మహిళల నేర సామ్రాజ్యం
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:10 PM
ఠానేలో రాజీ మధ్యాహ్నం ఉద్యోగస్థులకు లంచ్ బాక్సులు అందించే బిజినెస్ చేస్తుంటుంది. మాల ఆ లంచ్ బాక్సులను అవసరమైన వారికి చేరవేస్తుంటుంది. అయితే తప్పనిసరి పరిస్థితిలో మాల లంచ్ బాక్సులో గంజాయిని కూడా సరఫరా చేయాల్సి వస్తుంది. విషయం తెలిసిన రాజీ కూడా విధి లేక నేరానికి అంగీకరిస్తుంది.

‘గాడ్ ఫాదర్’ మొదలుకుని ‘నాయకన్’ వరకూ డ్రగ్ మాఫియాతో ముడిపడిన నేర సామ్రాజ్యం ఎప్పుడూ శక్తిమంతమైన కథాంశంగా ఉంటూనే వస్తోంది. అయితే ఆ నేర సామ్రాజ్యం పురుషులది. వాళ్ల ఆధిపత్యమే ఎప్పుడూ అందులో కనిపిస్తుంది. మహిళలను కూడా మొదటి సారిగా ఆ నేర సామ్రాజ్యం ముగింట్లోకి తీసుకొచ్చిన వెబ్ సిరీస్ ‘డబ్బా కార్టెల్’.
ఠానేలో రాజీ మధ్యాహ్నం ఉద్యోగస్థులకు లంచ్ బాక్సులు అందించే బిజినెస్ చేస్తుంటుంది. మాల ఆ లంచ్ బాక్సులను అవసరమైన వారికి చేరవేస్తుంటుంది. అయితే తప్పనిసరి పరిస్థితిలో మాల లంచ్ బాక్సులో గంజాయిని కూడా సరఫరా చేయాల్సి వస్తుంది. విషయం తెలిసిన రాజీ కూడా విధి లేక నేరానికి అంగీకరిస్తుంది. డ్రగ్స్ కూడా సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అందుకోసం ఒక అపార్ట్‌మెంటు చూపించిన షాహిదా కూడా వాళ్ళతో జత కలుస్తుంది.
ఒక డ్రగ్ డీలర్ నుంచి బెదిరింపులు వచ్చినపుడు అప్పటికే నేర సామ్రాజ్యంతో పరిచయం ఉన్న రాజీ అత్త షీలా కూడా వాళ్ళకు మద్దతుగా నిలుస్తుంది. వరుణ నడిపే బొటిక్ సరిపడా డబ్బులేని కారణంగా ఇబ్బందుల్లో పడుతుంది. భర్తతో ఉన్న విభేదాల వల్ల అతని నుంచి ఆర్థిక సహాయం ఆశించకుండా తన కాళ్ళపై తాను నిలబడాలని వరుణ ప్రయత్నిస్తుంటుంది. ఆ కారణంగా వరుణ కూడా షీలా బృందంతో డ్రగ్స్ వ్యాపారంలో భాగస్వామిగా చేరుతుంది. వరుణ భర్త శంకర్ నడిపే వివా లైఫ్ అనే మందుల కంపెనీ అనుమతిలేని మాదకద్రవ్యాలను తయారు చేస్తోందన్న ఆరోపణలను ఎదుర్కొంటూ ఉంటుంది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పాఠక్ ఒక మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ సహాయంతో వివా కంపెనీ వ్యవహారాలపై దర్యాప్తు చేస్తుంటాడు.
తప్పని సరై లంచ్ బాక్సుల్లో డ్రగ్స్ సరఫరాను మొదలు పెట్టిన షీలా, రాజీ, మాల, వరుణ, షాహిదా తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది? వాళ్ళ ప్రయత్నంలో విజయం సాధించారా? లేదా? డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పాఠక్ దర్యాప్తు ఏమైంది? అనేదే మిగిలిన కథ.
నేర సామ్రాజ్యం చేతులు చాలా పొడవు. ఎంతమందినైనా తనలో కలిపేసుకోగల సామర్థ్యం దాని స్వంతం. దానికి స్ర్తీ పురుష వివక్ష కూడా లేదు. పట్టుబడకుండా సమర్థవంతంగా నేరం చేయగలగడమే దానికి కావలసింది. రకరకాల అవసరాల కోసం కొందరు, విలాస జీవితం కోసం కొందరు, తమ ప్రమేయం లేకుండా కొందరు... ఇలా కారణం ఏదైనా ఆ విష వలయంలో ఇరుక్కుని వెనక్కి రాలేని వారే అధికం.
