20 చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 150 పరుగుల భారీ తేడాతో ఓడింది. అటు 4-1 తేడాతో టీమిండియా సిరీ్‌సను సగర్వంగా పూర్తి చేసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులు చేసింది. శివమ్ దూబే (13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30) వేగంగా ఆడాడు. కార్స్‌కు మూడు, ఉడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 రన్స్ చేసి ఓడింది. సాల్ట్ (23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) రాణించాడు. షమికి 3.. అభిషేక్, దూబే, వరుణ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా అభిషేక్.. ప్లేయర్ ఆఫ్ ద సిరీ్‌సగా వరుణ్ చక్రవర్తి నిలిచారు.
పోరాటమే లేకుండా..: భారత్ పరుగుల వరద పారించిన చోట ఇంగ్లండ్ దారుణంగా చతికిల పడింది. ఓపెనర్ సాల్ట్ మినహా అంతా విఫలమయ్యారు. తొలి ఓవర్‌ను 4,4,6తో ఆరంభించిన సాల్ట్ 17 రన్స్ రాబట్టాడు. మరో ఎండ్‌లో మాత్రం తమకేం సంబంధం లేదన్నట్టుగా భారత స్పిన్నర్ల ధాటికి సహచరులు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. అయి నా సాల్ట్ ధాటికి జట్టు పవర్‌ప్లేలో 68/3 స్కోరుతో నిలిచింది. అలాగే ఏడో ఓవర్‌లో సిక్సర్‌తో అతడు 21 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ తర్వా తి ఓవర్‌లోనే సాల్ట్‌ను దూబే అవుట్ చేయడంతో గెలుపుపై ఉన్న కాస్త ఆశలు ఆవిరయ్యాయి. దీనికి తోడు అభిషేక్ తొమ్మిదో ఓవర్‌లో 2 వికె ట్లు తీయడంతో జట్టు 90/7 స్కోరుతో ఓటమి ఖాయమైంది. చివరికి 11వ ఓవర్‌లో షమి తీసిన 2 వికెట్లతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేలవంగా ముగిసింది.
ఒక్కడే ఆడేశాడు..: టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ఇంగ్లండ్‌కు తామెంత పెద్ద తప్పు చేశామో రుచి చూపించాడు ఓపెనర్ అభిషేక్ శర్మ. బౌలర్లపై ఎలాంటి కనికరం లేకుండా అతడు చూపిన విధ్వంసానికి వాంఖడే పరుగుల హోరులో తడిసిపోయింది. పదేపదే స్టాండ్స్‌లోకి పడిన సిక్సర్లను తెచ్చేందుకు ఇంగ్లండ్ ఫీల్డర్లు తెగ కష్టపడ్డారు. అంతకుముందు ఇన్నింగ్స్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన ఓపెనర్ శాంసన్ అదే ఓవర్‌లో మరో 6,4తో అదరగొట్టాడు. కానీ రెండో ఓవర్‌లోనే ఉడ్ షార్ట్ పిచ్ బంతికి డీప్ స్క్వేర్‌లెగ్‌లో ఆర్చర్‌కు దొరికిపోయాడు. ఈ సిరీస్ ఆద్యంతం తను ఇలాంటి బంతులకే వెనుదిరగడం గమనార్హం. ఇక మూడో ఓవర్‌లో 4,6,6తో అభిషేక్ హవా సాగింది. తర్వాతి రెండు ఓవర్లలో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 17 బంతుల్లోనే ఫిఫ్టీని కూడా పూర్తి చేశాడు. అప్పటికి ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్లు కూడా పూర్తికాలేదు. అటు తిలక్ (24) ఉన్న కాసేపు వేగంగా ఆడడంతో పవర్‌ప్లేలో జట్టు 95/1 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత స్పిన్నర్లు రషీద్, లివింగ్‌స్టోన్‌ల తొలి ఓవర్లలో అభిషేక్ రెండేసి సిక్సర్లతో పరుగులు రాబట్టాడు.
మరోవైపు తొమ్మిదో ఓవర్‌లో తిలక్‌ను కార్స్ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇందులో అభిషేక్‌వే 89 పరుగులుండడం అతడి వేగాన్ని సూచిస్తుంది. ఎక్కడా తగ్గకుండా సాగిన తన జోరుకు 37 బంతుల్లోనే రెండో సెంచరీ సైతం పూర్తి చేసుకున్నాడు. కానీ కెప్టెన్ సూర్య (2) ఈ మ్యాచ్‌లోనూ నిరాశపర్చగా, ఈ దశలో దూబే జత కలవడంతో స్కోరులో మరింత వేగం పెరిగింది. 12వ ఓవర్‌లో అతడి 4,6తో స్కోరు 150 దాటింది. అయితే చివర్లో బౌలర్లు కట్టడి చేశారు. వరుస ఓవర్లలో జట్టు దూబే, హార్దిక్ (9), రింకూ (9) వికెట్లను కోల్పోయింది. అయినా మరో ఎండ్‌లో అభిషేక్ బౌండరీలు బాదడం ఆపలేదు. చివరికి అతడిని 18వ ఓవర్‌లో రషీద్ అవుట్ చేయడంతో అద్భుత ఇన్నింగ్స్‌కు తెర పడినట్టయ్యింది. మరోవైపు ఆఖరి రెండు ఓవర్లలో పది పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో 250లోపే పరిమితమైంది.
