Porsche Branded Ghee: నెయ్యి అమ్ముతున్న కాస్ట్‌లీ కార్ల కంపెనీ..
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:42 PM
కాస్ట్‌లీ కార్లు తయారు చేసి అమ్మే కంపెనీ నెయ్యి కూడా తయారు చేసి అమ్ముతోంది. అయితే, అది మన దేశంలో కాదులెండి. అరబ్ దేశమైన దుబాయ్‌లో.
లగ్జరీ కార్లలో పోర్షేకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనికుల ఫేవరైట్ కార్ల బ్రాండ్లలో పోర్షే తప్పకుండా ఉంటుంది. పోర్షే కార్ల బేసిక్ మోడల్ ధర రూ.90లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న పోర్షే కంపెనీ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీ నెయ్యి కూడా అమ్ముతోంది.
అవును.. మీరు విన్నది నిజమే. కాస్ట్‌లీ కార్లు తయారుచేసి అమ్మే కంపెనీ నెయ్యి కూడా తయారు చేసి అమ్ముతోంది. అయితే, అది మన దేశంలో కాదులెండి. అరబ్ దేశమైన దుబాయ్‌లో. కొద్దిరోజుల క్రితం ఇండియాకు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో జరిగిన పోర్షే ఈవెంట్‌కు వెళ్లాడు. అక్కడ పోర్షే కంపెనీ తయారు చేసి అమ్ముతున్న ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిలో నెయ్యి కూడా ఉండటంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.
దీన్నంతా వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియోలో అతడు ‘మనం ఇప్పుడు పోర్షే కంపెనీ ఈవెంట్‌లో ఉన్నాము. ఈ మహిళ నాకు ఓ వస్తువు చూపించింది. ఇంత వరకు అది ఉందని కూడా నాకు తెలీదు. అదే పోర్షే బ్రాండ్ నెయ్యి. నేను జోక్ చేయటం లేదు. అబద్ధం కూడా చెప్పటం లేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని హట్టా గ్రామంలో ఈ నెయ్యిని తయారు చేస్తున్నారు. బయట అమ్ముతున్నారు’ అని చెప్పుకొచ్చాడు. వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
సముద్రంలో బయటపడ్డ 300 ఏళ్ల నాటి సంపద.. విలువ ఎన్ని కోట్లంటే..
హమాస్ శాంతి ఒప్పందానికి సిద్ధమన్న ట్రంప్.. ఇంతలో మళ్లీ ఇజ్రాయెల్ దాడులు