పురుషాధిపత్యం ఉన్న నేర సామ్రాజ్యంలోకి సాదాసీదా మధ్యతరగతి గృహిణులు అడుగుపెడితే జరిగే పర్యవసానాల గురించి చెప్పే ప్రయత్నంలో దర్శకుడు హితేష్ భాటియా కొంతవరకు సఫలీకృతుడయ్యారనే చెప్పొచ్చు. తమిళ సినిమా ‘కోకిల’ లో నయనతార టిఫిన్‌బాక్సులో డ్రగ్స్ సరఫరా మొదలుపెట్టి పెద్ద పెద్ద మాఫియా డాన్‌లను కూడా బోల్తా కొట్టించిన దానికి విస్తృత రూపంగా ‘డబ్బా కార్టెల్’ను చెప్పుకోవచ్చు.
ఒక్కొక్కటీ నలభై ఐదు నిముషాల నిడివితో ఏడు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్‌లో ముఖ్యంగా చెప్పుకోవలసింది షబనా అజ్మీ, జ్యోతిక, నిమిషా సజయన్‌ల నటన గురించి. షబనా అజ్మీ గాంభీర్యం, జ్యోతిక హుందాతనం, నిమిషా సజయన్ చలాకీతనం మూడూ కలగలిపి సిరీస్‌కు అదనపు ఆకర్షణగా అనిపిస్తాయి. షాలినీ పాండే, అంజలీ ఆనంద్, జిషుేసన్ గుప్తా కూడా చక్కగా నటించారు.
డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పాఠక్ దర్యాప్తు సన్నివేశాలు మినహా మిగిలిన భాగమంతా ఆసక్తికరంగా ఉత్కంఠ కలిగిస్తూ చకచకా సాగిపోవడానికి పకడ్బందీ స్ర్కిప్టు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. తప్పొప్పులు, మంచీ చెడూ మధ్య సంఘర్షణగా కథను మలిచిన హితేష్ భాటియా డ్రగ్ మాఫియాకు స్ర్తీ పాత్రలను ఎంచుకోవడం ద్వారా సగం మార్కులు కొట్టేస్తారు. నేరసామ్రాజ్యంలోకి ఒకసారి అడుగుపెడితే కొనసాగడం, లేదా చనిపోవడం తప్ప మూడో ఆప్షన్ ఉండదని ఒక పాత్ర ద్వారా చెప్పించిన దర్శకుడు దాని పర్యవసానాలను కూడా చెప్పకనే చెబుతారు.
సిరీస్ క్లయిమాక్స్‌లో పందెపు గుర్రాన్ని పనికిరాదనే కారణంతో కాల్చి చంపిన సన్ని వేశం, రాజీ అత్తగారిని రాజీతోనే కాల్పించిన సన్నివేశం రెండింటినీ ఎవరైనా ఏదైనా ఉప యోగపడేవరకే వాటి మనుగడ అనే నేర సామ్రాజ్యపు తొలిపాఠంగా అర్థం చేసుకోవచ్చు. షేక్‌స్పియర్ ‘మాక్‌బెత్’ నాటకంలో లేడీ మాక్‌బెత్ లార్డ్ డంకన్‌ను భర్తతో చంపిస్తుంది. తర్వాత రకరకాల మానసిక భ్రమలకు లోనై డంకన్‌ను చంపిన రక్తం తన చేతులకు ఇంకా అంటి ఉందని ఎంత కడిగినా పోవడం లేదని అనుకుంటుంది. అరేబియా దేశంలోని పెర్‌ఫ్యూమ్స్ అన్నీ వాడినా తన చేతికి అంటిన మరక పోదని అంటుంది. ఆ సన్నివేశాన్ని తలపించేలా రాజీ తన చేతులకు అంటిన రక్తాన్ని పదేపదే కడుక్కోవడంతో సిరీస్‌లోని చివరి భాగం ముగిసి రాబోయే సిరీస్‌పై ఉత్కంఠ కలిగిస్తుంది.
- జి. లక్ష్మి, 94907 35322
డబ్బా కార్టెల్ (హిందీ వెబ్ సిరీస్)
దర్శకుడు: హితేష్ భాటియా
నటీనటులు: షబనా అజ్మీ, జ్యోతిక, నిమిషా సజయన్, షాలినీ పాండే, అంజలీ ఆనంద్, జిషుేసన్ గుప్తా తదితరులు.
విడుదల: నెట్‌ఫ్లిక్స్