స్కోరుబోర్డు
భారత్: శాంసన్ (సి) ఆర్చర్ (బి) ఉడ్ 16; అభిషేక్ (సి) ఆర్చర్ (బి) రషీద్ 135; తిలక్ (సి) సాల్ట్ (బి) కార్స్ 24; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) కార్స్ 2; దూబే (సి) రషీద్ (బి) కార్స్ 30; హార్దిక్ (సి) లివింగ్‌స్టోన్ (బి) ఉడ్ 9; రింకూ (ఎల్బీ) ఆర్చర్ 9; అక్షర్ (రనౌట్) 15; షమి (నాటౌట్) 0; బిష్ణోయ్ (సి) కార్స్ (బి) ఒవర్టన్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 247/9. వికెట్ల పతనం: 1-21, 2-136, 3-145, 4-182, 5-193, 6-202, 7-237, 8-247, 9-247. బౌలింగ్: ఆర్చర్ 4-0-55-1; ఉడ్ 4-0-32-2; ఒవర్టన్ 3-0-48-1; లివింగ్‌స్టోన్ 2-0-29-0; రషీద్ 3-0-41-1; కార్స్ 4-0-38-3.
ఇంగ్లండ్: సాల్ట్ (సి సబ్) జురెల్ (బి) దూబే 55; డకెట్ (సి) అభిషేక్ (బి) షమి 0; బట్లర్ (సి) తిలక్ (బి) వరుణ్ 7; బ్రూక్ (సి) వరుణ్ (బి) బిష్ణోయ్ 2; లివింగ్‌స్టోన్ (సి) రింకూ (బి) వరుణ్ 9; బెథెల్ (బి) దూబే 10; కార్స్ (సి) వరుణ్ (బి) అభిషేక్ 3; ఒవర్టన్ (సి) సూర్యకుమార్ (బి) అభిషేక్ 1; ఆర్చర్ (నాటౌట్) 1; రషీద్ (సి సబ్) జురెల్ (బి) షమి 6; ఉడ్ (సి సబ్) జురెల్ (బి) షమి 0; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 10.3 ఓవర్లలో 97 ఆలౌట్. వికెట్ల పతనం: 1-23, 2-48, 3-59, 4-68, 5-82, 6-87, 7-90, 8-90, 9-97, 10-97. బౌలింగ్: షమి 2.3-0-25-3; హార్దిక్ 2-0-23-0; వరుణ్ 2-0-25-2; బిష్ణోయ్ 1-0-9-1; దూబే 2-0-11-2; అభిషేక్ 1-0-3-2.
1
టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (135) సాధించిన భారత బ్యాటర్‌గా అభిషేక్. అలాగే జట్టు తరఫున ఒకే మ్యాచ్‌లో ఎక్కువ సిక్సర్లు (13) సాధించడంతో పాటు, పవర్‌ప్లేలో ఎక్కువ రన్స్ (58) సాధించిన బ్యాటర్‌గానూ నిలిచాడు. పవర్‌ప్లేలో భారత జట్టుకిదే (95) అత్యధిక పరుగుల రికార్డు.
ఇన్నింగ్స్ 10.1 ఓవర్లలోనే సెంచరీ పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా అభిషేక్. గతంలో 10.2 ఓవర్లలో డికాక్ విండీ్‌సపై శతకం సాధించాడు.
తొలి 39 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేయడం భారత్‌కిదే తొలిసారి. గతంలో బంగ్లాపై 43 బంతుల్లో సాధించింది.
టీ20ల్లో భారీ (150 రన్స్) తేడాతో ఓడడం ఇంగ్లండ్‌కిదే తొలిసారి.
2
శాశ్వత సభ్య దేశాలతో జరిగిన టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ (37 బంతుల్లో) సాధించిన అభిషేక్. డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ (35 బంతుల్లో) టాప్‌లో ఉన్నారు.
భారత్ తరఫున అభిషేక్‌ది రెండో వేగవంతమైన (17 బంతుల్లో) అర్ధసెంచరీ. తొలి స్థానంలో అతడి మెంటార్ యువరాజ్ (12 బంతుల్లో) ఉండడం విశేషం.
Ind Vs Eng T20: ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టీ20.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు