Share News

Wild Boar Attacks: ఫారెస్ట్ అధికారిపై అడవి పంది దాడి.. కాపాడ్డానికి వెళితే..

ABN , Publish Date - Dec 26 , 2025 | 05:50 PM

అడవి పందిని పట్టుకుందామని వెళ్లిన ఫారెస్ట్ అధికారులకు దారుణమైన అనుభవం ఎదురైంది. ఆ అడవి పంది ఓ ఫారెస్ట్ అధికారిపై విచక్షణా రహితంగా దాడిచేసింది. తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Wild Boar Attacks:  ఫారెస్ట్ అధికారిపై అడవి పంది దాడి..  కాపాడ్డానికి వెళితే..
Wild Boar Attacks

మంచి చేయడానికి వెళ్లిన ఓ ఫారెస్ట్ అధికారికి చెడు ఎదురైంది. అడవి పందిని రక్షించాలనుకుంటే ప్రాణం మీదకు వచ్చింది. అడవి పంది ఫారెస్ట్ అధికారిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. దాని దాడిలో ఫారెస్ట్ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బదౌన్ జిల్లా, సిర్సౌలీ గ్రామంలో ఓ అడవి పంది అలజడి సృష్టిస్తోంది. పంట పొలాలకు తీవ్రంగా నష్టం కలిగిస్తూ ఉంది. దీంతో విసుగు చెందిన గ్రామస్తులు పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు.


దీంతో సుభమ్ ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలోని ఫారెస్ట్ అధికారుల బృందం గ్రామానికి వెళ్లింది. అటవీ అధికారులు అడవి పందిని అక్కడినుంచి తరలించడానికి వల ఏర్పాటు చేశారు. వారు అనుకున్నట్లుగానే అడవి పంది వలలో చిక్కింది. అయితే, వలలో పడగానే అది భీకరంగా మారిపోయింది. పట్టుకోవటానికి వెళ్లిన అధికారులపై దాడికి దిగింది. సుభమ్ ప్రతాప్ సింగ్‌పై దాడి చేసి కిందపడేసింది. కిందపడ్డ అతడిపై పళ్లతో విచక్షణా రహితంగా దాడి చేయసాగింది. మిగిలిన అధికారులు కర్రలతో కొట్టినా కూడా అది పక్కకు కదల్లేదు. కర్రలు విరిగిపోతున్నా సరే అది మాత్రం ఆయనపై దాడి చేస్తూనే ఉంది.


దాదాపు 2 నిమిషాల పాటు దాడి చేసింది. తర్వాత ఆయన దాని నుంచి తప్పించుకుని పరుగులు పెట్టాడు. అడవి పంది దాడిలో సుభమ్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలియరాలేదు. ఆ అడవి పంది అధికారులకు దొరికిందా లేదా అన్నది కూడా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ప్రజల నుంచి దాన్ని రక్షించాలని అనుకుంటే.. అధికారులపైనే దాడి చేసింది. మరీ దారుణంగా ఉంది’..‘అయ్య బాబోయ్ మరీ ఇంత దారుణంగా దాడి చేస్తోందేంటి? కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Updated Date - Dec 26 , 2025 | 06:00 PM